SP Balasubrahmanyam (Photo Credits: Facebook)

Amaravati, Sep 28: గాన గంధర్వుడు తెలుగు బిడ్డ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు ‘భారతరత్న’ (Bharat Ratna for SPB)ఇవ్వాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాని మోదీకి (PM Modi) విజ్ఞప్తి చేశారు. ఈమేరకు సోమవారం ఆయన (Andhra Pradesh CM YS Jagan Mohan Reddy) ప్రధానికి లేఖ రాశారు. అనారోగ్యం కారణంగా ఎస్పీ బాలు (SP Balasubrahmanyam) చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో సెప్టెంబర్ 25న కన్నుమూసిన సంగతి తెలిసిందే.

50 రోజుల క్రితం కరోనాబారినపడ్డ ఆయన.. వైరస్‌ నుంచి కోలుకున్నప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడంతో తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాలపాటు సినీ సంగీత ప్రపంచానికి సేవలు చేసిన బాలు.. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడారు. దేశంలోని ప్రతి ఇంటికీ ఆయన పేరు, పాటలు సుపరిచతమై ఉన్నాయి. అంతేకాదు దాదాపు 50 సినిమాలకు సంగీత దర్శకత్వం వహించారు.

ఇక సెలవు..అశ్రు నివాళుల మధ్య ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు పూర్తి, కడచూపు కోసం తరలివచ్చిన తారాగణం, అభిమానులు

ఇదిలా ఉంటే సోషల్‌ మీడియాలో వస్తున్న వదంతులను ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కుమారుడు ఎస్పీ చరణ్‌ తీవ్రంగా ఖండించారు.   ఎస్పీ చరణ్‌ సోమవారం సాయంత్రం ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో కలిసి మీడియా ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ నాన్నగారు ఆస్పత్రిలో చేరిన తర్వాత ప్రతి వారం బిల్స్‌ చెల్లిస్తూనే ఉన్నాం. చివరిగా నాన్న చనిపోయిన తర్వాత కూడా బిల్స్‌ గురించి అడిగితే.. ముందు భౌతికకాయాన్ని తీసుకెళ్లమని చెప్పి మాకు గౌరవం ఇచ్చారు.

మూడు కోట్లు ఖర్చు అయింది. వైస్‌ ప్రెసిడెంట్‌ సహకరించారు అంటూ కట్టుకథలు అల్లుతున్నారు. కోటి 85 లక్షలు కట్టాలి అని ఎందుకు సోషల్‌ మీడియాలో అనవసర ప్రచారం చేస్తున్నారు. కట్టుకథలతో మాకు ఎంజీఎం ఆస్పత్రి యాజమాన్యంతో ఉన్న రిలేషన్‌ చెడగొట్టవద్దు. మేము ఇంకా బాధలోనే ఉన్నాం. నాన్నగారి స్మారక స్థూపం నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నాం. ప్రతి ఒక్కరూ నాన్నగారి సమాధి సందర్శనకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాం. నాన్నగారే మాకు పెద్ద భారత రత్న.. ఒకవేళ ఇస్తే స్వాగతిస్తాం’ అని అన్నారు.

ఐదు దశాబ్ధాల పాటు తన గానామృతంతో సంగీత ప్రేక్షకులను ఓలలాడించిన పాటల మాంత్రికుడికి అభిమానలోకం కన్నీటి వీడ్కోలు పలికింది. కుటుంబ సభ్యులు, పలువురు సినీ ప్రముఖులు మధ్య చెన్నైలో అంత్యక్రియలు (SP Balasubrahmanyam's Funeral In Chennai) జరిగాయి. చెన్నైలోని తామరైపాక్కం వ్యవసాయక్షేత్రంలో ప్రభుత్వ లాంఛనాలతో ఆయనకు వీడ్కోలు చెప్పారు.

సంప్రదాయం ప్రకారం తనయుడు చరణ్‌ - అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అంతిమ సంస్కారానికి కుటుంబ సభ్యులు, కొద్ది మంది ప్రముఖులకు మాత్రమే అనుమతి ఇచ్చారు. కొవిడ్‌ నిబంధనల కారణంగా అభిమానులకు తిరువళ్లూరు పోలీసులు ఎలాంటి అనుమతి ఇవ్వలేదు. ఆంక్షలు ఉన్నా తమ అభిమాన స్వరమాంత్రికుడికి కన్నీటి వీడ్కోలు పలికేందుకు అభిమానులు భారీగానే హాజరయ్యారు.