Shiv Sena-NCP-Congress can prove majority in 10 minutes, says Sanjay Raut (Photo-ANI)

Mumbai, November 24: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల శివసేన ఎంపీ సంజయ్ రౌత్ (Sanjay Raut) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మహారాష్ట్ర(Maharashtra)లో బీజేపీ(BJP) ప్రభుత్వం ఏర్పాటు చేయడంపై ఆయన మీడియాతో మాట్లాడారు. శివసేన(Shivsena), కాంగ్రెస్(Congress), ఎన్సీపీ (NCP) కూటమే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఫడ్నవిస్ (Devendra Fadnavis) సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారని మహారాష్ట్ర ప్రజలకే తెలియదని అన్నారు.

ప్రభుత్వ ఏర్పాటును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసిన మహారాష్ట్ర వికాస అఘాడి కూటమి

కేవలం 10 నిమిషాల్లోనే మా మెజార్టీని నిరూపించుకుంటామని తెలిపారు. ఎన్సీపీ పార్టీ తిరుగుబాటు నేత అజిత్ పవార్ (Ajit Pawar) నిన్న గవర్నర్ కోష్యారీకి తప్పుడు పత్రాలు ఇచ్చారని, వాటినే గవర్నర్ అంగీకరించి ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపీకి అవకాశమిచ్చారని చెప్పారు. బీజేపీ పూర్తిగా ఎమ్మెల్యేల కొనుగోలు రాజకీయం చేస్తోందని సంజయ్ రౌత్ విమర్శలు గుప్పించారు. శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమికి స్పష్టమైన బలం ఉందని అన్నారు. అజిత్ పవార్ మళ్లీ తిరిగివస్తాడు, జైలుకు వెళతాననే భయంతోనే బీజేపీకి మద్ధతు ఇచ్చాడని సంజయ్ రౌత్ ఇంతకు ముందు వివర్శలు చేసిన సంగతి విదితమే

 

కాగా, అసెంబ్లీలో బీజేపీ బలపరీక్షలో గెలవలేదని, ఆ పార్టీకి మెజార్టీ ఎమ్మెల్యేల బలం లేదని శరద్ పవార్ (Sharad Pawar) తెలిపిన విషయం తెలిసిందే. బల నిరూపణ అనంతరం తాము ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని ఆయన కూడా ఇప్పటికే చెప్పారు.

ఎన్సీపీలో అజిత్‌ పవార్‌ తిరుగుబావుటా ఎగురవేసిన నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు, వారిని మధ్యప్రదేశ్‌ రాజధాని భోపాల్‌కు తరలిస్తోంది. మొత్తం 44 మంది ఎమ్మెల్యేలను విమానం ద్వారా పంపేందుకు సిద్ధం అయింది. మధ్యప్రదేశ్‌ సీఎంగా కాంగ్రెస్‌కు చెందిన కమల్‌ నాథ్‌ ఉండడంతో భోపాల్‌ సరైన రక్షణ ప్రాంతమని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఈ వ్యవహారాలను కమల్‌నాథ్‌తో పాటు ఆ పార్టీ సీనియర్‌ నేత దిగ్విజయ సింగ్‌ కూడా పరిశీలిస్తున్నారు.

ఇక శివసేన, ఎన్సీపీ పార్టీలు తమ ఎమ్మెల్యేలను ముంబయిలోని పలు లగ్జరీ హోటళ్లకు తరలించాయి. తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఆ పార్టీల అగ్రనేతలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసెంబ్లీలో బీజేపీ బలనిరూపణ ఏ రోజు జరిగినా దానికి హాజరయ్యేందుకు సిద్ధంగా ఉండాలని ఆ మూడు పార్టీలు భావిస్తున్నాయి.

ముంబయిలోని పోవైలో ఉన్న ఓ హోటల్ కు నిన్న రాత్రే ఎన్సీపీ ఎమ్మెల్యేలు బస్సుల్లో చేరుకున్నారు. శివసేన నుంచి 56 మంది నేతలు అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన విషయం తెలిసిందే. వారిలో 55 మంది అంధేరీలో ఉన్న ఓ హోటల్ లో ఉన్నారు. అలాగే, వారి నుంచి ఆ పార్టీ అధిష్ఠానం సెల్ ఫోన్ లను తీసుకుంది.అలాగే, శివసేన ఎమ్మెల్యేలు ఉన్న హోటల్ లోనే ఎనిమిది మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాజ్ కుమార్ పటేల్ మీడియాకు చెప్పారు.

మహారాష్ట్రలో బీజేపీ ఆగమేఘాల మీద ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, బలపరీక్షకు గవర్నర్ వారం రోజులు గడువు ఇవ్వడంపై శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌లు మండిపడ్డాయి. ప్రభుత్వ ఏర్పాటుకు ఫడ్నవిస్‌ను గవర్నర్ ఆహ్వానించడాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేశాయి. తమకు 144 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించేలా ఆదేశాలివ్వాలని ఆ పిటిషన్‌లో పేర్కొన్నాయి.

అంతేకాదు, ఫడ్నవిస్ ప్రభుత్వం నేడు బలపరీక్ష నిర్వహించేలా చూడాలని కోరాయి. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని మూడు పార్టీలు అభ్యర్థించాయి. అంగీకరించిన సుప్రీంకోర్టు నేటి ఉదయం 11:30లకు విచారణ చేపట్టనున్నట్టు తెలిపింది.

కాగా, శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతుండగానే నిన్న ఉదయం బీజేపీ షాకిచ్చింది. ఉదయం ఎనిమిది గంటలలోపే ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ ప్రమాణ స్వీకారం చేశారు. తమకు మద్దతు ఇచ్చిన అజిత్ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా రాజకీయాల్లో పెను సంచలనానికి కారణమైంది.