Pulwama Terror Attack:మరో ఉగ్రదాడికి టెర్రరిస్టుల వ్యూహం, భద్రతా దళాల అలర్ట్‌తో తప్పిన ప్రమాదం, అజిత్ దోవల్‌ని టార్గెట్ చేసిన ఉగ్రవాదులు, పుల్వామా అటాక్ జరిగి నేటికి రెండేళ్లు పూర్తి, దాడిని ఎప్పటికీ మరచిపోలేరని తెలిపిన ప్రధాని మోదీ
Photos of CRPF jawans martyred in Pulwama Terror Attack | (Photo Credits: CRPF@Twitter)

New Delhi, February 14: జమ్ము కశ్మీర్‌లోని పుల్వామా ఉగ్రదాడి జరిగి నేటికి రెండేళ్లు (Pulwama Terror Attack) అవుతోంది. 2019, ఫిబ్రవరి 14న పుల్వామా ఉగ్రదాడిలో దాదాపు 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు మరణించడం దేశవ్యాప్తంగా కలకలం రేపింది. దేశం యావత్తూ ఈ రోజు ఆ అమర వీరులను (Pulwama Attack Tribute) గుర్తు చేసుకుంది. అయితే ఈ భీకర దాడి వెనుక కుట్ర దాగిఉందని చత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బాఘేల్‌ ఆందోళన వ్యక్తం చేశారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే పుల్వామాలోకి భారీ మొత్తంలో పేలుడు పదార్ధాలను ఎలా తీసుకురాగలిగారని ఆయన ప్రశ్నించారు.‘ పటిష్ట భద్రత ఉండే ఆ ప్రాంతంలోకి 300 కిలోల ఆర్‌డీఎక్స్‌ను ఎలా చేరవేశారు..? ఈ కుట్ర వెనుక ఎవరున్నార’ని భూపేష్‌ బాఘేల్‌ ట్విటర్‌లో ప్రశ్నించారు. పుల్వామా దాడిలో మరణించిన జవాన్లకు నివాళులు అర్పిస్తున్నానని, అమర జవాన్లకు దేశమంతా శాల్యూట్‌ చేస్తోందని ఆయన ట్వీట్‌ చేశారు.

పుల్వామా ఉగ్రదాడిని దేశం, దేశ ప్రజలు ఎప్పటికీ మరిచిపోరని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. సరిగ్గా రెండేళ్ల కిందట ఇదే రోజున 40 మంది సైనికులను ఉగ్రవాదులు బలితీసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సైనికుల త్యాగాలను మరువబోమని, తరతరాలకు వారి తెగువ స్ఫూర్తినిస్తుందని ఆయన చెప్పారు. ఆదివారం తమిళనాడు రాజధాని చెన్నైలో పలు ప్రాజెక్టులు, అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించారు.

మరువనిదీ ఈ గాయం! పుల్వామా అమరవీరులకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా

ప్రముఖ తమిళ రచయిత సుబ్రహ్మణ్యం భారతి చెప్పిన కొన్ని మాటలను ఆయన గుర్తు చేశారు. ‘‘మనం ఆయుధాలు తయారు చేద్దాం.. కాగితాలు తయారు చేద్దాం.. కర్మాగారాలు నిర్మిద్దాం.. పాఠశాలలను నెలకొల్పుదాం.. వాహనాలను రూపొందిద్దాం.. ఓడలను తయారుచేద్దాం’’ అన్న మాటలను గుర్తు చేశారు. ఆయన చెప్పిన మాటల స్ఫూర్తిగా ఈ రోజు దేశం రక్షణ రంగంలో ఆత్మనిర్భరతను, స్వావలంబనను సాధించిందని ప్రధాని పేర్కొన్నారు. మన సైనికులు దేశ విలువలతో పాటు ధీరత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పాయని ప్రధాని మోదీ కొనియాడారు. సమయం వచ్చినప్పుడల్లా మాతృభూమిని కాపాడడంలో తమ సామర్థ్యాన్ని నిరూపిస్తున్నారన్నారు. శాంతి సామరస్యాలను నమ్ముతూనే.. మన సార్వభౌమత్వాన్ని దెబ్బతీసే కుట్రలను దీటుగా ఎదుర్కొంటున్నారన్నారు.

అంతకు మించిన దాడులు చేస్తాం!

ఇక జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్‌ దోవల్‌ లక్ష్యంగా ఉగ్రవాదులు దాడులకి కుట్ర పన్నారు. పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదులు ఆయన నివాసం వద్ద రెక్కీ నిర్వహించినట్టుగా తెలుస్తోంది. దీంతో దోవల్‌ కార్యాలయం, నివాసం వద్ద భద్రతను పెంచారు. జైషే మహమ్మద్‌ ఉగ్రవాది హిదయత్‌ ఉల్లా మాలిక్‌ను అరెస్ట్‌ చేసి ప్రశ్నించడంతో రెక్కీ విషయం బయటపడింది. దోవల్‌తో పాటుగా ఉగ్రవాదుల హిట్‌లిస్ట్‌లో ఉన్న వారి సమాచారాన్ని సేకరించి పాకిస్తాన్‌కు చేరవేసినట్టుగా తెలుస్తోంది.

