Chennai, Oct 4: తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో సనాతన ధర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు అధికార పార్టీ డీఎంకే కౌంటర్ (DMK Vs Pawan Kalyan) ఇచ్చింది. తిరుమల లడ్డూ కల్తీ జరిగిందంటూ కూటమి ప్రభుత్వం చేసిన రాజకీయంపై సుప్రీంకోర్టు మొట్టి కాయలు వేసిన విషయాన్ని గుర్తు చేసుకోవాలని సూచించింది.
కాగా వారాహి డిక్లరేషన్ సభలో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరు ప్రస్తావించకుండా పవన్ పరోక్షంగా మాట్లాడారు. ‘సనాతన ధర్మం వైరస్ లాంటిదని, ఆ మహమ్మారిని నిర్మూలించాలని ఈ మధ్య ఓ యువ నాయకుడు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మాన్ని ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరైనా సరే దాన్ని నిర్మూలించాలనుకుంటే, వారే తుడిచి పెట్టుకుని పోతారు. తిరుపతి బాలాజీ సాక్షిగా ఈ మాట చెబుతున్నా’ అంటూ హెచ్చరించారు.
వేచి చూడండి అంటూ పవన్ కళ్యాణ్‌కి కౌంటర్ విసిరిన ఉదయనిధి స్టాలిన్, వీడియో ఇదిగో..
ఈ వ్యాఖ్యలపై డీఎంకే గట్టి కౌంటర్ (DMK Vs Pawan Kalyan ) ఇచ్చింది. డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా మాట్లాడుతూ.. తమ పార్టీ ‘ఏ మతం గురించి, ప్రత్యేకంగా హిందూ మతం గురించి మాట్లాడదు.. కుల దురాగతాలు, అంటరానితనం గురించి మాత్రమే మాట్లాడుతుంది’ అని సూచించారు. సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా చేసినఅ వ్యాఖ్యల్ని ప్రస్తావించిన హఫీజుల్లా..‘ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, బీజేపీలే హిందూ మతం, మానవత్వానికి నిజమైన శత్రువులు ’ అంటూ ద్వజమెత్తారు.
డీఎంకే ఏ మతం గురించి మాట్లాడదు. మతాన్ని, హిందూ దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేది బీజేపీ, టీడీపీ, పవన్ కళ్యాణ్. వారే అసలైన శత్రువులు. డైవర్షన్ పాలిటిక్స్ చేయడంలో మీకు మీరే సాటి అని సెటైర్లు వేశారు. ‘ఇంకా.. కులం, అంటరానితనంపై అంబేద్కర్, జ్యోతిరావు ఫూలే, పెరియార్ ఇతర ద్రావిడ ఉద్యమ వ్యవస్థాపకుల తరహా వైఖరినే డీఎంకే అవలంభిస్తుంది. వాటికి అనుగుణంగా కులం, అంటరానితనం గురించి పోరాడుతుంది. వ్యతిరేకిస్తుందని సూచించారు.