సినిమా టికెట్ ధరలను ఏపీ ప్రభుత్వం తగ్గించడంపై సినీ హీరో నాని తన అసహనాన్ని వ్యక్తం చేశారు. 'శ్యామ్ సింగరాయ్' చిత్రబృందం ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించింది. ఈ సందర్భంగా నాని (Tollywood actor Nani) మాట్లాడుతూ... సినిమా టికెట్ల ధరలను ఏపీ ప్రభుత్వం ( AP Govt) తగ్గించిందని, ఇది సరైన నిర్ణయం కాదని అన్నారు. టికెట్ ధరలను తగ్గించడం (reduction of movie ticket prices in Andhra Pradesh) ద్వారా ప్రేక్షకులను ప్రభుత్వం అవమానించిందని చెప్పారు.
సినిమా థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా షాపులకు ఎక్కువ కలెక్షన్లు ఉన్నాయని అన్నారు. టికెట్ ధర ఎక్కువగా ఉన్నా కొని, సినిమా చూసే సామర్థ్యం ప్రేక్షకులకు ఉందని చెప్పారు. ఇప్పుడు తాను ఏది మాట్లాడినా వివాదాస్పదమే అవుతుందని అన్నారు. పది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న పెద్ద సినిమా థియేటర్ల కంటే కిరాణ కొట్టు వారికి వస్తున్న కలెక్షన్లు ఎక్కువగా ఉంటే బాధపడేది థియేటర్ల యజమానులే అని పేర్కొన్నారు. సినిమా పరిశ్రమ, రాజకీయాలను పక్కన పెడితే టికెట్ల ధరలను తగ్గించి ప్రేక్షకులను అవమాన పరచవద్దని సూచించారు. నాపేరు ముందు నేచురల్ స్టార్ తీసేయలను కుంటున్నానని నాని తెలిపారు.
దీనిపై ఏపీ మంత్రి బొత్సా స్పందించారు. సినిమా థియేటర్లపై కావాలని దాడులు చేయడం లేదని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టికెట్ల ధరలను నియంత్రిస్తే అవమానించడమా.. ఇష్టానుసారం రేట్లకు అమ్మితే చూస్తూ ఊరుకోవాలా అని ప్రశ్నించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్నారు. సామాన్యునికి సినిమా ఒక ఎంటర్‌టైన్‌మెంట్ అని.. ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమ్ముతామంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రేక్షకులకు మేలు చేసేందుకే ఈ ప్రయత్నమన్నారు. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స వెల్లడించారు.
నాని వ్యాఖ్యలను టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ తప్పుబట్టారు. నానీకి ఏం తెలుసని మాట్లాడుతున్నారని ప్రశ్నించారు. నాని వ్యాఖ్యలు ఏపీ ప్రభుత్వాన్ని కించపరిచేలా ఉన్నాయని పేర్కొన్నారు. టికెట్ల రేట్లు, వసూళ్లు, షేర్ వంటి విషయాలపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఓవైపు తాము ఏపీ ప్రభుత్వంతో మాట్లాడుతున్నామని, అటు, కోర్టులోనూ ఈ వ్యవహారం నడుస్తోందని అన్నారు. ఇలాంటి సమయంలో నాని వ్యాఖ్యల వల్ల మిగతా సినిమాలపై ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు. నాని తన వ్యాఖ్యలపై ఏపీ సర్కారుకు క్షమాపణలు తెలియజేయాలని నట్టి కుమార్ స్పష్టం చేశారు.