పుల్వామా దాడిలో కీలక పాత్ర పోషించిన కశ్మీర్‌ జైషే చీఫ్‌ హతం 

ఫిబ్రవరి 6న పోలీసులు మాలిక్‌ను అరెస్ట్‌ చేశారు. అతనితో సహా నలుగురిని పోలీసులు ప్రశ్నించారు. వారిలో మాలిక్‌ భార్య, చండీగఢ్‌కు చెందిన ఒక విద్యార్థి, బీహార్‌ నివాసి ఉన్నారు. పోలీసుల విచారణలో పాకిస్తాన్‌ ఆదేశాల మేరకే తామందరం రెక్కీ నిర్వహించామని మాలిక్‌ అంగీకరించాడు. గత ఏడాది మేలో న్యూఢిల్లీలోని దోవల్‌ కార్యాలయం సహా కొన్ని ప్రాంతాలను వీడియో తీసి పంపించామని వెల్లడించాడు. దోవల్‌ 2019 బాలాకోట్‌ వైమానిక దాడులు జరిగినప్పట్నుంచి పాకిస్తాన్‌ ఉగ్రవాదుల హిట్‌ లిస్ట్‌లో ఉన్నారు. దీంతో ఆయనకి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

జమ్ములో ఉగ్రవాదులు మరోసారి బాంబు దాడికి ప్రణాళికలు సిద్ధం చేయగా భద్రతా దళాలు గుర్తించడంతో పెద్ద ప్రమాదం తప్పింది. రద్దీతో కూడిన బస్ స్టాండ్ సమీపంలో ఏడు కిలోగ్రాముల ఇంప్రొవైజ్డ్ పేలుడు పరికరం (ఐఈడీ) ను స్వాధీనం చేసుకున్నారు. పుల్వామా దాడి రెండో ఏడాది సందర్భంగా పేలుడు జరిపేందుకు ఈ ఐఈడీని ఉగ్రవాదులు పెట్టినట్లు భద్రతా దళాలు గుర్తించాయి. ఈ ఐఈడీ నిర్దిష్ట సమాచారం మేరకు పనిచేసేలా ఏర్పాటు చేసినట్లు భద్రతా సిబ్బంది చెప్పారు.సాంబా జిల్లాలోని జమ్ము, బారి బ్రాహ్మణ ప్రాంతంలోని కుంజ్‌వానీ నుంచి ఇద్దరు ఉగ్రవాదులను ఇటీవల అరెస్టు చేసిన తరువాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

బాలాకోట్, పుల్వామా దాడులు మళ్లీ తెరపైకి, అభినందన్‌ను విడుదల చేయకుంటే పాక్ పరిస్థితి మరోలా ఉండేది, నాటి విషయాలను గుర్తు చేసుకున్న మాజీ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ బీఎస్‌ ధనోవా

జమ్ము బస్ స్టాండ్ సమీపంలో 7 కిలోల ఐఈడీని పాతినట్లు అరెస్ట్‌ అయిన ఉగ్రవాదులు ఇచ్చిన సమాచారం మేరకు ఆ పేలుడు పరికరాన్ని తొలగించడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. గత ఏడాది దక్షిణ కశ్మీర్‌లో ముగ్గురు బీజేపీ కార్యకర్తలు, ఒక పోలీసు హత్యకు సంబంధించి ది రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్) తో అనుబంధంగా ఉన్న ఉగ్రవాది జహూర్ అహ్మద్ రాథర్‌ను సాంబాలోని బారి బ్రాహ్మణ ప్రాంతంలో శనివారం అరెస్టు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 6 న జమ్ములోని కుంజ్వానీ ప్రాంతం నుంచి లష్కర్-ఏ-ముస్తఫా యొక్క సెల్ఫ్ స్టైల్‌ కమాండర్ హిదయతుల్లా మాలిక్‌ను అదుపులోకి తీసుకున్నారు.

బాలాకోట్ మెరుపు దాడులు వీడియో బయటకు, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే సందర్భంగా వీడియో విడుదల, పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసిన భారత వాయుసేన దళాధిపతి భదౌరియా

రెండేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున పాకిస్తాన్‌కు చెందిన టెర్రర్ గ్రూపు జైష్-ఏ-ముహమ్మద్‌కు చెందిన ఆత్మాహుతిదళం దాడిలో పేలుడు నిండిన వాహనాన్ని కశ్మీర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ వాహనాల కాన్వాయ్‌లోకి దూసుకెళ్లడంతో 40 మంది సీఆర్‌పీఎఫ్ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి జరిగిన కొన్ని రోజుల తరువాత ఫిబ్రవరి 26 న పాకిస్తాన్‌లోని బాలకోట్ ప్రాంతంలో జైష్‌ ఉగ్రవాద శిక్షణా శిబిరాన్ని లక్ష్యంగా చేసుకుని భారత వైమానిక దళం వైమానిక దాడులకు దిగింది.