![](https://test1.latestly.com/wp-content/uploads/2023/07/Birdflu.jpg?width=380&height=214)
Kakinada, Feb 11: ఇటీవల ఉభయ గోదావరి జిల్లాల్లో సంభవించిన కోళ్ల మరణాలకు కారణం బర్డ్ ఫ్లూ(bird flu) అని నిర్ధారణ అయింది. ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ఒక గ్రామంలో బర్డ్ ఫ్లూ కేసులను నిర్ధారించారు. గ్రామానికి 10 కిలోమీటర్ల పరిధిలోని నివాసితులను జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. మరింత వ్యాప్తి చెందకుండా ఉండటానికి గ్రామంలోని ప్రవేశ మరియు నిష్క్రమణ ప్రదేశాలను తాత్కాలికంగా మూసివేయనున్నారు. ప్రస్తుతానికి చికెన్ వినియోగాన్ని తగ్గించాలని అధికారులు నివాసితులకు సూచించారు.
ఉభయగోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున కోళ్ల మరణాలు సంభవించాయి. తొలుత నాటుకోళ్లు.. ఆ తర్వాత పందెం కోళ్లకు వ్యాపించిన ఈ వైరస్ తో దాదాపు 5 లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి.ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పశుసంవర్ధక శాఖ ఈ నెల 6, 7 తేదీల్లో ఉభయగోదావరి జిల్లాల్లో దాదాపు 60కు పైగా శాంపిల్స్‌ను సేకరించి విజయవాడలోని రాష్ట్ర స్థాయి పశువ్యాధి నిర్ధారణ శాలతో పాటు భోపాల్‌లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్(ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ)కు పంపింది.
తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్రహారం, పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కోళ్ల ఫారాల నుంచి సేకరించిన శాంపిల్స్‌లో ఎవియాన్ ఇన్‌ఫ్లూయింజ్(హెచ్5ఎన్1)గా నిర్ధారణ ( bird flu in East Godavari) అయ్యింది. ఈ మేరకు సోమవారం భోపాల్ ల్యాబ్ నుంచి రిపోర్టు రాగానే సమాచారాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య సంస్థతో పాటు వరల్డ్ ఆర్గనైజేషన్ ఫర్ యానిమల్ హెల్త్‌కు అందించారు.
వైరస్ నిర్ధారణ అయిన ఉభయగోదావరి జిల్లాలతో పాటు కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, ఏలూరు జిల్లాల పశుసంవర్ధక శాఖాధికారులను అప్రమత్తం చేశారు. ఆయా జిల్లాల్లో లేయర్, బ్రాయిలర్ కోళ్ల ఫారాల్లోని కోళ్ల ఆరోగ్య స్థితిగతులను పరిశీలించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. మండలానికి రెండు చొప్పున ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ ఏర్పాటు చేసి బర్డ్‌ఫ్లూను ఎదుర్కోడానికి సమాయత్తం చేశారు.
ఈ బర్డ్ ప్లూ ఇతర జిల్లాలకు పాకకుండా అధికారులు చర్యలు చేపట్టారు. బర్డ్ ప్లూ బైటపడ్డ కానూరుకు 10 కిలోమీటర్ల పరిధిలో సెక్షన్ 144 విధించారు. ప్రజలు కూడా గుంపులు గుంపులుగా వుండకూడదని... ఏదయినా అనారోగ్య సమస్యతో బాధపడితే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. కొద్దిరోజులు చికెన్ తినకూడదని హెచ్చరిస్తున్నారు... బర్డ్ ప్లూ కోళ్ల ద్వారా మనుషులకు సోకే ప్రమాదముంది కాబట్టి అహార నియమాలు పాటించాలని సూచిస్తున్నారు వైద్యారోగ్య శాఖ అధికారులు.
