N. T. Rama Rao Death Anniversary: ఢిల్లీని ఢీకొట్టిన మొనగాడు, నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి నేడు, ఆయన సినీ జీవితం, రాజకీయ జీవితంపై ప్రత్యేక కథనం
Nandamuri Taraka Rama Rao (Photo-File Image)

Hyderabad, Jan 18: దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు 25వ వర్ధంతి (N. T. Rama Rao Death Anniversary) నేడు.. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్టీఆర్‌ ఘాట్‌లో నివాళి అర్పించారు. ఇక ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఏపీ వ్యాప్తంగా రక్తదాన శిబిరాలను టీడీపీ నిర్వహించనుంది. మంగళగిరిలో ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొననున్నారు. నందమూరి తారక రామారావు 25వ వర్థంతి (NTR Death Anniversary) సందర్భంగా ఆయన కుమారుడు టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఎన్టీఆర్ ఘాట్‌లో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడే ఒక థీరుడని (Nandamuri Taraka Rama Rao) కొనియాడారు. రామారావు గురించి మాట్లాడడమంటే సూర్యుడిని వేలుతో చూపించినట్లవుతుందని, భూమిపై అందరూ పుడతారని, అయితే అందరూ మహానుభావులు కాలేరని అన్నారు. ఏ మనిషి అయిన విజయపథంలో నడవాలంటే అకుంఠితదీక్ష ఉండాలనే విషయం ఎప్పుడు చెబుతుండేవారని, ఆయన మాటల్లో చెప్పడమే కాకుండా చేతలతో చేసి చూపించిన వ్యక్తి ఎన్టీఆర్ అని బాలకృష్ణ కొనియాడారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ టీడీపీ కార్యకర్తలు నినాదాలు చేశారు.

తెలుగు సినీ చరిత్రలో సాటిలేని కథానాయకుడిగా అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా ఎన్టీఆర్ నిలిచారు. విశ్వవిఖ్యాత నటసౌర్వభౌమ నటరత్న నందమూరి తారక రామారావును అభిమానులు స్వీట్ గా ఎన్టీఆర్ పిలుచుకుంటారు. నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, స్టూడియో అధినేతగా, రాజకీయ వేత్తగా, ముఖ్యమంత్రిగా ఎవరికి సాధ్యం కాని రీతిలో తెలుగు ప్రజలందరి చేత అన్నా అని జేజేలు పలికించుకున్ మేరు నగధీరుడుగా చరిత్రలో నిలిచిపోయారు.

సినిమాలలో ఉన్నప్పుడే ఆయన రాజకీయ పార్టీని స్థాపించారు. 1982లో తెలుగు దేశం పార్టీని స్థాపించిన అనంతరం ఎన్టీఆర్ ప్రచారరీత్యా 90 రోజుల వ్యవధిలో 35000 కిలోమీటర్లు ప్రయాణించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రo ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని తన పేర లిఖించుకున్నారు.

సత్యసాయిబాబావారి బోధనలు ప్రభోధించే నాలుగు అంశాల గురించి ఓ సారి తెలుసుకోండి

తెలుగువారు “అన్నగారు” అని అభిమానంతో పిలుచుకొనే నందమూరి తారక రామారావు 1923, మే 28 వ తేదీన ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా, పామర్రు మండలంలోని, నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య, వెంకట రామమ్మ దంపతులకు జన్మించాడు. మొదట కృష్ణ అని పేరుపెట్టాలని తల్లి అనుకున్నప్పటికీ, మేనమామ తారక రాముడయితే బాగుంటుంది అని చెప్పడంతో ఆ పేరే పెట్టారు. తరువాత అది కాస్తా తారక రామారావుగా మారింది. పాఠశాల విద్య విజయవాడ మునిసిపలు ఉన్నత పాఠశాలలో చదివాడు. తరువాత విజయవాడ ఎస్.ఆర్.ఆర్. కాలేజీలో చేరాడు.

1942 మే నెలలో 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని పెళ్ళి చేసుకున్నాడు. రామారావు గారు కాలేజీలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు వారి ఆస్తి మొత్తం ఏవో కొన్నికారణాల వల్ల హరించుకుపోయింది. అప్పుడు యుక్తవయసులో ఉన్న రామారావు జీవనం కోసం అనేక పనులు చేసాడు. కొన్ని రోజులు పాల వ్యాపారం, తరువాత కిరాణా కొట్టు, ఆపై ఒక ముద్రణాలయాన్ని కూడా నడిపాడు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అప్పు చేసేవాడు కాదు.

