Hyderabad, July 19: టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కోకాపేట భూముల సందర్శనకు (Kokapet lands) ఈరోజు వెళతానని ఆయన ప్రకటించారు. కోకాపేట భూముల సందర్శనకు జగ్గారెడ్డి, దామోదర రాజనర్సింహ, మహేష్‌గౌడ్ నేతృత్వంలోని టీపీసీసీ కమిటీతో కలిసి వెళ్లనున్నట్లు ప్రకటించడంతో రేవంత్ రెడ్డి ఇంటి వద్ద తెల్లవారుజామున నుంచి భారీగా పోలీసులను మొహరించారు. రేవంత్‌రెడ్డి గృహ నిర్బంధం (TPCC Chief Revanth Reddy placed under house arrest) చేసి ఇంటి వద్ద భారీగా బలగాలను మోహరించారు.
తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై లోక్‌సభ స్పీకర్‌కు టీపీసీసీ చీఫ్, ఎంపీ రేవంత్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండా అడ్డుకుని తన హక్కులకు భంగం కలిగించారంటూ రేవంత్ ఫిర్యాదు చేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు పొన్నాల లక్ష్మయ్య, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కను కూడా పోలీసులు గృహనిర్బంధం చేశారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలో ప్రభుత్వం వేలం వేసిన భూముల (Hyderabad Kokapet lands) సందర్శన, ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే పోలీసులు (TS Police) రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూముల అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో కోకాపేటలో వేలం వేసిన భూముల వద్ద కాంగ్రెస్ నేతలు నిరసనకు ప్లాన్ చేశారు. దీంతో పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్‌లు చేస్తున్నారు.
మరోవైపు కోకాపేట భూముల (Kokapet lands) వద్దకు మాజీ ఉపముఖ్యమంత్రి, పీసీసీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ దామోదర రాజనర్సింహ, పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, జగ్గారెడ్డి, మహేశ్‌కుమార్ గౌడ్, రంగారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షుడు నరసింహారెడ్డి తదితరులు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వారిని కూడా పోలీసుల అడ్డుకునే అవకాశముంది. ఇటీవల జరిగిన కోకాపేట భూముల వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. దీనిలో భాగంగానే ఆ భూముల సందర్శనకు పిలుపునిచ్చింది.
పార్లమెంట్‌లో కోకాపేట భూముల అవినీతిని ఎండగడతారనే భయంతోనే కాంగ్రెస్ నేతలను అడ్డుకుంటున్నారని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆరోపించారు. ఇది అప్రజాస్వామికమని.. ఇంత దుర్మార్గం ఎక్కడా చూడలేదన్నారు. ఈ నియంత పాలనకు, అవినీతి పాలకులకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చెప్పారు.
రంగారెడ్డి జిల్లా కోకాపేటలోని 49.92 ఎకరాలను ఎంఎస్‌టీసీ వెబ్‌సైట్ ద్వారా హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) వేలం నిర్వహించింది.. ఒక్కో ఎకరం కనీస ధర రూ.25 కోట్లుగా నిర్ధారించగా.. వేలంలో రూ.60 కోట్లు పలికింది.. అత్యధికంగా ఎకరాకు రూ. 60.2 కోట్లు ధర పలకగా.. అత్యల్పంగా ఎకరానికి రూ. 31.2 కోట్లు వెచ్చించారు.. యావరేజిగా ఎకరానికి రూ. 40.05 కోట్లు పలికినట్టు అయ్యింది.. మొత్తంగా కోకాపేట భూముల వేలం ద్వారా రూ.2000.37 కోట్ల ఆదాయం లభించింది.
