Pakistan Trained Al-Qaeda: అవును..ఆల్-ఖైదాకు మేమే ట్రైనింగ్ ఇచ్చాం! అంగీకరించిన పాక్ ప్రధాని, బాలాకోట్‌ వార్తలపై ఖండన, మధ్యవర్తిత్వంపై మరోమారు వ్యాఖలు చేసిన ట్రంప్
Jammu and Kashmir, Indian PM Narendra Modi, US President Donald Trump and Pakistan PM Imran Khan. (Photo Credit: PTI)

New  York, September 24:  ఆల్-ఖైదాకు దాయాది దేశం పాకిస్తాన్ (Pakistan) ట్రైనింగ్ ఇస్తుందని గత కొంత కాలంగా  భారత్ చేస్తున్న వాదనలకు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) బలం చేకూర్చారు. న్యూయార్క్‌లో 'కౌన్సిల్ ఆన్ ఫారెన్ రిలేషన్స్ (సీఎఫ్ఆర్)' ( Council On Foreign Relations) అనే ఓ మేధో సంస్థ ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాక్ ప్రధాని మాట్లాడుతూ ‘‘అవును మీరన్నది నిజమే.. అల్-ఖైదాకు మా దేశమే శిక్షణ ఇచ్చింది. సోవియట్ సైన్యంతో పోరాడటానికి అఫ్గానిస్తాన్‌లో మిలిటెంట్ బృందాలను పాక్ తయారు చేసింది’’అని చెప్పుకొచ్చారు. 1980లో సోవియట్ యూనియన్ అఫ్గానిస్తాన్‌పై దాడి చేసిన సమయంలో అమెరికాతో కలిసి పాకిస్తాన్ దీన్ని ప్రతిఘటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలిటెంట్లను పిలిపించి, పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ శిక్షణ ఇచ్చింది. సోవియట్ యూనియన్‌కు వ్యతిరేకంగా జిహాద్ చేసేందుకు సిద్ధం చేసింది. ఇలా మిలిటెంట్ సంస్థలను తయారుచేసిందని ఇమ్రాన్ వివరించారు.

ఆ తర్వాత 1989లో సోవియట్ సేనలు అఫ్గానిస్తాన్‌ను విడిచిపెట్టాయని, ఆ తర్వాత అమెరికా కూడా పాకిస్తాన్ నుంచి వెళ్లిపోయిందని ఈ సంధర్భంగా ఇమ్రాన్ అన్నారు. అప్పటి నుంచి జిహాదీ బృందాలు తమ దేశంలో ఉండిపోయాయని చెప్పారు. కార్యకలాపాలు సాగిస్తున్నాయని తెలిపారు. ఆ తర్వాత 9/11 తర్వాత అమెరికాతో కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదులపై పోరాడాల్సి వచ్చింది. అమెరికా ఆప్ఘనిస్తాన్ తిరిగి వెళ్లేనాటికి మేము ట్రైనింగ్ ఇచ్చిన జీహాదీ బృందాలు ఉగ్రవాద బృందాలుగా మారిపోయాయని పాక్ ప్రధాని తెలిపారు.

అమెరికాకు సహకరించి తప్పుచేశాం!

నేను ఎదుర్కున్న దేశాల్లో అత్యంత ప్రమాదకర దేశం పాకిస్తాన్ అని అమెరికా మాజీ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ గతంలో చేసిన వ్యాఖ్యలను ఈ సంధర్భంగా న్యూస్ యాంకర్ గుర్తు చేయగా దానికి ఇమ్రాన్ ఖాన్

‘‘పాకిస్తాన్‌లో మిలిటెన్సీ ఎందుకు పెరిగిందో, మాటిస్ పూర్తిగా అర్థం చేసుకోలేకపోయారనుకుంటా’’అని బదులిచ్చారు. ఈ నేపథ్యంలోనే నాటి సోవియట్ పరిస్థితులను పాక్ ప్రధాని గుర్తు చేశారు. 9/11 తర్వాత అమెరికాకు సహకరించి మేము చాలా పెద్ద తప్పు చేశామని, ఈ విషయంలో మేం తటస్థంగా ఉండాల్సిందన్నది ఇమ్రాన్ ఖాన్ తెలిపారు.అమెరికాకు సపోర్ట్ ఇవ్వడం వల్ల పాకిస్తాన్ 150-200 బిలియన్ డాలర్లు నష్టపోయిందని, పెద్ద గుణపాఠం కూడా నేర్చుకోవాల్సి వచ్చిందని తెలిపారు. మిలిటెంట్ సంస్థలు ఒకప్పుడు పాకిస్తాన్ సైన్యానికి చాలా సన్నిహితంగా ఉండేవని ఇప్పుడు సైన్యమే వాటిని నాశనం చేస్తుందని అన్నారు.

భారత్ కోరుకుంటేనే నేను మధ్యవర్తిత్వం

న్యూయార్క్‌లోని ఐక్య‌రాజ్య‌స‌మితి స‌మావేశాల‌కు హాజ‌రైన పాకిస్థాన్ ప్ర‌ధాని ఇమ్రాన్ ఖాన్‌తో ట్రంప్ భేటీ అయ్యారు. ఆ త‌ర్వాత ఇద్ద‌రూ మీడియాతో మాట్లాడారు. కశ్మీర్ విషయంలో జోక్యం చేసుకోవాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కోరారు. భారత, పాకిస్తాన్ దేశాల మధ్య కాశ్మీర్ విషయంలో తలెత్తిన ప్రతిష్టంభనను పరిష్కరించే విషయంలో తాను మధ్యవర్తిత్వం వహిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి ప్రకటించారు. కాశ్మీర్ సమస్యపై మీ ఇద్దరి (ఇమ్రాన్, మోడీ) మధ్య ఒప్పందం కుదరాలని, అందుకు నన్ను జోక్యం చేసుకోవాలని కోరితే నేను రెడీ అని ఆయన అన్నారు.

howdy-modi : pm-modi-slams-pakistan-over-terror( Photo-Getty)

నాకు మోడీతోనూ, ఖాన్ తోనూ ,గాఢమైన ఫ్రెండ్ షిప్ ఉంది. అయితే దీనికి భారత్ కోరుకుంటేనే నేను మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధంగా ఉన్నానని పాక్ ప్రధానికి చురకలంటించారు. కాగా ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ విషయాన్ని ఐక్యరాజ్యసమితి నేతల ఎదుట లేవనెత్తుతానని ఇంతకు ముందే ప్రకటించిన సంగతి అందరికీ విదితమే. హౌడీ మోడీ ఈవెంట్లో భారత ప్రధాని నరేంద్ర మోడీ ‘‘సొంత దేశాన్నే చూసుకోలేకపోతున్న వారు, భారత్‌లో ఏం చేసినా ఇబ్బంది పడిపోతున్నారు’’అంటూ పరోక్షంగా పాకిస్తాన్‌పై విరుచుకుపడిన సంగతి కూడా విదితమే.

మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు ప్రారంభం:

ఏడు నెలలక్రితం బాలాకోట్‌పై భారత్‌ దాడితో ఉగ్రవాదులు అక్కడినుంచి వెళ్ళిపోయారని, తిరిగి మళ్ళీ పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు బాలాకోట్‌లో తమ కార్యకలాపాలను ప్రారంభించారని బిపిన్ రావత్ వెల్లడించారు. గతంలో జరిపిన దాడికి మించి ఈసారి దాడులు చేసే అవకాశముందన్నా రు. మంచుకరుగుతున్న ప్రాంతాల గుండా, మంచు తక్కువగా ఉన్న ప్రాంతాలైన జమ్మూ కశ్మీర్‌లోని ఉత్తరభాగంనుంచి భారత్‌లోకి చొరబడేందుకు 500 మంది ఉగ్రమూకలు వేచిఉన్నారనీ, ఈ సంఖ్య సమయానుకూలంగా మారవచ్చుననీ బిపిన్‌ రావత్‌ స్పష్టం చేశారు.

భారత్ మీద దాడులకు మసూద్ అజహర్ వ్యూహం: నిఘా వర్గాల సమాచారం

బాలాకోట్‌పై భారత వాయుసేన దాడులు, జమ్మూకశ్మీర్ రాష్ట్రంలో ఆర్టికల్ 370 రద్దు అనంతరం పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ అయిన జైషే మహ్మద్ మళ్లీ కార్యకలాపాలు షురూ చేసింది. భారత్‌లో దాడులకు 30 అత్మాహుతి దళాలతో మసూద్ అజహర్ వ్యూహం రూపొందించారని భారత నిఘావర్గాలకు సమాచారం అందింది. జైషే మహ్మద్ వ్యవస్థాపకుడు మసూద్ అజహర్ అనారోగ్యంతో ఉండటంతో ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలను అతని సోదరుడైన ముఫ్తీ అబ్దుల్ రౌఫ్ అస్ఘర్ పర్యవేక్షిస్తున్నాడని తేలింది. జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ పేరును మజ్లిస్ వురాసా-ఎ-షుహుదా జమ్మూ వా కశ్మీర్ పేరిట మార్చి భారత్ పై దాడులకు వ్యూహరచన చేశారని సమాచారం. భారత్ తోపాటు అమెరికా, ఇజ్రాయిల్ దేశాలకు వ్యతిరేకంగా జిహాద్ కోసం పోరాడాలని పాక్ ఉగ్రవాది మౌలానా ఆబిద్ ముక్తార్ పిలుపునిచ్చారు. బాలాకోట్ లో 30 ఆత్మాహుతి దళాలకు శిక్షణ ఇచ్చి జమ్మూకశ్మీర్ కంటోన్మెంట్లలో దాడులు చేయాలని పాక్ కొత్త ఉగ్రవాద సంస్థ ప్రేరేపించినట్లు తేలింది. నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో కేంద్ర పారామిలటరీ బలగాలు దాడులను తిప్పి కొట్టేందుకు సమాయత్తం అయ్యాయి.  ఈ సారి మరింత దీటుగా జవాబిస్తామని హెచ్చరించిన భారత ఆర్మీ జనరల్

భారత్ వ్యాఖ్యలను ఖండించిన పాక్

బాలాకోట్‌ ఉగ్రశిబిరాలపై భారతవైమానిక దళాల దాడితో ధ్వంసమైన పాకిస్తాన్‌ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహ్మద్‌ ఉగ్ర స్థావరాలు తిరిగి ప్రారంభమయ్యాయని భారత సైనికాధిపతి బిపిన్‌రావత్‌ చేసిన వ్యాఖ్యలను పాకిస్తాన్‌ ఖండించింది. అంతర్జాతీయ సమాజాన్ని తప్పుదోవ పట్టించేందుకు భారత్‌ ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తోందంటూ ఆ దేశ విదేశాంగ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కశ్మీర్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన నుంచి దేశ ప్రజలను, ప్రపంచ దేశాల దృష్టిని మళ్లించేందుకు ఢిల్లీ ఇలాంటి కార్యక్రమాలకు ఒడిగడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌ చేసిన ప్రకటనకు ఎలాంటి ఆధారాలు లేవని పాక్‌ స్పష్టం చేసింది.