New Delhi, May 7: విశాఖపట్నంలోని ఆర్‌ఆర్ వెంకటాపురంలో ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ ( LG Polymers industry) నుంచి గ్యాస్ లీకైన ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఈ అత్యవసర సమావేశంలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, ఎన్డీఆర్‌ఎఫ్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.ఇప్పటికే ఏపీలోని అధికారులకు ఫోన్ చేసిన కేంద్ర ప్రభుత్వ అధికారులు పలు వివరాలు తెలుసుకున్నారు. కాసేపట్లో విశాఖకు చేరుకోనున్న ఏపీ సీఎం, కేజీహెచ్ ఆస్పత్రిలో బాధితులను పరామర్శించనున్న వైయస్ జగన్, గ్యాస్ లీక్ దుర్ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి
గ్యాస్ లీక్ ప్రభావిత ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అందించాల్సిన సదుపాయాలపై మోదీకి అధికారులు పలు సూచనలు చేశారు. ఆసుపత్రిలో ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు అందించడం, అందుకు అవసరమైన వైద్య పరికరాలు వంటి అంశాలపై చర్చిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి అందించాల్సిన అన్ని సహాయక చర్యలపై చర్చలు జరుపుతున్నారు. సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. ఘటనపై ఏపీ సీఎంకు ప్రధాని మోదీ ఫోన్, కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు ఉంటాయని వెల్లడి, ఎన్‌డీఎంఏతో అత్యవసర సమావేశం
విశాఖ గ్యాస్ లీక్ (Visakhapatnam Gas Leak) ప్రమాదంలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరుకుంది. ఆర్. ఆర్. వెంకటాపురంలో (RR Venkatapuram village) కాల్వలో పడి ఇద్దరు, బావిలో పడి ఒకరు, కేజీహెచ్ క్యాజువాల్టీలో ముగ్గురు, ఆర్పీ వార్డులో ఇద్దరు, విజయనగరం కొత్తవలస ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో వ్యక్తి మృతిచెందాడు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.
Here's ANI Tweet
#VizagGasLeak: Prime Minister Narendra Modi called for a meeting of the NDMA (National Disaster Management Authority), in wake of the situation in Visakhapatnam (Andhra Pradesh). Union Defence Minister Rajnath Singh and Union Home Minister Amit Shah also present. pic.twitter.com/riFiBKnFMY
— ANI (@ANI) May 7, 2020
విశాఖపట్టణంలోని (Visakhapatnam) ఆర్ఆర్ వెంకటాపురం వద్ద ఉన్న ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి తెల్లవారుఝామున మూడున్నర గంటల సమయంలో స్టెరీన్ గ్యాస్ విడుదలైంది. విషవాయువు పీల్చి ఏడుగురు చనిపోయారు. వంద మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. సుమారు వెయ్యిమంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కంపెనీకి 5 కిలోమీటర్ల పరిధి వరకూ అనేక జంతువులు, పక్షులు కూడా చనిపోయాయి. చెట్ల రంగు మారిపోయింది.
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబ సభ్యులకు రాష్ట్రపతి సానుభూతి ప్రకటించారు. అందరి క్షేమం కోరుతూ, బాధితులు త్వరగా కోలుకోవాలని పేర్కొంటూ భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు రామ్‌నాథ్ కోవింద్ తెలిపారు.
విశాఖ దుర్ఘటనపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అవసరమైన సాయం అందించాలంటూ స్థానిక కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను ఆయన కోరారు. ఇవాళ ఉదయం ట్విటర్లో రాహుల్ స్పందిస్తూ... ‘‘వైజాగ్ గ్యాస్ లీక్ ఘటన గురించి తెలిసి షాక్ అయ్యాను. బాధితులకు అవసరమైన సాయం అందించాలని స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కోరుతున్నాను. ఆప్తులను కోల్పోయిన కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి. అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న వారంతా త్వరగా కోలుకోవాలని ప్రార్ధిస్తున్నాను..’’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.