CM KCR - Kaleshwaram Water | Photo: CMO

Sangareddy, April 06: తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక కాళేశ్వర ప్రాజెక్టు ప్రస్థానంలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృత‌మైంది. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి సంగారెడ్డి కాలువలో పారుతున్న కాళేశ్వర జలాలను వర్గల్‌ మండలం అవుసులపల్లి గ్రామంలో సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ కాల్వలోకి కాళేశ్వర జలాలను విడుదల చేశారు. ఎండకాలంలోనూ సాగు కోసం నీరు అందేలా సంగారెడ్డి కాలువలోకి నీరు విడుదలయింది. దీంతో మెదక్, సిద్ధిపేట జిల్లాల్లో చెరువులు నిండటంతో పాటు సుమారు 14 వేల ఎకరాలకు సరిపడా తక్షణ సాగునీరు లభ్యత ఇప్పుడు సాధ్యమైంది.

తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం, ఆ దిశగా చేపట్టిన కార్యాచరణ నేడు మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇదివరకు మేడిగడ్డ నుండి మిడ్ మానేరుకు చేరిన కాళేశ్వరం జలాలు, ఆ తర్వాత అక్కడి నుంచి కొండపోచమ్మసాగర్ కు చేరుకున్నాయి. నేడు మెదక్, సిద్ధిపేట జిల్లాలకు విడుదలయ్యాయి. ఈరోజు వివిధ ప్రాంతాల నుంచి కాళేశ్వరం జలాల విడుదల కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్, మొదటగా కొండపోచమ్మ సాగర్ జలాలను హల్దీ వాగులోకి వదిలి, అనంతరం మంజీరా నది ద్వారా నిజాం సాగర్ కు తరలించే కార్యక్రమం చేపట్టారు తదనంతరం, కొండపొచమ్మసాగర్ జలాలను గజ్వేల్ కెనాల్ నుంచి సిద్దిపేట జిల్లాలోని 20 చెరువులను నింపేందుకు వదిలారు. దీంతో కాళేశ్వర ప్రాజెక్టు విస్తరణలో మంగళవారం మరో చారిత్రక ఘట్టం ఆవిష్కృతమైంది.

మంగళవారం ఉదయం ప్రత్యేక బస్సులో, సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం అవుసులపల్లి కి చేరుకున్న సీఎం కేసీఆర్ అక్కడ కాళేశ్వర జలాలకు ప్రత్యేక పూజలు చేశారు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ నుంచి జలాలను విడుదల చేశారు. ఈ జలాలు సంగారెడ్డి కెనాల్‌ నుంచి హల్దీ వాగు ద్వారా నిజాం సాగర్ కు చేరుకుంటాయి. ఆ తర్వాత, మర్కూక్‌ మండలం పాములపర్తి గ్రామానికి చేరుకున్న సీఎం ప్ర‌త్యేక పూజ‌లు చేసి, కాళేశ్వర జలాలను గజ్వేల్‌ కాల్వలోకి విడుదల చేశారు. ఈ జలాలు పరిసర ప్రాంతాల్లోని పాముల పర్తి చెరువు, పాతురు చెరువు, చేబర్తి చెరువు, ప్రజ్ఞాపూర్, గజ్వేల్, కేసారం, బయ్యారం, జాలియామా తదితర 20 చెరువులను నింపుతాయి.

సీఎంతో పాటు ఈ కార్య‌క్ర‌మాల్లో స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హ‌రీష్ రావు, వేముల ప్ర‌శాంత్ రెడ్డి, పలువ్రు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.