Pyongyang, October 11: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్-ఉన్ (Kim Jong-un) కన్నీళ్లు పెట్టుకున్నారు. మీకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తరకొరియా కమ్యునిస్టు పార్టీ ఏర్పాటై 75 సంత్సరాలు పూర్తైన నేపథ్యంలో శనివారం నాడు కిమ్ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ భావోద్వేగానికి (sobbing tears) లోనయ్యారు. ఉత్తర కొరియా ఇప్పుడు తీవ్ర ఆహార సంక్షోభాన్ని (North Korea crisis) ఎదుర్కుంటోంది.
ఈ నేపథ్యంలో అధినేత.. మీరు నాపై ఉంచిన నమ్మకానికి ప్రతిఫలంగా నేను తగినంత చేయలేకపోయినందుకు సిగ్గుపడుతున్నాను. దేశ ప్రజలను కష్టాల నుంచి గట్టెక్కించేందుకు నేను చేసిన ప్రయత్నాలు సరిపోలేదని వ్యాఖ్యానించారు.దేశ అభ్యున్నతి కోసం అనేక ఆర్థిక లక్ష్యాలను నిర్దేశించుకున్నా కరోనావైరస్, తుఫాను వంటి వైపరీత్యాలు, అంతర్జాతీయ ఆంక్షలు తనకు అడ్డుపడుతున్నాయని ఉత్తర కొరియా అధినేత నిస్సహాయత వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా జరిగిన మిలిటరీ పరేడ్‌లో (Military Parade 2020) ఉత్తరకొరియా ప్రభుత్వం మునుపెన్నడూ చూడని ఓ భారీ ఖండాంతర క్షిపణిని (intercontinental ballistic missiles) ప్రదర్శించింది. పాశ్చాత్య దేశాల రక్షణ రంగ నిపుణులు ఈ మిస్సైల్‌ను ‘రాకాసి’గా ( North Korea unveils monster) అభివర్ణించారు. సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధ సంపత్తిని ఉత్తరకొరియా ప్రదర్శించడం గత రెండేళ్లలో ఇదే తొలిసారి. రష్యాకు చెందిన ఆర్-16, ఆర్-26 మిస్సైల్స్ కంటే ఇది శక్తివంతమైనది నిపుణులు చెబుతున్నారు.
రాబోయే నెలల్లో ఉత్తరకొరియా ఈ క్షిపణికి సంబంధించి మరిన్ని ప్రయోగాలు జరిపే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా..ఈ సందర్భాన్ని పురస్కరించుకుని చైనా అధ్యక్షుడు జీ జింగ్ పింగ్ ఉత్తరకొరియాకు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల దౌత్య సంబంధాలను మరింతగా బలోపేతం చేయడమే తన లక్ష్యమని ఆయన తెలిపారు.
ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా (coronavirus threat) సోకలేదని ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తెలిపారు. దేశంలో ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాకపోవడం గొప్ప విషయమని ఆయన అన్నారు. పాలక వర్కర్స్ పార్టీ ఆఫ్ కొరియా 75 వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం జరిగిన మిలిటరీ పరేడ్ నుద్దేశించి ప్రసంగించిన కిమ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు ఆ దేశ మీడియా పేర్కొంది. ఈ ఏడాది జనవరి నుంచి సరిహద్దులను మూసివేయడంతో పాటు తగిన జాగ్రత్తలు తీసుకోవడంతో తమ దేశంలో కరోనా వ్యాపించలేదని ఉత్తర కొరియా ఇప్పటి వరకు చెబుతూ వచ్చింది.
అయితే ఇటీవల సరిహద్దు నుంచి ఉత్తర కొరియాలోకి అక్రమంగా ప్రవేశించిన ఓ వ్యక్తికి కరోనా లక్షణాలున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందా లేదా అన్నది ఆ దేశ అధికారులు స్పష్టం చేయలేదు. మరోవైపు కరోనా నియంత్రణ చర్యలు పాటించాలని ఇటీవల దేశ ప్రజలను కోరడం ప్రాధాన్యత సంతరించుకున్నది. ఈ పరిణామాల నేపథ్యంలో ఉత్తర కొరియాలో ఒక్కరికి కూడా కరోనా సోకలేదంటూ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తాజాగా స్పష్టం చేశారు.