
Hyderabad, December 22: తెలంగాణలో కొవిడ్19 ఇంకా కొనసాగుతోంది, రాష్ట్రంలో కొత్తగా నమోదయ్యే కేసులు మళ్లీ పెరిగాయి. నిన్నటికంటే ఈరోజు రెట్టింపు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. ఇక ఒకవైపు త్వరలో వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ఆశగా ఎదురుచూస్తున్న తరుణంలో కరోనావైరస్ రూపాంతరం చెంది మరో కొత్త వైరస్ లా అవతరించిందనే వార్తలు ఇప్పుడు ప్రజలను మళ్లీ కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలంటూ ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇక రాష్ట్రంలోని కేసుల విషయానికి వస్తే, రాష్ట్ర ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 45,227 మందికి చెందిన శాంపుల్స్ పరీక్షించగా కొత్తగా మరో 551 మందికి పాజిటివ్ అని తేలింది. అయితే ఇంకా 592 మంది శాంపుల్స్ కు చెందిన రిపోర్ట్స్ రావాల్సి ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 65,20,993 మందికి టెస్టులు నిర్వహించినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది.
తాజాగా కన్ఫర్మ్ చేయబడిన కేసులను కలిపితే రాష్ట్రంలో మొత్తం COVID-19 బాధితుల సంఖ్య 282,347కి చేరుకుంది. నిన్నటి వరకు నమోదైన మొత్తం కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 103 మందికి కోవిడ్ సోకినట్లు నిర్ధారణ కాగా, రంగారెడ్డి నుంచి 51, మేడ్చల్ నుంచి 52, వరంగల్ అర్బన్ మరియు కరీంనగర్ జిల్లాల్లో చెరో 41 కేసుల చొప్పున నిర్ధారించబడ్డాయి. రాష్ట్రంలోని మిగతా జిల్లాల్లో కొత్తగా నమోదైన కేసుల వివరాలు కింద బులెటిన్ లో గమనించవచ్చు.

నిన్న సాయంత్రం వరకు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 33 జిల్లాల నుంచి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఆరోగ్యశాఖ అందించిన రిపోర్ట్ ప్రకారం, ఈ ఒక్కరోజులో పాజిటివ్ కేసులు నమోదైన జిల్లాల వివరాలు ఇలా ఉన్నాయి.

మరోవైపు గత 24 గంటల్లో మరో 3 కొవిడ్ మరణాలు సంభవించాయి. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1,518కు పెరిగింది.
అలాగే, సోమవారం సాయంత్రం వరకు మరో 635 మంది మంది కొవిడ్ బాధితులు పూర్తిగా కోలుకొని ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల్లో 274,260 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 6,569 ఆక్టివ్ కేసులు ఉన్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.