New Delhi, Jan 27: దేశంలో గత 24 గంటల్లో 11,666 మందికి కరోనా (India Coronavirus Updates) నిర్ధారణ అయింది. అదే సమయంలో 14,301 మంది కోలుకున్నారు. దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,07,01,193 కు (Covid in India) చేరింది. గడచిన 24 గంటల సమయంలో 123 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,53,847కు పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,03,73,606 మంది కోలుకున్నారు. 1,73,740 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది. ఇప్పటి వరకు దేశంలో మొత్తం 23,55,979 మందికి వ్యాక్సిన్లు వేశారు.
ఇక తెలంగాణలో గత 24 గంటల్లో కొత్తగా 186 కరోనా కేసులు (TS Coronavirus) నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం... గత 24 గంటల్లో కరోనాతో ఒకరు ప్రాణాలు కోల్పోగా, అదే సమయంలో 306 మంది కోలుకున్నారు.ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,93,923కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 2,89,631 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,594కి పెరిగింది. తెలంగాణలో ప్రస్తుతం 2,698 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు. వారిలో 1,213 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీలో కొత్తగా 35 కరోనా కేసులు నమోదయ్యాయి
ఏపీలో గత 24 గంటల్లో 33,808 కరోనా టెస్టులు నిర్వహించగా 111 మందికి పాజిటివ్ (AP coronavirus) అని తేలింది. అత్యధికంగా కృష్ణా జిల్లాలో 19 కేసులు రాగా, చిత్తూరు జిల్లాలో 16, పశ్చిమ గోదావరి జిల్లాలో 14 కేసులు గుర్తించారు. ప్రకాశం, విజయనగరం జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. శ్రీకాకుళం జిల్లాలో 2, నెల్లూరు జిల్లాలో 4, కర్నూలు జిల్లాలో 5 కొత్త కేసులు వెలుగు చూశాయి. అదే సమయంలో 97 మంది కరోనా నుంచి కోలుకుని ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 8,87,349 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,78,828 మంది కరోనా నుంచి విముక్తులయ్యారు. ఇంకా 1,369 మంది చికిత్స పొందుతున్నారు. ఏపీలో ఇప్పటిదాకా 7,152 మంది కరోనాతో కన్నుమూశారు.
కాగా కొత్తగా వచ్చిన బ్రిటన్ రకం కరోనా వైరస్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్టు నిపుణులు గుర్తించారు. అయితే, తాము తయారుచేసిన కొవాగ్జిన్ వ్యాక్సిన్ బ్రిటన్ రకం కరోనాను కూడా సమర్థంగా ఎదుర్కొంటోందని భారత్ బయోటెక్ సంస్థ వెల్లడించింది. ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది. నేషనల్ వైరాలజీ ఇన్ స్టిట్యూట్ పరిశోధకులు నిర్వహించిన పరిశోధన తాలూకు లింకును కూడా తన ట్వీట్ లో పంచుకుంది.
కాగా, మామూలు రకం కరోనాపై ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో, బ్రిటన్ రకం కరోనా వైరస్ పైనా కొవాగ్జిన్ అంతే సమర్థంగా పనిచేస్తోందని వైరాలజీ నిపుణులు తమ పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. బ్రిటన్ రకం కరోనా వైరస్ క్రిములు ఈ వ్యాక్సిన్ నుంచి తప్పించుకోవచ్చేమో అన్న అనిశ్చితికి స్థానం లేదని తెలిపారు. కాగా, భారత్ లో దేశీయంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ గా కొవాగ్జిన్ విశిష్ట గుర్తింపు అందుకుంటోంది. కొవాగ్జిన్ డోసులను పెద్ద సంఖ్యలో భారత్ మిత్రదేశాలకు సుహృద్భావపూరితంగా పంపిస్తోంది.
సింగిల్ డోస్ కరోనా టీకాను అభివృద్ది చేస్తున్న జాన్సన్ అండ్ జాన్సన్ వచ్చే వారం తన ప్రయోగ ఫలితాలను వెల్లడించనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలను తప్పనిసరిగా రెండు డోసులు ఇవ్వాల్సి ఉండగా, తాము అభివృద్ది చేస్తున్న టీకాను సింగిల్ డోస్‌లో ఇస్తేనే సరిపోతుందని జాన్సన్ అండ్ జాన్సన్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో ఆ టీకా కోసం ప్రపంచ దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.
ప్రస్తుతం ఫైజర్, ఆస్ట్రాజెనెకా, మోడెర్నా, కొవాగ్జిన్ వంటి కరోనా టీకాలతోపాటు రష్యా, చైనా దేశాల్లోనూ కొన్ని టీకాలు అందుబాటులోకి వచ్చాయి. అయితే, ఇవన్నీ కొంత విరామంలో రెండు డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే వైరస్‌కు అడ్డుకట్ట పడుతుంది. అలాగే, వీటిని మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సి ఉంటుంది. దీంతో వీటి నిల్వ కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి వస్తోంది.
జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తున్న టీకా మాత్రం ఒక్క డోస్ వేస్తే సరిపోతుంది. అలాగే, రిఫ్రిజిరేటర్ ఉష్ణోగ్రత వద్దే దానిని నిల్వ చేసుకోవచ్చు. దీంతో ఇప్పుడు ప్రపంచం ఈ టీకా కోసం ఎదురుచూస్తోంది. అంతేకాదు, ఈ టీకా కోసం యూరోపియన్ యూనియన్, అమెరికా, బ్రిటన్, కెనడా, వంటి దేశాలు ఇప్పటికే ఒప్పందాలు కుదుర్చుకున్నాయి కూడా. కాగా, డబుల్ డోసులో తీసుకునే మరో టీకాను కూడా జాన్సన్ అండ్ జాన్సన్ అభివృద్ధి చేస్తుండడం గమనార్హం.