Hyd, Oct 11: తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెలలో బంగాళాఖాతంలో రెండు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఇందులో భాగంగా ఇప్పటికే పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
నిన్న రాష్ట్ర వ్యాప్తంగా పలుచోట్ల వర్షపాతం నమోదయింది. ఈరోజు పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రేపు భూపాలపల్లి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, కొత్తగూడెం, ములుగు, ఖమ్మం, మహబూబాబాద్, హన్మకొండ, సూర్యాపేట, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆదివారం నాడు వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్, సూర్యాపేట, నల్గొండ, మంచిర్యాల, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జోగులాంబ గద్వాల, నారాయణపేట జిల్లాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది.
ఏపీకి పొంచిఉన్న వాయుగుండం ముప్పు.. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం.. వాతావరణ శాఖ హెచ్చరికలు
దక్షిణ బంగాళాఖాతంలో ప్రస్తుతం ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రానున్న 4 రోజుల్లో ఇది కాస్తా అల్పపీడనంగా మారనుందని వాతావరణ శాఖ తెలిపింది. అక్టోబర్ 13-15 మధ్య వాయుగుండంగా మారవచ్చని అంచనా. ఈ ప్రభావంతో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు కురవనున్నాయి. ఈ క్రమంలో తెలంగాణలోని 12 జిల్లాలకు ఐఎండీ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని మంచిర్యాల, నిర్మల్, ములుగు, వనపర్తి, అదిలాబాద్, కొమురం భీమ్ ఆసిఫాబాద్, జయశంకర్ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
అటు హైదరాబాద్‌లో కూడా మోస్తరు వర్షం కురిసింది. ఎస్సార్ నగర్, మాదాపూర్, బోరబండ, మోతి నగర్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షం పడింది. రానున్న 3 రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని 12 జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయి. తిరోగమన రుతు పవనాల ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో భారీ వర్షాలు పడుతున్నాయి. తమిళనాడులోని 8 జిల్లాలకు ఆరెంజ్ ఆలర్ట్ జారీ చేసింది ఐఎండీ. చెన్నై, పుదుచ్చేరి సహా 6 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది.