New Delhi, March 1: ఉక్రెయిన్ ఆక్రమణకు వెళ్లిన రష్యా రాజధానిలోకి ప్రవేశించింది. రష్యా బలగాలు కీవ్‌ను చట్టుముట్టేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇవాళ కీవ్‌లో ఉన్న ఇండియన్ ఎంబసీ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ నగరంలో ఉన్న భారతీయులంతా ఇవాళే కీవ్‌ను వదిలివెళ్లాలని ఆదేశించింది. విద్యార్థులతో పాటు కీవ్‌లో ఉన్న భారతీయులంతా ఆ నగరాన్ని విడిచిపెట్టి వెళ్లాలని (Leave Kyiv Urgently by Any Means) భారత ఎంబసీ తన ట్వీట్‌లో తెలిపింది.
అందుబాటులో ఉన్న రైళ్లు లేదా ఇతర మార్గాల ద్వారా ఈ నగరాన్ని తక్షణమే విడిచి పెట్టి వెళ్లాలని కోరింది. ఏ క్షణమైనా కీవ్ నగరంపై భీకర దాడి జరిగే అవకాశాలు ఉన్నట్లు భారతీయ ఎంబసీ (Indian Embassy in Ukraine ) హెచ్చరికలు జారీ చేసింది. భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను తరలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గంగాను చేపట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే వేలాది మంది విద్యార్థులను ఇండియాకు తీసుకువచ్చారు. అయితే ఇప్పుడు ఆపరేషన్ గంగాకు వాయుసేన కూడా తోడవ్వనున్నది. తరలింపు ప్రక్రియను వేగవంతం చేసేందుకు వాయుసేన కూడా ఆ ఆపరేషన్‌లో భాగంగా కావాలని ప్రధాని మోదీ ఆదేశాలు జారీ చేశారు.
అతి తక్కువ సమయంలో ఎక్కువ మందిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆపరేషన్ గంగా కోసం వాయుసేనకు చెందిన సీ-17 గ్లోబ్‌మాస్టర్ విమానాన్ని వాడనున్నట్లు తెలుస్తోంది. ఇవాళ ఉదయం ఉక్రెయిన్ అంశం గురించి రాష్ట్రపతి రామ్‌నాథ్‌తో ప్రధాని మోదీ చర్చించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఖార్కివ్ నగరంపై రష్యా మిస్సైల్ దాడి (Russia-Ukraine War) చేసినట్లు సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది. ఖార్కివ్‌లో ఉన్న ప్రభుత్వ బిల్డింగ్‌పై ఈ దాడి జరిగింది. ఇవాళ ఉదయం ఈ దాడి జరిగినట్లు చెబుతున్నారు. నగరంలోని ఫ్రీడమ్ స్క్వేర్ వద్ద ఉన్న ప్రభుత్వ ఆఫీసులను టార్గెట్ చేశారు. మిస్సైల్ దాడితో ఆ ప్రాంతంలో భారీ పేలుడు, మంట చెలరేగింది. సమీపంలో ఉన్న బిల్డింగ్, కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పేలుడు తర్వాత కార్లు, బిల్డింగ్ శిథిలాలు కనిపించాయి. ఉదయం 8 గంటలకు దాడి జరిగినట్లు చెబుతున్నారు. అయితే ఈ ఘటనలో గాయపడినట్లు సమాచారం లేదు. ఉక్రెయిన్‌లో రెండవ అతిపెద్ద నగరం ఖార్కివ్. ఆ నగరంలో సుమారు 16 లక్షల మంది జనాభా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు.
ఉక్రెయిన్‌లోని ఈశాన్య ప్రాంతంలో ఉన్న ఒకిట్రికా నగరంలోని సైనిక స్థావరంపై రష్యా దాడి చేసింది. ఆ దాడిలో 70 మంది ఉక్రెయిన్ సైనికులు మృతిచెందారు. అయితే శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాల కోసం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. సుమీ ప్రాంత అధికారి డిమిట్రో జివిస్టికీ పర్యవేక్షణలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది. ఒకిట్రికా నగరంలోనే రష్యా సైనికుల మృతదేహాలు కూడా చెల్లాచెదురుగా పడి ఉన్నట్లు ఆయన చెప్పారు. ఆ మృతదేహాలను రెడ్‌క్రాస్‌కు అందిస్తున్నట్లు తెలిపారు. రాజధాని కీవ్, ఖర్‌కీవ్ మధ్య ఒకిట్రికా సిటీ ఉన్నది. నాలుగు అంతస్థుల భవనంలో ఉన్న సైనికులపై దాడి జరగడంతో వారంతా మరణించారు.
ఉక్రెయిన్‌కు ఆయుధ సహకారం అందించేందుకు ఆస్ట్రేలియా సుముఖత వ్యక్తం చేసింది. రష్యా దాడితో కుదేలవుతున్న ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు ఆ దేశానికి 50 మిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధ సామాగ్రిని అందించనున్నట్లు ఆస్ట్రేలియా చెప్పింది. ఆ జాబితాలో మిస్సైళ్లు, మందుగుండు సామాగ్రి, మిలిటరీ హార్డ్‌వేర్ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డోమిర్ జెలెన్‌స్కీకి ప్రాణాంతకమైన సైనిక సామాగ్రిని అందించనున్నట్లు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా దమనకాండలో వ్లాదిమర్ పుతిన్ దూకుడుకు బెలారస్ అధ్యక్షుడు అలెగ్జాండర్ లుకషెంకో మద్దతు కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని బెలారస్‌ను అమెరికా హెచ్చరించింది. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య కాల్పుల విరమణ, రష్యా బలగాల ఉపసంహరణపై బెలారస్ సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య జరిగిన చర్చలు విఫలం కావడంతో అమెరికా ప్రకటన ప్రాధాన్యత సంతరించుకుంది.