పౌల్ట్రీ రైతులు తమ కోళ్లు చనిపోతుంటే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలని పశుసంవర్ధక శాఖ సూచించింది. రాజమండ్రి కలెక్టరేట్ లో ప్రత్యేకంగా కమాండ్ కంట్రోల్ రూంను ఏర్పాటుచేసారు... బర్డ్ ప్లూ లక్షణాలు కోళ్లలోగానీ, మనుషులలో గానీ కనిపిస్తే 95429 08025 కు సమచారం అందించాలని ప్రకటించారు. ఇప్పటికే ఎవరైనా బర్డ్ బ్లూ బారినపడితే వెంటనే సంప్రదించాలని... వైద్యం అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు చెబుతున్నారు.
వైరస్ గుర్తించిన గ్రామాలకు కిలోమీటర్ పరిధిలోని ప్రాంతాన్ని రెడ్‌జోన్, పది కిలోమీటర్ల పరిధిలోని ప్రాంతాన్ని సరై్వలెన్స్ జోన్‌గా ప్రకటించారు. 144, 133 సెక్షన్‌లను అమలు చేస్తున్నారు. సర్వైలెన్స్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ల ఫారాల్లోని కోళ్లు, పశువులు, ఇతర జీవాలతో పాటు మనుషుల రక్త నమూనాలను సేకరించాలని నిర్ణయించారు. ఎవరిలోనైనా వైరస్ లక్షణాలు కనిపిస్తే వారికోసం యాంటీ వైరస్ మందులను సిద్ధం చేశారు. కిలోమీటర్ పరిధిలోని పౌల్ట్రీ ఫామ్‌లలోని కోళ్లు, కోడిగుడ్లను కాల్చి పూడ్చి పెట్టాలని ఆదేశాలిచ్చారు.
వైరస్ గుర్తించిన గ్రామాలున్న మండలాల్లో చికెన్ షాపులను మూసివేయాలని ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లు ఆదేశాలిచ్చారు. మరోవైపు బర్డ్‌ఫ్లూని ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలపై ఏపీ పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కోళ్ల రైతులతో ఆయా జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
ఎలా వ్యాపిస్తుంది: బర్డ్ ప్లూ సహజంగా జంతువుల నుండి మనుషులకు సోకుతుంది... ఇది కోళ్ళనుండే ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. బర్డ్ ప్లూ బారినపడ్డ జంతువులు, పక్షులకు దగ్గరగా ఎక్కువసేపు గడిపితే ఇది సోకే అవకాశం ఎక్కువగా వుంటుంది.ఇక బర్డ్ ప్లూ సోకిన కోళ్లను తిన్నా వ్యాపిస్తుంది. అయితే చికెన్ ను బాగా శుభ్రం చేసుకుని ఉడికించడం ద్వారా అందులోని వైరస్ చనిపోతుంది. అలాకాకుండా ఉడికీఉడకని చికెన్ తినడంద్వారా ఇది మనుషులకు వ్యాప్తి చెందుతుంది. చికెన్ తినకుండా వుండటమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
వ్యాధి లక్షణాలు: బర్డ్ ప్లూ సోకినవారికి జలుబు, ముక్కుకారడం, శ్వాస తీసుకోడంలో ఇబ్బంది, ముక్కు మూసుకుపోవడం,గొంతునొప్పి, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరిలో బర్డ్ ప్లూ కారణంగా తీవ్ర అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. తీవ్రమైన తలనొప్పి, హైఫీవర్, తీవ్ర అలసట, కాళ్లు చేతుల కండరాల నొప్పులు, వికారం, వాంతులు విరేచనాలతో ఇబ్బందిపడతారు. ఒక్కోసారి ఇది అవయవ వైకల్యానికి ,న్యుమోనియాకు దారితీస్తుంది... ప్రాణాంతకంగా కూడా మారవచ్చు. ఈ లక్షణాలు వ్యాధి సోకిన 2 నుండి 6 రోజుల్లో కనిపిస్తాయి. ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి.