Amaravati, June 12: వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడుతోంది. ఒడిశా, పశ్చిమబెంగాల్ తీరాల మధ్య కేంద్రీకృతమై ఉన్న ఈ అల్పపీడనం శనివారం మరింత బలపడి తీవ్ర అల్పపీడనంగా మారే అవకాశం ఉందని, ఒడిశా మీదుగా పశ్చిమ వాయవ్య దిశగా కదలవచ్చని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. అయితే ఈ అల్పపీడనం (newly formed low pressure basin in the Bay of Bengal) తుపానుగా మారే అవకాశం లేదని చెప్పారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో 2 రోజులు పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు (Rain Alert For Telugu States) పడే అవకాశం ఉందని, రాష్ట్ర వ్యాప్తంగా 4 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు.
ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాల్లో అల్పపీడన ప్రభావం ఎక్కువగా ఉంటుందని, పలుచోట్ల మోస్తరు వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడతాయని తెలిపారు. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొన్నారు. మరోవైపు నైరుతి రుతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించడంతో వాటి ప్రభావంతో కూడా వర్షాలు ఎక్కువగా కురిసే పరిస్థితి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో 15వ తేదీ వరకు మత్స్యకారులు సముద్రంలో చేపలవేటకు వెళ్లొద్దని సూచించింది.
తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో (Bay of Bengal) ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో శని, ఆదివారాల్లో రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో చురుగ్గా కదులుతున్నాయి. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో ట్రోపో ఆవరణం వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వాయ వ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమబెంగాల్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా మధ్య ట్రోపో ఆవరణం స్థాయి వరకు ఆవర్తనం వ్యాపించింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఒడిశా మీదుగా వెళ్లే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
శుక్రవారం అల్పపీడనప్రాంతం నుంచి ఒడిశా మీదుగా తెలంగాణ వరకు ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఈ నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం జీహెచ్‌ఎంసీ కమిషనర్ సహా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసింది. ప్రజలకు నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణశాఖ కమిషనర్ రాహుల్ బొజ్జా ఆదేశించారు.
Rain lashes parts of Patna city
Bihar: Rain lashes parts of Patna city.
India Meteorological Department (IMD) has predicted thunderstorm with rain in the city for the next 3 days pic.twitter.com/Q5F3wxP4v9
— ANI (@ANI) June 12, 2021
ముఖ్యంగా ఉమ్మడి అదిలాబాద్, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, మెదక్ జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. వరద ముంపు ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉంచాలని సూచించారు. ఈదురు గాలులతో చెట్లు, విద్యుతు స్తంభాలు కూలిపోయే ప్రమాదం ఉందని, చెరువుల కట్టలు తెగిపోయే ప్రమాదం ఉందని ముందస్తు జాగ్రత్తలు చెప్పారు.
ఉత్తర బంగాళాఖాతంలో కొత్తగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం కారణంగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అల్పపీడనద్రోణి వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడి ఒడిసా రాష్ట్రంలో తీరందాటుతుందని తెలిపింది. నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో రాష్ట్రంలో వర్షాకాలం ప్రారంభమైంది. దీనికితోడు బంగాళాఖాతంలో అల్పపీడనద్రోణి ప్రభావం కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి.
ఇదే విషయంపై చెన్నై వాతావరణ కేంద్రం అధికారి ఒకరు మాట్లాడుతూ... రాష్ట్రంలో పగటిపూట ఉష్ణోగ్రతలు సాధారణంగానే వుంటాయని, కానీ, రాష్ట్రంలోని ఒకటి రెండు ప్రాంతాల్లో వర్షం పడుతుందని తెలిపారు. శనివారం నుంచి సముద్ర తీర జిల్లాల్లో విస్తారంగా వర్షం పడే అవకాశం ఉందని తెలిపారు. 13, 14 తేదీల్లో పైన పేర్కొన్న జిల్లాల్లో మెరుపులు, పిడుగులతో కూడిన తేలికపాటి వర్షం పడుతుందని వెల్లడించారు.