Covid Vaccinaton: వ్యాక్సిన్ తీసుకున్న తరువాత ముగ్గురు మృతి, ముంబై, పశ్చిమబెంగాల్‌, ఏపీలోని చిత్తూరులో ఒక్కొక్కరు చొప్పున మృతి, బెంగుళూరులో 103 ఏళ్ల మహిళకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు, కరోనా లేదని నకిలీ రిపోర్ట్‌ సృష్టించిన కుటుంబంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు
Vaccine | Representational Image | (Photo Credits: Flickr)

Mumbai, Mar 10: కోవిడ్ వ్యాక్సినేషన్ మీద ఆశలు చిగురించిన నేపథ్యంలో అక్కడక్కడా కొన్ని విషాదకర సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముంబైలోని అంధేరిలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో కోవిడ్ -19 వ్యాక్సిన్ (Covid Vaccinaton) యొక్క మొదటి మోతాదును ఇచ్చిన తరువాత 65 ఏళ్ల వ్యక్తి మరణించాడని ఆరోగ్య అధికారి తెలిపారు. సీనియర్ సిటిజన్‌కు మధ్యాహ్నం 3:50 గంటలకు టీకాలు వేయించారు.

ఆ తర్వాత అతను మూర్ఛపోయాడు. దీంతో ఐసియుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో సాయంత్రం 5 గంటలకు చనిపోయినట్లు ప్రకటించారు. టీకాలు వేసిన తరువాత ఒక వ్యక్తి మరణించిన మొదటి కేసు ఇదేనని, ఖచ్చితమైన కారణాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వ ఆధీనంలో ఉన్న జెజె ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించనున్నట్లు అధికారి తెలిపారు.

ఇక పశ్చిమబెంగాల్‌లోని ధుప్‌గురి ప్రాంతంలో కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ (COVID-19 Vaccination) తీసుకున్న 64 ఏళ్ల ఓ వ్యక్తి మృతి చెందాడు. దీంతో సదరు వ్యక్తి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జల్పాయిగురి జిల్లాకు చెందిన కృష్ణ దత్తా అనే వ్యాపారవేత్త స్థానిక హాస్పిటల్‌లో మృతి చెందాడు. ఊపిరి సంబంధిత సమస్య ఎదురవడంతో కుటుంబ సభ్యులు అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. రెండో విడత టీకాడ్రైవ్‌లో భాగంగా దత్తాకు సోమవారం వ్యాక్సిన్‌ ఇచ్చారు.

కరోనాపై తప్పుడు సమాచారం ఇవ్వకండి, కేంద్రంపై మండిపడిన ఐఎంఏ

అదేరోజు రాత్రి శ్వాస సంబంధిత సమస్యలు రావడంతో కుటుంబీకులు హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. అక్కడ కొద్దిగంటల పాటు చికిత్స పొందిన ఆయన మంగళవారం కన్నుమూశారు. సదరు వ్యక్తి కొమొర్బిడిటీతో బాధపడుతున్నట్లు తెలిపారు. మరణం అసహజమని కుటుంబీకులు ఆరోపించారు. దీంతో అతని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం జల్పాయిగురి స్టేట్‌ జనరల్‌ హాస్పిటల్‌కు తరలించామని, కేసు దర్యాప్తు సాగుతోందని అధికారులు తెలిపారు.

ఇక ఏపీలో చిత్తూరు జిల్లాలోని పాలసముద్రంకు చెందిన పట్రాజు జగదమ్మ(52) మధుమేహంతో బాధపడుతోంది. మూడో విడతలో శనివారం ఆమె స్థానిక పీహెచ్‌సీలో టీకా తీసుకుంది. ఈ క్రమంలో ఆమెకు జ్వరం రావడంతో మంగళవారం సాయంత్రం పీహెచ్‌సీలో చూపించారు. పరిస్థితి విషమించడంతో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది.

భారీ ఊరట..ఏపీలో గత 24 గంటల్లో ఒక్క కరోనా మరణం కూడా నమోదు కాలేదు, తాజాగా 118 మందికి పాజిటివ్, 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 38 మందికి కోవిడ్

కర్నాటక బెంగళూరులో కామేశ్వరి అనే 103 ఏళ్ల మహిళ కొవిడ్‌ వ్యాక్సిన్‌ తొలి డోసు తీసుకున్నది. దీంతో ఆమె దేశంలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న అత్యంత వయస్సున్న మహిళగా నిలిచిందని బన్నర్‌ఘట్ట రోడ్‌లోని అపోలో హాస్పిటల్‌ వైద్యులు తెలిపారు. అమెరికా తర్వాత అత్యధిక కొవిడ్‌ కేసులు భారత్‌లో రికార్డయ్యాయి. జనవరి 16న దేశంలో కేంద్రం టీకా డ్రైవ్‌ ప్రారంభించింది. ఇప్పటి వరకు 2.40కోట్లకుపైగా మోతాదులు ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రస్తుతం రెండో విడత టీకాల పంపిణీ కొనసాగుతోంది. 60 ఏళ్లు పైబడిన, 45 ఏళ్లకుపైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ వేస్తోంది. మొదటి విడతలో ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు వ్యాక్సిన్‌ ఇచ్చారు.

ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు కరోనా లేదని నకిలీ రిపోర్ట్‌ సృష్టించిన కుటుంబంపై బృహిన్‌ ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ (బీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కుటుంబం మొత్తంపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ముంబైలోని ఖార్‌కు చెందిన ఓ కుటుంబం జైపూర్‌ వెళ్లాలనుకున్నది. దీంతో కరోనా పరీక్షలు చేయించుకున్నారు. అందులో వారికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. అయితే వారు మాత్రం తమకు నెగెటివ్‌ అని నకిలీ రిపోర్ట్ చూపించి విల్లేపార్లే ఎయిర్‌పోర్టుకు వెళ్లారు.

కాగా, కరోనా పరీక్షలు నిర్వహించిన డాక్టర్‌.. వారికి పాజిటివ్‌ వచ్చిందని, విమానాశ్రయం నుంచి తిరిగి రావాలని వారికి చెప్పాడు. దీంతో వారు నకిలీ రిపోర్టు సృష్టించారనే విషయం బయటపడటంతో బీఎంసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా నిబంధనలు అతక్రమించినందుకు భార్యా భర్తలు, కూతురు (15)పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఎఫ్ఐఆర్‌ నమోదుచేశారు.

ఆ కుటుంబం చేసిన పని వారి ప్రాణాలకే కాకుండా, మొత్తం సమాజానికే హాని తలపెట్టేదిగా ఉందని బీఎంసీ అదనపు మున్సిపల్‌ కమిషనర్‌ సురేశ్‌ కకానీ తెలిపారు. ప్రజలు తప్పనిసరిగా కొవిడ్‌-19 నిబంధనలను పాటించాలని చెప్పారు. వారు నకిలీ రిపోర్టు సృష్టించడమే కాకుండా, జైపూర్‌ వెల్లడానికి వారి ఇంటి నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు ప్రయాణించారని వెల్లడించారు.