రామారావు 1947లో పట్టభద్రుడయ్యాడు. తదనంతరం అతను మద్రాసు సర్వీసు కమిషను పరీక్ష రాసాడు. పరీక్ష రాసిన 1100 మంది నుండి ఎంపిక చేసిన ఏడుగురిలో ఒకడుగా నిలిచాడు. అప్పుడు అతనుకు మంగళగిరిలో సబ్-రిజిస్ట్రారు ఉద్యోగం లభించింది. అయితే సినిమాలలో చేరాలనే ఆశయం కారణంగా ఆ ఉద్యోగంలో మూడు వారాలకంటే ఎక్కువ ఉండలేకపోయాడు.

దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌కు నివాళులు అర్పించిన కుటుంబ సభ్యులు, ప్రతి అడుగులోనూ నాన్నే నాకు తోడు అంటూ సీఎం జగన్ ట్వీట్, వై.యస్. రాజశేఖరరెడ్డి పాదయాత్రపై ప్రత్యేక కథనం

ప్రముఖ నిర్మాత బి.ఏ.సుబ్బారావు ఎన్టీఆర్ ఫొటోను ఎల్వీ ప్రసాదు దగ్గర చూసి, వెంటనే అతనును మద్రాసు పిలిపించి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయకుడిగా ఎంపిక చేసాడు. దీనికి గాను రామారావుకు వెయ్యి నూటపదహార్ల పారితోషికం లభించింది. వెంటనే అతను తన సబ్-రిజిస్ట్రారు ఉద్యోగానికి రాజీనామా చేసేసాడు. కానీ సినిమా నిర్మాణం వెంటనే మొదలవలేదు. ఈలోగా మనదేశం అనే సినిమాలో అవకాశం రావడంతో దానిలో నటించాడు. అంచేత అతను మొదటిసారి కెమేరా ముందు నటించిన సినిమా మనదేశం అయింది.

1949లో వచ్చిన ఆ సినిమాలో అతను ఒక పోలీసు ఇన్స్‌పెక్టర్‌ పాత్ర పోషించాడు. 1950లో పల్లెటూరి పిల్ల విడుదలైంది. అదే సంవత్సరం ఎల్వీ ప్రసాదు షావుకారు కూడా విడుదలైంది. అలా నందమూరి తారక రామారావు చలనచిత్ర జీవితం ప్రారంభమైంది. రెండు సినిమాల తరువాత ఎన్టీఆర్ తన నివాసం మద్రాసుకు మార్చివేశాడు. థౌజండ్‌ లైట్స్‌ ప్రాంతంలో ఒక చిన్న గదిని అద్దెకు తీసుకొని అందులో ఉండేవాడు. ఆయనతో పాటు ఆ గదిలో యోగానంద్ (తరువాతి కాలంలో నిర్మాత అయ్యాడు) కూడా ఉండేవాడు.

 తెలుగు నేలపై చెరగని సంతకం, పేద ప్రజల గుండె చప్పుడు, దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి

నందమూరి తారక రామారావు 50 సంవత్సరాలపైగా తెలుగు సినిమా రంగంలో కథా నాయకునిగా రాణించాడు. 40 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్ నృత్యం నేర్చుకోవడం మొదలుపెట్టారు. ప్రముఖ కూచిపూడి డాన్సర్ వెంపటి చినసత్యం దగ్గర ఆయన నృత్యం నేర్చుకున్నారు. అభిమానులను అలరించడానికి ఆయన 17 సినిమాలలో శ్రీ కృష్ణుడి వేషం కట్టారు. 50వ దశకంలో 76 సినిమాల్లో నటించగా, 60వ దశకంలో 119 సినిమాల్లో నటించాడు. ఇక 70వ దశకంలో 77 సినిమాల్లో నటించగా, 80వ దశకంలో 25 సినిమాల్లో నటించాడు. ఇక 90వ దశకంలో 4 సినిమాల్లో నటించారు. తెలుగు, తమిళం, హిందీ భాషలలో కలిపి దాదాపు 400 చిత్రాలలో నటించారు. నటుడిగానే కాకుండా.. నిర్మాతగా, దర్శకుడిగా పలు చిత్రాలను నిర్మించారు.

రాజకీయ జీవితం

ఈ తెలుగుదేశం పార్టీ శ్రామికుడి చెమటలో నుంచి వచ్చింది. కార్మికుడి కరిగిన కండరాలలో నుంచి వచ్చింది. రైతు కూలీల రక్తంలో నుంచి వచ్చింది. నిరుపేదల కన్నీటిలో నుండి.. కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం.. ఆశీర్వదించండి’ అంటూ 1982 మార్చి 29న హైదరాబాద్‌లోని న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో కేవలం పదిమంది పత్రికా విలేకరుల మధ్యన ‘తెలుగు దేశం’ పార్టీని స్థాపిస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు.

