Telangana CM KCR (photo-PTI)

Karimnagar, January 27: కరీంనగర్‌లో కారు దూసుకుపోయింది, అధికార టీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీలు ఘోర పరాజయాన్నిచవి చూశాయి. ఇప్పటివరకు వెలువడిన ఫలితాలను బట్టి చూస్తే కరీంనగర్‌ మున్సిపల్ కార్పొరేషన్‌ను అధికార టీఆర్‌ఎస్ పార్టీ కైవసం చేసుకున్నట్లేనని తెలుస్తోంది. మొత్తం 60 స్థానాలు ఉండగా.. టీఆర్‌ఎస్ పార్టీ నుంచి ఇప్పటికే 34 మంది అభ్యర్థులు కార్పొరేటర్లుగా గెలుపొందారు. బీజేపీ 12, ఎంఐఎం 6 స్థానాల్లో విజయం సాధించాయి. 8 స్థానాల్లో ఇతరులు గెలుపొందారు. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఖాతా కూడా తెరవకపోవలేకపోయింది.

టీఆర్‌ఎస్ పార్టీకి స్పష్టమైన ఆధిక్యం వచ్చిన నేపథ్యంలో మేయర్ అభ్యర్థి ఎంపికపై అక్కడ అప్పుడే రాజకీయాలు మొదలయినట్లుగా తెలుస్తోంది. మాజీ మేయర్ రవీందర్ సింగ్‌తో పాటు మరో ఇద్దరు కార్పొరేటర్లు మేయర్ పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇదిలా ఉంటే కరీంనగర్‌లో పార్లమెంట్ ఎన్నికల తరహాలో బీజేపీ హవా కొనసాగుతుందని భావించినా దానికి పూర్తి విరుద్ధంగా ఫలితాలు వచ్చాయి.

58 డివిజన్లకు ఎన్నికలు, మరో మూడు చోట్ల రీపోలింగ్ 

బీజేపీ పార్టీ అక్కడ మేయర్ పీఠం కైవసం చేసుకుంటుందని బీజేపీ పార్టీ నేతలు ధీమాతో ఉన్నారు. అయితే ఫలితాలు వెలువడే కొద్దీ వారి ఆశలు అడియాసలు అయ్యాయి. కరీంనగర్‌లోని ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓట్ల లెక్కింపు జరిగింది. ఉదయం 8 గంటలకే పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైనా.. కౌంటింగ్ ఓ గంట ఆలస్యంగా మొదలైంది. మొత్తం 3 రౌండ్లలో ఫలితాలు వెల్లడించారు.

ఇక అటు నిజామాబాద్‌లోనూ మేయర్ పీఠాన్ని టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడంతో బీజేపీ శ్రేణుల్లో నైరాశ్యం నెలకొంది. మరోవైపు పదింటికి పది కార్పొరేషన్లను కైవసం చేసుకోవడం పట్ల టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు.