New Delhi, Nov 17: సరిగ్గా గతేడాది ఇదే రోజు (coronavirus, first case) కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచానికి పరిచయమైంది. ఇప్పటికీ ముప్పతిప్పలు పెడుతోంది. ఎన్నో విషాద గాథలు, మరోన్నో నిద్రలేని రాత్రులు..ఉంటామా పోతామా తెలియని పరిస్థితి, వైరస్ వస్తే బతుకుతామా లేదా అనే దానిపై సందేహం..వెరసి కరోనా వైరస్ ప్రపంచానికి వణుకుపుట్టిస్తోంది. ఇప్పటికి కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదంటే దాని విశ్వరూపం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
కోవిడ్ కథలు అని ఓ పుస్తకం తయారు చేయాలనుకుంటే అది పెద్ద గ్రంథమే అవుతుంది. ప్రతి ఇంటిలో కోవిడ్ విషాధ గాధలు కనిపిస్తాయి. లాక్ డౌన్ కథలు వినిపిస్తాయి. గతేడాది నవంబర్ 17న ( 17 November 2019) చైనాలోని హుబేయి ప్రావిన్సులో తొలిసారిగా కేసు (Covid Completes One Year) నమోదైంది. ఈ విషయాన్ని హాంకాంగ్ పత్రిక ‘ది సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలిపింది.నిజానికి ఈ వైరస్ ఎప్పుడు వెలుగు చూసిందనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అయితే, చైనా ప్రభుత్వ సమాచారాన్ని ఉదాహరిస్తూ ఈ పేపర్ కథనాన్ని రాసింది.
గతేడాది సరిగ్గా ఇదే రోజున హుబేయి ప్రావిన్సులో ( Hubei province in China) 55 ఏళ్ల వ్యక్తిలో తొలుత కరోనా వైరస్ వెలుగు చూసిందని, అదే తొలి కేసు అని పేర్కొంది. అయితే, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) మాత్రం డిసెంబరు 8న తొలి కేసు నమోదైనట్టు చెబుతోంది. ‘ది లాన్సెట్’ అయితే డిసెంబరు 1న తొలి కేసు వెలుగు చూసినట్టు పేర్కొంది. వైరస్ వెలుగులోకి వచ్చిన తొలి రోజుల్లో రోజుకు ఐదు కేసులు నమోదయ్యేవి. డిసెంబరు 15 నాటికి మొత్తం కేసులు 27 మాత్రమే. తొలుత ఇవి మామూలు కేసులేనని వైద్యులు భావించారు. అయితే, హుబేయికి చెందిన ఓ వైద్యుడు వైరస్ తీవ్రతను గుర్తించి ప్రపంచానికి హెచ్చరికను జారీ చేశారు.
అది మామాలు వైరస్ కాదని, ఇదో కొత్తరకం వైరస్ అని, అప్రమత్తం కాకుంటే ప్రపంచం మొత్తాన్ని కబళించేస్తుందని హెచ్చరించాడు. ఈ వైరస్ గబ్బిలం నుంచి కానీ, మరేదైనా జంతువు నుంచి కానీ మానవులకు సోకి ఉంటుందని చెబుతున్నారు. కచ్చితంగా ఎలా వచ్చిందన్నది మాత్రం చెప్పలేకపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ వైరస్ బారినపడిన తొలి వ్యక్తి (పేషెంట్ జీరో) ప్రస్తుత పరిస్థితి ఏంటో తెలుసుకోవాలని శాస్త్రవేత్తలు ఆసక్తిగా ఉన్నారు.
చైనాలోని హుబేయి ప్రావిన్సులో వెలుగు చూసిన ఈ మహమ్మారి వైరస్ ఆ తర్వాత ప్రపంచం మొత్తాన్ని చుట్టేసింది. చిన్నదేశం, పెద్ద దేశం అన్న తేడా లేకుండా గ్లోబల్ ను వణికిస్తోంది.ఈ వైరస్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలాయి. ప్రపంచవ్యాప్తంగా 5.50 కోట్ల మంది ఈ ప్రాణాంతక వైరస్ బారినపడగా, ప్రాణనష్టం కూడా భారీగానే జరిగింది. 13 లక్షల మందికిపైగా ఈ వైరస్ కారణంగా మృత్యువాత పడ్డారు. ఇక ఈ ఏడాది జనవరి 30న మన దేశంలో కేరళలో తొలి కేసు నమోదవడంతో, భారత్‌లో ఈ వైరస్ ఉనికి వెలుగులోకి వచ్చింది.