FIR Against Twitter India: వివాదాల మధ్య నలిగిపోతున్న ట్విట్టర్, యూపీలో ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఎఫ్ఐఆర్ నమోదు, జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్‌, నెటిజన్ల ఆగ్రహంతో గంటల వ్యవధిలో మ్యాప్ తొలగింపు
Twitter logo (Photo courtesy: Twitter)

New Delhi, June 29: కొత్త ఐటీ చట్టాలపై కేంద్రంతో ఘర్షణ పడుతున్న ట్విటర్‌ మరో సారి వివాదంలో చిక్కుకుంది. జమ్మూకశ్మీర్‌, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా (Distorted Map Showing Jammu and Kashmir, Ladakh Outside India) పేర్కొంటూ మ్యాప్‌ను తప్పుగా చూపింది. దీంతో నెటిజన్లు ట్విటర్‌ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేయడంతో ట్విటర్‌ వెనక్కు తగ్గింది.

అయినప్పటికీ ట్విట్టర్ ఇండియా చీఫ్ మనీష్ మహేశ్వరిపై ఉత్తరప్రదేశ్‌లో ఎఫ్ఐఆర్ (Twitter Officials Named in FIR ) నమోదైంది. మహేశ్వరితో పాటు, న్యూస్ పార్టనర్‌షిప్స్ హెడ్ అమృత త్రిపాఠి పేరును ఇందులో చేర్చారు.

జమ్మూకశ్మీర్, లద్దాఖ్‌లను ప్రత్యేక దేశాలుగా పేర్కొంటూ మ్యాప్‌ను తప్పుగా ట్విట్టర్ చూపించడంతో ఈ ఎఫ్ఐఆర్ (FIR Against Twitter India) నమోదైంది. ఐపీసీలోని సెక్షన్ 505(2), ఐటీ సవరణ చట్టం 2008లోని సెక్షన్ 74 కింద కేసులు నమోదు చేశారు. ''ఉద్దేశపూర్వకంగానే ఈ దేశద్రోహ చర్యకు పాల్పడ్డారు. చర్య తీసుకోవాల్సి ఉంటుంది'' అని తన కంప్లయింట్‌లో బజరంగ్ దళ్ నేత ప్రవీణ్ భాటి పేర్కొన్నారు.

అమెరికా ఐటీ చట్టాల ఉల్లంఘన అనే అభియోగాల మీద కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ అధికారిక ఖాతాను బ్లాక్ చేసిన ట్విట్టర్, ఇది 'భారత ఐటీ మార్గదర్శకాల స్థూల ఉల్లంఘన’ గా మంత్రి అభివర్ణన

కాగా ఘజియాబాద్‌లో ఓ వృద్ధుడిపై దాడి జరిగిన వీడియో విషయంలో ఉత్తరప్రదేశ్ పోలీసులు మహేశ్వరిపై ఇటీవల ఎఫ్ఐఆర్ నమోదు చేయగా, ఈ వారం ప్రారంభంలో మహేశ్వరికి కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ఉపశమనం కల్పించింది. హహేశ్వరిపై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని, వర్చువల్ పద్ధతిలో దర్యాప్తు నిర్వహించాలని జస్టిస్ జీ.నరేందర్ యూపీ పోలీసులకు ఆదేశాలు ఇచ్చారు.

ఇదిలా ఉంటే నెటిజన్ల ఆగ్రహంతో కొన్ని గంటల్లోనే మ్యాప్‌ను ట్విటర్‌ తొలగించింది.గతంలో లేహ్‌ను చైనాలో అంతర్భాగంగా ట్విటర్‌ చూపించిన విషయం తెలిసిందే. అప్పట్లో ట్విటర్‌కు కేంద్ర తీవ్ర హెచ్చరికలను జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన ఐటీ నిబంధనలను ట్విటర్‌ బేఖాతరు చేస్తోంది. కొద్ది రోజుల క్రితం కేంద్ర ఐటీ శాఖ మంత్రి ట్విటర్ ఖాతాను బ్లాక్ చేసి తిరిగి పునరుద్దరించిన విషయం తెలిసిందే.

ట్విట్టర్‌పై భారత్‌లో కేసు నమోదు, ఇప్పటికే చ‌ట్ట‌ప‌ర‌మైన ర‌క్ష‌ణ‌ను ఎత్తివేసిన కేంద్రం, ట్విటర్‌ కూడా క్రిమినల్‌ చర్యలు ఎదుర్కోవాల్సిందేనని స్పష్టం చేసిన కేంద్ర ఐటీ శాఖ

ట్విటర్ ఇండియా గ్రీవెన్స్ ఆఫీసర్ పోస్టు నుంచి ధర్మేంద్ర చాతుర్‌ ఆ పదవికి రాజీనామా చేశారు. ధర్మేంద్ర ఆ పదవికి రాజీనామా చేయడంతో కొత్తగా ఆయన స్థానంలోకి ట్విటర్ గ్లోబల్ లీగల్ పాలసీ డైరెక్టర్ అయిన జెరెమి కెస్సెల్‌ను భారతదేశానికి గ్రీవెన్స్ అధికారిగా నియమించింది. నిబందనల ప్రకారం స్థానికులనే గ్రీవెన్స్ ఆఫీసర్‌గా నియమించాలి. ఇదిలా ఉంటే ఐటీ చట్టం 69ఏ కింద నిషేధంతోపాటు, ట్విటర్‌ అధికారులకు ఏడేళ్ల జైలు శిక్షతోపాటు జరిమానా కూడా విధించే అవకాశం ఉంది.

కాగా, పౌరుల హక్కుల పరిరక్షణ, సామాజిక మాధ్యమాల దుర్వినియోగంపై ఫేస్‌బుక్‌, గూగుల్‌ అభిప్రాయాలను తెలుసుకోవడానికి కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ నేతృత్వంలోని ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీపై ఏర్పాటైన స్టాండింగ్‌ కమిటీ మంగళవారం సమావేశమవుతోంది. ట్విటర్‌తో ఏర్పడిన ఘర్షణ వాతావరణం నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించకుంది.