New Delhi, July 10: భారీ వరదలతో వణికిపోతున్న ఉత్తరభారతానికి ఇంకా ముప్పు పొంచి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని స్పషం చేసింది. ఇప్పటికే జమ్మూకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ లకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. పంజాబ్, హర్యానా, యూపీ, రాజస్థాన్ లకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.
ఎడతెరిపి లేని వర్షాల కారణంగా నదుల్లో వరద నీరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ప్రవాహ వేగానికి బ్రిడ్జిలు కుప్పకూలిపోగా.. పలు భవనాలు నీటమునిగాయి. నగరాలు నుంచి పల్లెలదాక కాలనీలు జలమయమయ్యాయి. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. మరో రెండు రోజుల పాటు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఐఎమ్‌డీ హెచ్చరికలు జారీ చేసింది. నదీ ప్రవాహాలకు దగ్గరగా వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేసింది.
ఢిల్లీలోని యమున సహా పలు నదులు పొంగిపొర్లుతున్నాయి. ఆకస్మిక వరదలతో రహదారులపై రాకపోకలు స్తంభించాయి. దేశ రాజధానిలో నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంత వర్షం కురిసింది. 24 గంటల వ్యవధిలో ఏకంగా 153 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 1982 జూలై తర్వాత, ఈ స్థాయిలో వాన దంచికొట్టడం ఇదే ప్రథమం.భారీ వర్షాలు, వరదల కారణంగా ఉత్తర రైల్వే 17 రైళ్లను రద్దు చేసింది. మరో 12 రైళ్లను దారి మళ్లించింది.
దేశరాజధాని ఢిల్లీ, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ-కశ్మీర్ సహా ఉత్తరాదిలోని చాలా ప్రాంతాల్లో ఎడతెరిపి లేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.వర్షాల కారణంగా జరిగిన ప్రమాదాల్లో మొత్తం 22 మంది ప్రాణాలు కోల్పోయారు. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూ-కశ్మీర్ లో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. యూపీ, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఐదు మరణాలు నమోదయ్యాయి.
హిమాచల్ ప్రదేశ్ (Himachal Pradesh)ని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. ఆ రాష్ట్రంలో కురిసిన వర్షానికి బియాస్ నది సహా అనేక నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. దీంతో ఆ నీరంతా గ్రామాల్లోకి చేరడంతో జనజీవనం పూర్తిగా స్తంభించింది. ప్రముఖ పర్యాటక ప్రాంతం మనాలీ (Manali)లో వరదలు బీభత్సం సృష్టించాయి. వరద ఉద్ధృతికి దుకాణాలు, కార్లు కొట్టుకుపోయాయి. బియాస్ నది ఉగ్రరూపం దాల్చడంతో మరో టూరిస్ట్ స్పాట్ కులూలోనూ దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. మరోవైపు మండీ జిల్లాలోనూ పరిస్థితులు బాగోలేవు. అక్కడ వరద ఉద్ధృతికి ఓ ఉక్కు వంతెన కొట్టుకుపోయింది.
హిమాచల్ ప్రదేశ్ లోని 10 జిల్లాలకు అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో 14 చోట్ల పెద్ద ఎత్తున కొండచరియలు విరిగిపడ్డాయి. 13 ప్రాంతాలను ఆకస్మిక వరదలు ముంచెత్తాయి. రాష్ట్రంలో 700 రహదారులను మూసివేశారు. మరోవైపు చండీగఢ్, హరియాణా రాష్ట్రాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. చండీగఢ్ లో ఇప్పటి వరకు 322.2 మి.మీ, హరియాణాలోని అంబాలాలో 224.1 మి.మీ వర్ష పాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు.
రాబోయే ఐదు రోజుల్లో పశ్చిమ బెంగాల్, సిక్కిం, అస్సాం, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్ లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయి. జులై 10న జార్ఖండ్, జులై 12 మధ్య బీహార్ లోని అండమాన్ నికోబార్ దీవుల్లో వర్షాలు కురుస్తాయి’ అని ఐఎండీ తెలిపింది.
పశ్చిమ భారతదేశం, కొంకణ్, గోవా, మహారాష్ట్ర, గుజరాత్ లోని ఘాట్ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మూడు రోజుల తర్వాత వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని పేర్కొంది. మధ్యప్రదేశ్ లో రాబోయే ఐదు రోజుల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదేవిధంగా దక్షిణ భారతదేశం కోస్తా కర్ణాటక, కేరళలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. మరోవైపు భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.
జమ్మూకశ్మీర్‌లోని దోడా జిల్లాలో ఆకస్మిక వరదలకు బస్సుపై కొండచరియలు విరిగిపడి ఇద్దరు జవాన్లు కొట్టుకుపోయి దుర్మరణం పాలయ్యారు. పంజాబ్, హరియాణాల్లో భారీ వర్షాలు కురిశాయి.