బిడ్డింగ్‌లో 63 మంది పాల్గొనగా, 8 ప్లాట్లను అమ్మారు. వేలంలో 63 కంపెనీలు బరిలో నిలవగా.. ప్లాట్లను దక్కించుకున్న కంపెనీలన్నీ హైదరాబాద్ కు చెందినవే ఉన్నాయి. ఇందులో నాలుగు రియల్ ఎస్టేట్ కంపెనీలు, పలు ఫార్మా కంపెనీల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. రాజపుష్ప రియాలిటీ సంస్థ10 ఎకరాల విస్తీర్ణంలోని రెండు ప్లాట్లను రూ. 500 కోట్లకు దక్కించుకుంది. అయితే, ఒక ప్రముఖ నిర్మాణ రంగ సంస్థకు చెందిన అనుబంధ కంపెనీలే ఈ వేలంలో చురుగ్గా పాల్గొని భూములను చేజిక్కించుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
అయితే, ఈ భూముల వేలం వెనుక వెయ్యి కోట్ల కుంభకోణం జరిగిందని తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కోకాపేట్ భూముల వేలంలో జరిగిన భారీ స్కామ్ వివరాలు బయట పెడతానని ప్రకటించారు.. ఎకరా రూ.60 కోట్లు పలకాల్సిన భూమి కేవలం రూ.30 కోట్లకే దోచేశారని రేవంత్ రెడ్డి తెలిపారు. టెండర్లు వేయకుండా కొంత మందిని మేనేజ్ చేశారని.. కేసీఆర్ తన బినామీలు, పార్టీ వారి కోసమే మేనేజ్ చేశారని ఆరోపించారు. రూ.3వేల కోట్ల ఆదాయం రావాల్సిన చోట రూ.2వేల కోట్లే వచ్చాయన్నారు. వేలంలో పాల్గొన్న కంపెనీలతో ముఖ్యమంత్రి కేసీఆర్ లావాదేవీలనూ బయటపెడతానని రేవంత్ వెల్లడించారు.
రిటైరైన కేసీఆర్ బంధువులు కొందరు విదేశీ పాస్‌పోర్టులు తెచ్చుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో దోచుకుని విదేశాలకు పారిపోయేందుకు సిద్ధంగా ఉన్నారని ఆరోపించారు. అవినీతికి పాల్పడకపోతే విదేశాలకు పారిపోయేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ప్రశ్నించారు. అలాంటివారి వివరాలనూ బయటపెడతామన్నారు. విదేశీ పాస్‌పోర్టులు తీసుకున్న బంధువుల లెక్కను సీఎం చెప్పాలని రేవంత్ డిమాండ్ చేశారు. ‘‘ఐజీ ప్రభాకర్‌రావు అన్ని పార్టీల నేతల ఫోన్లు ట్యాప్ చేయిస్తున్నారు.
ఇజ్రాయెల్ సాంకేతికత తెప్పించి మరీ హ్యాక్ చేయిస్తున్నారు. తీవ్రవాదుల జాడ కోసం తెచ్చిన సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్నారు. ఐజీ ప్రభాకర్‌రావు ప్రైవేటు సైన్యాన్ని నడిపిస్తూ దేశద్రోహ చర్యలకు పాల్పడుతున్నారు. కేసీఆర్ బంధువులైన ఎస్పీలు నర్సింగరావు, రాఘవేంద్రరావు ఐజీకి సహకరిస్తున్నారు. రిటైరైన కేసీఆర్ బంధువులకు కీలక బాధ్యతలు అప్పగిస్తున్నారు’’ అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
పీసీసీ ప్రెసిడెంట్ అయినా కూడా రేవంత్ రెడ్డి వైఖరిలో మార్పు రావడం లేదు. రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్‌కు బ్రాండ్ అంబాసిడర్ అని టీఆరెస్ జనరల్ సెక్రటరీ బోడకుంటి వెంకటేశ్వర్లు అన్నారు. కోకాపేట భూముల వేలంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని విమర్శించారు. కోకాపేట భూముల టెండర్లు పెట్టింది కేంద్ర ప్రభుత్వ సంస్థ అన్నారు. ఆన్‌లైన్ టెండరింగ్‌లో రేవంత్ రెడ్డి వంద కోట్లకు ఎకరా వేయంగా ఎవరు అడ్డుకున్నారని ప్రశ్నించారు. టెండర్ల విధానం తెలంగాణ ఒక్కటే కాదు. దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలు అవలంబిస్తున్నాయన్నారు.