Inter-State Bus Services: తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సుల రాకపోకలు, సెప్టెంబర్ 14న ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు భేటీ వార్తలపై స్పందించిన తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
Image used for representational purpose. TSRTC Buses. | Photo - Wikimedia Commons

Hyderabad, Sep 12: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు (Inter-State Bus Services) నడపడానికి ఉన్న ప్రతిబంధకాలను తొలగించే లక్క్ష్యంతో ఇరు రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులు (Transport ministers of Telugu States) పేర్ని నాని, పువ్వాడ అజయ్ సెప్టెంబర్ 14న హైదరాబాద్‌లో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి రెండు రాష్ట్రాల ఆర్టీసీ ఎండీలు, సంబంధిత ఉన్నత అధికారులు హాజరుకానున్నారు. ఎలాగైనా ఆర్టీసీ సర్వీసులను పునరుద్ధరించేందుకు ఉన్న అవకాశాలను ఇరు రాష్ట్రాల రవాణా మంత్రులు చర్చించనున్నారు. కాగా కరోనా వ్యాప్తి (COVID-19 pandemic) కారణంగా లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు నడవడం లేదు.

ఇటీవల లాక్‌డౌన్‌ (Lockdown) ఎత్తివేడంతో ఇరు రాష్ట్రాల్లో ఆర్టీసీ బస్సులు ప్రారంభమైనప్పటికీ రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు మాత్రం ప్రారంభం కాలేదు. దీనిపై ఇరు రాష్ట్రాల రవాణాశాఖ అధికారుల మధ్య జరిగిన చర్చలు ఎలాంటి ఫలితం లేకుండానే ముగిశాయి. ఇరు రాష్ట్రాల నుంచి సమానంగా సర్వీసులు నడపాలని తెలంగాణ పట్టుబడుతున్న నేపథ్యంలో నిలిచిపోయిన చర్చలను ఎలాగైనా ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు మరోసారి సిద్ధమవుతున్నాయి.

బస్సు సర్వీసుల పునరుద్ధరణ, టీఎస్ఆర్టీసీకి కీలక ప్రతిపాదన చేసిన ఏపీఎస్ఆర్టీసీ, బస్సు సర్వీసులను పెంచుకోవాలని లేఖ రాసిన ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య ఇప్పటికే ఆర్టీసీ విషయంలో పలుమార్లు చర్చలు జరిగినా ఫలితం కనిపించడం లేదు. ఏపీ క్యాబినెట్‌లో కూడా దీనిపై చర్చించారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ సూచనతో అధికారులు తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం బస్సుల రూట్లు కుదించాలని తెలంగాణ చెబుతోంది. అంతర్‌ రాష్ట్ర ఒప్పందం కోసం చర్చలకైనా సిద్ధం అని చెబుతున్నారు. వచ్చే సమావేశంలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

అయితే అంతరాష్ట్ర బస్సుల రవాణా విషయంలో సోమవారం ఎలాంటి మంత్రుల స్థాయి సమావేశం లేదని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఆంధ్రప్రదేశ్‌ రవాణా శాఖ మంత్రితో ఎలాంటి అధికారిక సమావేశం ఫిక్స్ చేయలేదు. కిలోమీటర్ బేసిస్లో రెండు తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ అధికారుల ఒప్పందం తర్వాతే మంత్రుల సమావేశం జరుగుతుంది. అప్పటిదాకా కేవలం అధికారుల స్థాయి సమావేశాలు కొనసాగుతాయి’ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పేర్కొన్నారు.

ఇదిలా ఉంటే ఈ నెల 20 నుంచి ప్రధాన నగరాల్లో సిటీ బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 20 నుంచి 26 వరకు గ్రామ/వార్డు సచివాలయ పోస్టుల రాతపరీక్షలు ఉండడంతో అభ్యర్థులకు రవాణా సౌకర్యం కల్పించాల్సి ఉంది. 10 లక్షల మంది పరీక్షలు రాస్తుండటంతో ఇందుకు తగ్గట్టుగా ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు.

రాష్ట్రంలో మే 21 నుంచి బస్సు సర్వీసులను ప్రారంభించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అన్ని జిల్లాల్లో రోజూ 3 వేలకు పైగా సర్వీసులను తిప్పుతూ 3.50 లక్షల మందిని ఆర్టీసీ చేరవేస్తోంది. అయితే విజయవాడ, విశాఖపట్నంలలో సిటీ బస్సు సర్వీసులను ప్రారంభించలేదు.