Hyd, Jan 6: తెలంగాణలోని వరంగల్‌లో మైనర్ బాలికపై పలుమార్లు అత్యాచారం (Minor girl repeatedly raped in Warangal) చేసిన ఇద్దరు అన్నదమ్ములు అరెస్టయ్యారు. బుధవారం మిల్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది. మైనర్ బాలికపై సోదరులిద్దరూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగులోకి రావడంతో వరంగల్‌లోని మిల్స్ కాలనీ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిందితులు 27, 22 ఏళ్ల వయస్సు గల మైనారిటీ వర్గానికి చెందిన వారు.
బీసీ వర్గానికి చెందిన 15 ఏళ్ల బాధితురాలిపై గతంలో కూడా పలుమార్లు అత్యాచారం జరిగినట్లు అధికారులు వెల్లడించారు.దీంతో బాధితురాలి కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే విచారణ చేపట్టి గురువారం మధ్యాహ్నం నిందితులను అదుపులోకి (2 brothers arrested ) తీసుకున్నారు.
నిందితులిద్దరిపై లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.కాగా నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా యువమోర్చా (బీజేవైఎం) కార్యకర్తలు నిరసనకు దిగారు. నిరసన సందర్భంగా నిందితుడి నివాసం కూడా ధ్వంసమైనట్లు ఆరోపణలు వచ్చాయి.
వరంగల్ పోలీసుల కథనం ప్రకారం.. బతుకుదెరువు కోసం ఇద్దరు కుమార్తెలతో కలసి దంపతులు వరంగల్‌కు వలస వచ్చారు. వెంకట్రామ జంక్షన్ సమీప కాలనీలోని బంధువుల ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. వారి పెద్ద కుమార్తె పదో తరగతి, చిన్న కుమార్తె 8వ తరగతి చదువుతున్నారు. కాగా, దయానంద్ కాలనీకి చెందిన ఓ పాత ఫర్నిచర్ షాపు యాజమాని ఎండీ ఆయూబ్ అలీకి అజ్మత్ అలీ(26), అక్బర్ అలీ(22) అనే కుమారులు ఉన్నారు.
వీరిద్దరూ పదో తరగతి చదివే బాలికపై కన్నేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వీరికి ఆ బాలికతో పరిచయం ఏర్పడింది. బాలిక ఇద్దరినీ అన్నా అంటూ పిలిచేది. దీంతో వారి మధ్య చనువు ఏర్పడింది. కానీ అన్నదమ్ములు ఆ బాలికకు మాయమాటలు చెప్పి, ఒంటరిగా ఉన్నది చూసి ఇంట్లోకి రప్పించుకుని ఒకరికి తెలియకుండా మరొకరు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇలా ఆరునెలలుగా బాలికపై పలుమార్లు వేర్వేరుగా లైంగికదాడికి పాల్పడ్డారు. బాలిక ఇన్‌స్టాగ్రామ్‌కు వారు అసభ్యకరమైన మెసేజ్‌లు పోస్ట్ చేయడంతో ఇటీవల విషయం తండ్రికి తెలిసింది. తల్లిదండ్రులు కుమార్తెను నిలదీయడంతో అన్నదమ్ములు అత్యాచారానికి పాల్పడినట్లు చెప్పింది.