చైతన్య రథం ఎక్కి ఊరూరా తిరుగుతూ.. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ను మట్టికరిపించారు. ‘రైట్ పర్సన్ ఇన్ రైట్ టైమ్’ అనే మాటను అక్షరాలా నిజం చేస్తూ.. రాజకీయ శూన్యతను ముందే పసికట్టిన ఢిల్లీ నాయకుల్ని బెంబేలెత్తించి తెలుగోడి సత్తాను రుచిచూపించారు. ఆయన పిలుపు ఓ నవ్యోపదేశం అయ్యింది. ఆయన పలుకు ఓ సంచలనమై విరాజిల్లింది. ఆయన ప్రతి మాట ఓ తూటాగా.. ఆయన సందేశమే స్ఫూర్తిగా జనాల్లోకి చొచ్చుకుని వెల్లింది. పురాణ పురుషుల పాత్రలు ధరించి కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు.. రాజకీయ నేతగానూ ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు.

1983 జనవరి 7 న మధ్యాహ్నం ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం 199, కాంగ్రెసు 60, సిపిఐ 4, సిపిఎం 5, బిజెపి 3 సీట్లు గెలుచుకున్నాయి. 97 ఎళ్ళ సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెసు పార్టీ 9 నెలల తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓడిపోయింది. ఇక 1991లో నంద్యాల లోక్‌సభ ఉప ఎన్నికలలో కాంగ్రెసు తరపున అభ్యర్థిగా అప్పటి ప్రధానమంత్రి పి.వి.నరసింహారావు నిలబడగా, ప్రధానమంత్రి అయిన ఒక తెలుగువాడికి గౌరవ సూచకంగా ఎన్టీఆర్ ఎవరినీ పోటీగా నిలబెట్టలేదు. అది ఆయన గొప్పతనం.

1989-94 మధ్యకాలం ఎన్టీఆర్ రాజకీయ చరిత్రలో అత్యంత నిమ్నదశగా చెప్పవచ్చు. ప్రతిపక్ష నాయకుడిగా శాసనసభలో అధికార కాంగ్రెసు పార్టీచేతిలో అవమానాలు పొందాడు. శాసనసభలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య ఘర్షణ ఏస్థాయిలో ఉండేదంటే - ఈ కాలంలో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులను 9 సార్లు సభనుండి బహిష్కరించారు. ఈ కాలంలో నాలుగు సినిమాలలో నటించాడు కూడా. తన జీవితకథ రాస్తున్న లక్ష్మీపార్వతిని 1993 సెప్టెంబరులో పెళ్ళి చేసుకున్నాడు. రామారావు వ్యక్తిగత జీవితంలో ఇదో కీలకమైన మలుపు. అతను వ్యక్తిగత జీవితం, కుటుంబ సభ్యులతో అతను సంబంధాలపై ఈ పెళ్ళి కారణంగా నీడలు కమ్ముకున్నట్లు కనిపించాయి.

1994లో కిలో బియ్యం రెండు రూపాయలు, సంపూర్ణ మద్య నిషేధం, వంటి హామీలతో, మునుపెన్నడూ ఏపార్టీ కూడా సాధించనన్ని స్థానాలు గెలిచి మళ్ళీ అధికారంలోకి వచ్చాడు. ప్రభుత్వ ఖజానాకు ఎంత భారంపడినా కూడా ఎన్టీఆర్ తన హామీలను అమలుపరిచాడు. అయితే అతను రెండవ భార్య లక్ష్మీపార్వతి పార్టీ, ప్రభుత్వ విషయాలలో విపరీతంగా కలుగజేసుకొన్నారు అనే ప్రచారంతో ప్రముఖులు అభద్రతా భావాన్ని ఎదుర్కొన్నారు.తెలుగు దేశం ఎమ్మెల్యేలు చంద్రబాబును ముఖ్యమంత్రిగా ఎన్నుకోవడంతో అతను ముఖ్యమంత్రి పదవికి దూరమయ్యాడు . అంతటితో ఎన్టీఆర్ రాజకీయ జీవితం ముగిసినట్లయింది. తర్వాత, 1996 జనవరి 18న 73 సంవత్సరాల వయసులో గుండెపోటుతో ఎన్టీఆర్ మరణించాడు. ఆయన ఈ భూమి మీద లేకపోయినా తెలుగు ప్రజల గుండెల్లో ఇంకా బతికే ఉన్నారు.

