Guidelines for Schools & Colleges: తల్లిదండ్రులు అనుమతిస్తేనే స్కూళ్లకు పిల్లలు, నవంబర్ 2 నుంచి స్కూళ్లు, కాలేజీలు ఓపెన్, నేటి నుంచి ప్రారంభమైన ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్
Representational Image (Photo Credits: Wikimedia Commons)

Amaravati, Oct 23: కరోనావైరస్ రాష్ట్రంలో తగ్గుముఖం పడుతోందని వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ( Anil Kumar Singhal) చెప్పారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన అనిల్ సింఘాల్.. ఇప్పటికే విద్యా సంవత్సరాన్ని చాలా నష్టపోయిన నేపథ్యంలో స్కూళ్లు తెరవాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఈ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు (Guidelines For Schools & Colleges) తీసుకుంటున్నామని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందితోపాటు హెడ్‌మాస్టర్లు, టీచర్లనూ అప్రమత్తం చేశామని వెల్లడించారు. తల్లిదండ్రులు అనుమతిస్తేనే పిల్లలు స్కూళ్లకు రావాలన్నారు. కొద్ది రోజులపాటు మధ్యాహ్నం వరకే స్కూళ్లు ఉంటాయన్నారు

ఆ తర్వాత పరిస్థితిని బట్టి పూర్తి స్థాయిలో తరగతులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. నవంబర్‌ 2 (Schools, Colleges Starts in AP )నుంచి స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నామని, కోవిడ్‌ నేపథ్యంలో రెండ్రోజుల్లో ప్రత్యేక మార్గదర్శకాలు విడుదల చేస్తామని తెలిపారు. వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు ఉన్న ఇళ్ల నుంచి పిల్లలు స్కూళ్లకు వస్తుంటే ఆ ఇళ్లనూ రోజూ ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంలు పర్యవేక్షించాలన్నారు. స్కూళ్లు తెరిచాక 15 రోజుల పాటు నిశితంగా పరిశీలిస్తామని వెల్లడించారు. దీన్ని బట్టి కోవిడ్‌ నియంత్రణపై భవిష్యత్‌ ప్రణాళిక ఉంటుందన్నారు. జిల్లా స్థాయిలో స్కూళ్లల్లో పరిస్థితులపై కలెక్టర్లతో టాస్క్‌ఫోర్స్‌ కమిటీలను ఏర్పాటు చేశామని వివరించారు. కోవిడ్‌ టెస్టులను మరింతగా పెంచుతామన్నారు.

ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేస్తే రూ. 10 వేలు ఫైన్, ఏపీలో సవరించిన వాహన జరిమానా వివరాలు ఓ సారి తప్పక తెలుసుకోండి

ఇదిలా ఉంటే రాష్ట్రంలో స్కూళ్లను నవంబర్‌ 2 నుంచి ప్రారంభించనుండడంతో విద్యార్థుల చదువులతోపాటు వారి ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశించారని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్‌ చెప్పారు. మీడియాతో సురేష్ మాట్లాడుతూ నవంబర్‌ 2న స్కూళ్లు తెరిచాక నెలపాటు హాఫ్‌ డే స్కూళ్లు నిర్వహిస్తామని తెలిపారు. కోవిడ్‌ నుంచి రక్షణకు చర్యలు, ఆరోగ్య పరిరక్షణపై విద్యార్థులకు రోజూ 15 నిమిషాలపాటు టీచర్లు బోధిస్తారని వెల్లడించారు.

ఏపీలో కేసులు భారీగా తగ్గుముఖం, తాజాగా 3620 మందికి కరోనా, 16 మంది మృతితో 6,524కు చేరుకున్న మరణాల సంఖ్య, యాక్టివ్‌గా 32,257 కోవిడ్ కేసులు

స్కూళ్లను శానిటైజ్‌ చేయించడంతోపాటు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని వివరించారు. సంక్రాంతి, వేసవికి సెలవు రోజులను తగ్గించి స్కూళ్లు నిర్వహిస్తామని చెప్పారు. సెలవు రోజుల్లో విద్యార్థులకు లెర్నింగ్‌ హవర్స్‌ను కేటాయించి వారు ఇంటి దగ్గరే ఉండి నేర్చుకునేలా పలు రకాల చర్యలు తీసుకుంటామన్నారు. డిసెంబర్‌ ఒకటి నుంచి ఇంజనీరింగ్‌ తదితర యూజీ కోర్సుల ఫస్టియర్‌ తరగతులు, నవంబర్‌ 2 నుంచి ఇతర ఏడాదుల్లోని విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తామన్నారు. కాగా, ‘మన బడి: నాడు–నేడు’ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ వెబ్ కౌన్సెలింగ్ 

రాష్ట్రంలో నేటి నుంచి ఎంసెట్ ఇంజనీరింగ్ విభాగం వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలి ఆద్వర్యంలో ఆన్‌లైన్‌ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇందుకుగాను రాష్డ్ర వ్యాప్తంగా 25 హెల్ప్ లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. గిరిజన విద్యార్థుల సౌకర్యార్ధం తొలిసారిగా పాడేరులో హెల్ప్‌లైన్ సెంటర్ ఏర్పాటు చేశారు. ర్యాంకుల వారీగా నోటిఫికేషన్ విడుదల చేశారు.

ప్రతి రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కొనసాగుతుంది. కరోనా నేపథ్యంలో విద్యార్థులు నేరుగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా ఇళ్ల నుంచే ఆన్‌లైన్ ద్వారా సర్టిఫికేట్ల వెరిఫికేషన్‌కి హాజరయ్యే విధంగా ఏర్పాట్లు చేశారు. అత్యవసరమైతేనే హెల్ప్‌లైన్ సెంటర్లకి విద్యార్థుల రావాల్సి ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సౌకర్యార్ధం నాలుగు హెల్ప్‌లైన్ నంబర్లు: 8106876345, 8106575234, 7995865456, 7995681678 అందుబాటులో ఉంచారు.

రెండు చోట్ల ఇళ్లు ఎందుకు? ప్రజాధనాన్ని వృథా చేయడమే కదా? నిమ్మగడ్డ పిటిషన్ సంధర్భంగా కీలక వ్యాఖ్యలు చేసిన ఏపీ హైకోర్టు

జనరల్, బీసీ విద్యార్థులకు 1200, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకి 600 రూపాయిలు ప్రాసెసింగ్ ఫీజుగా నిర్ణయించారు. నేడు (శుక్రవారం) ఒకటో ర్యాంకు నుంచి 20,000 ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగననుండగా రేపు (24)న 20,001 ర్యాంకు నుంచి 50,000 వరకు, 25న 50,001 ర్యాంకు నుంచి 80,000 వరకు, 26న 80,001 నుంచి 1,10,000 ర్యాంకు వరకు, 27న 1,10,001 ర్యాంకు నుంచి చివరి ర్యాంకు వరకు సర్టిఫికేట్ల పరిశీలన జరగనుంది. పీహెచ్‌, స్పోర్ట్స్ అండ్‌ గేమ్స్, ఎన్‌సీసీ కోటా విద్యార్ధులకి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో కౌన్సిలింగ్ జరగనుంది.