Donald Trump and Kamala harris (Photo-ANI)

New York, Oct 23: యునైటెడ్ స్టేట్స్ అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌ 5న జరగనున్నాయి.ఈనేపథ్యంలో నిర్వహించిన ముందస్తు ఎన్నికల్లో దాదాపు 2.1 కోట్ల మంది ప్రజలు ఓటుహక్కు వినియోగించుకున్నట్లుగా యూనివర్సిటీ ఆఫ్‌ ఫ్లోరిడాలోని ఎలక్షన్‌ ల్యాబ్‌ వెల్లడించింది. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి కమలాహారిస్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌లు పోటీపడుతున్నారు.

నవంబర్‌ 5న దేశవ్యాప్తంగా పోలింగ్‌ ప్రక్రియ జరగనుంది. ఇందులో భాగంగా ఏర్పాటుచేసిన ముందస్తు పోలింగ్‌ సౌకర్యాన్ని 78 లక్షల మంది వినియోగించుకోగా.. మెయిల్ బ్యాలెట్‌ ద్వారా మరో 1.33 కోట్ల మంది ఓటేసినట్లు ఎలక్షన్‌ ల్యాబ్‌ పేర్కొంది. భారత సంతతి అమెరికన్లు కూడా పెద్దసంఖ్యలో తమ ఓటుహక్కును వినియోగించుకున్నట్లు తెలిపింది.

అమెరికాలో ఘోరం.. రేడియో ట‌వ‌ర్‌ ను ఢీకొన్న హెలికాప్ట‌ర్‌.. న‌లుగురు మృతి.. వీడియో ఇదిగో

ఎలక్షన్ ల్యాబ్ తెలిపిన వివరాల ప్రకారం... ప్రస్తుతం ఓటుహక్కు వినియోగించుకున్నవారిలో 41.3 మంది రిపబ్లికన్లు ఓటింగ్‌లో పాల్గొనగా.. 33.6 శాతం మంది డెమోక్రాట్‌లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు.ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పార్టీ భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉందని అక్కడి రాజకీయ నిపుణులు విశ్లేషణ చేస్తున్నారు. అరిజోనా, నెవాడా, విస్కాన్సిన్, మిచిగాన్, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా, జార్జియాలోని ఏడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విజేతను నిర్ణయిస్తాయని నిపుణులు పేర్కొంటున్నారు.

ఇక పోలింగ్‌కు 2 వారాలే ఉండటంతో అధ్యక్ష అభ్యర్థులిద్దరూ హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. 5.3 శాతం ఉన్న తటస్థ ఓటర్ల ఓట్లు కోసం రిపబ్లికన్‌ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్, డెమోక్రటిక్‌ అభ్యర్థి కమలాహారిస్‌లు గట్టిగానే ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతానికి అన్ని పోల్స్‌లోనూ హారిస్‌కు 2.1 శాతం మొగ్గు కనిపిస్తోంది. అయితే 5.3 శాతం ఓటర్లు ఎటువైపు మొగ్గుతారనే దానిపైనే తీవ్ర ఉత్కంఠ నెలకొంది.