ముప్పైమూడేళ్ళ తెర జీవితంలోను, పదమూడేళ్ళ రాజకీయ జీవితంలోను నాయకుడిగా వెలిగిన ఎన్టీఆర్ చిరస్మరణీయుడు. ఎన్టీఆర్ పేరిట సినిమా ప్రముఖులకు జీవిత కాలంలో చేసిన సేవకు గుర్తింపుగా ఎన్టీఆర్ జాతీయ పురస్కారాన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం 1996 లో నెలకొల్పింది. 2002 వరకు ఇస్తూ వచ్చిన ఈ అవార్డును ప్రభుత్వం తరువాత నిలిపివేసింది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా 2006 జనవరి 18 న ఈ పురస్కారాన్ని పునరుద్ధరించాలని ప్రభుత్వం నిర్ణయించింది

దేవాలయాలలో పూజారి వృత్తికి మొదటిసారి బ్రాహ్మణేతరులకు కూడా అవకాశం వచ్చేలా పరీక్ష ద్వారా పదవులను భర్తీ చేయించిన ఘనత ఎన్టీఆర్ ది.ఎన్టీఆర్ ఒకసారి న్యూ యార్క్ వెళ్లినప్పుడు అక్కడి స్టాట్యూ అఫ్ లిబర్టీని చూసి మైమరచిపోయారట. అలాంటి విగ్రహం హైదరాబాద్‌లో కుడా ఉండాలని ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న బుద్ధుడి విగ్రహాన్ని చెక్కించడం మొదలుపెట్టారు. శ్రీమద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్ర' సినిమాలోని ఒక సీన్ ని కట్ చెయ్యాలని సెన్సార్ బోర్డు పట్టుబడితే… ఎన్టీఆర్ కోర్టుకు వెళ్లి 3 ఏళ్ళ తరువాత కేసు గెలిచి సినిమాను విడుదల చేసుకున్నారు.1987 హర్యానా ఎన్నికల్లో దేవీ లాల్ కు మద్దతుగా ప్రచారం చెయ్యడానికి ఆయన తనయుడు నందమూరి హరికృష్ణను తోడుగా తీసుకొని హైదరాబాద్ నుంచి రోడ్ దారిన వెళ్లారు. ఆనూహ్యంగా దేవి లాల్ ఆ ఎన్నిక గెలిచి ముఖ్య మంత్రి కూడా అయ్యారు.

తెలుగు సంప్రదాయానికి ప్రాధాన్యమిచ్చే ఎన్టీఆర్.. మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు ఇంటికి వచ్చినప్పుడు బయటకు వెళ్లి చెంబుతో స్వయంగా నీళ్లిచ్చి కాళ్లు కడిగించి లోపలికి తీసుకొచ్చారు. ఇంటికి విందుకు ఆహ్వానించినప్పుడు, ఎన్టీఆరే స్వయంగా అతిథులకు భోజనం వడ్డించేవారు. ఎన్టీఆర్ కృష్ణుడు, రాముడు, వెంకటేశ్వరుడు లాంటి పురాణ పాత్రలు చేసిన సినిమాల్లో ఎడమచేతితోనే ఆశీర్వదించేవారు, అభయం ఇచ్చేవారు.అలా ఎందుకని చాలా మందికి సందేహం ఉండేది, కొందరు ఆయన్నే డైరెక్టుగా అడిగారు కూడా. దానికి ఎన్టీఆర్ స్పందిస్తూ.. "మన హృదయం ఉన్నది ఎడమవైపు. పూజలలో భార్యను ఎడమవైపే కూర్చోబెట్టుకుంటాం. మన శరీరంలోని మాలిన్యాన్ని శుభ్రం చేసేది కూడా ఎడమ చెయ్యే. ఎడమ భాగానికున్న ప్రాధాన్యత కుడి భాగానికి లేదు. అందుకే ఎడమ చేతితోనే ఆశీర్వదిస్తున్నాను" అన్నారట.. అవతలివారు ఆశ్చర్యపోయాక అసలు గుట్టు విప్పేవారట ఎన్టీఆర్. సినిమాల్లో తీసే అడ్వెంచర్స్, ఫైటింగుల వల్ల, ఒక రోడ్డు ప్రమాదం వల్ల ఎన్టీఆర్ కుడిచెయ్యి నాలుగు సార్లు విరిగింది. వరుస ప్రమాదాలతో కుడిచేయి పట్టు తప్పడంతో ఎడమచేత్తోనే దీవెనలు ఇవ్వడం ప్రారంభించారట ఎన్టీఆర్.