Amaravati, Nov 9: ఆగ్నేయ మధ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న దక్షిణ అండమాన్‌లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బలపడి మంగళవారం అల్పపీడనంగా (Low pressure area) మారనుంది. చెన్నైకి 400 కిలోమీటర్ల దూరంలో ఏర్పడే ఈ అల్పపీడనం (Low pressure area to form in Bay of Bengal ) మరో 24 గంటల్లో వాయుగుండంగా మారి పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ గురువారం తెల్లవారుజామున ఉత్తర తమిళనాడు తీరానికి చేరుకునే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. దీని ప్రభావం వచ్చే నాలుగు రోజులు దక్షిణ కోస్తా, ఉత్తర తమిళనాడులపై (Tamil Nadu Rains) తీవ్రంగా ఉండే అవకాశం ఉందన్నారు.
తమిళనాడు, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో నవంబరు 9 నుంచి 11వతేదీల మధ్య భారీ నుంచి అతి భారీ వర్షాలు (Andhra Pradesh Rains) కురిసే అవకాశం ఉంది.ఈ మేర భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం విడుదల చేసిన వెదర్ బులెటిన్‌లో సూచించింది. భారీవర్షాల తర్వాత మరో రోజు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవవచ్చని ఐఎండీ పేర్కొంది. అదే సమయంలో కేరళలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.
తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, 11, 12 తేదీల్లో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పలుచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, రాయలసీమ జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అల్పపీడనం కారణంగా బంగాళాఖాతంలో అల్లకల్లోల పరిస్థితులు నెలకొంటాయని నవంబర్ 11వ తేదీ వరకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరంలోని సముద్రంలో చేపలవేటకు మత్స్యకారులు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు సూచించారు.భారత భూభాగానికి దూరంగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. మంగళవారం సాయంత్రం వరకు మత్స్యకారులు అరేబియా సముద్రంలోకి వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.రానున్న మూడు రోజుల్లో దేశవ్యాప్తంగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం లేదని ఐఎండీ అంచనా వేసింది. వాయువ్య భారతదేశం, మధ్యప్రదేశ్‌లో రాబోయే రెండు రోజుల్లో క్రమంగా 2-3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత తగ్గుతుందని వాతావరణశాఖ అధికారులు వివరించారు.