
Yadagirigutta, Feb 23: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రంగా అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దబడిన యాదగిరి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో మహాకుంభాభిషేకం సంప్రోక్షణ మహోత్సవాలు (Yadagirigutta Swarna Vimana Gopuram) వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం పంచకుండాత్మక నృసింహ మహాయాగం నిర్వహించి ప్రధాన ఆలయ దివ్య స్వర్ణం విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేయనున్నారు. స్వర్ణ విమానాన్ని దేవుడికి అంకితం చేసే ప్రక్రియలో దేశంలోని 40 నదుల నుంచి సేకరించిన జలాలతో మహాసంప్రోక్షణ చేయనున్నారు. దేశంలోనే అత్యంత ఎత్తయిన స్వర్ణ విమాన గోపురంగా రికార్డులకెక్కిన ఈ గోపుర ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. ఆదివారం ఉదయం 11.54 గంటలకు మూలా నక్షత్రయుక్త వృషభ లగ్న పుష్కరాంశ సుముహుర్తాన శ్రీసుదర్శన లక్ష్మీనరసింహ స్వామివారికి గోపురాన్ని అంకితం చేయనున్నారు. ఇందులో భాగంగా ఆదివారం జరిగే మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమాల్లో ముఖ్యమంత్రితోపాటు పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మఠాధిపతులు పాల్గొంటారు. వానమామలై మఠం 31వ పీఠాధిపతులు రామానుజ జీయర్ స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో కార్యక్రమాలు జరగనున్నాయి.
నేడు యాదగిరిగుట్ట స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ
పవిత్ర నదీ జలాలతో మహాకుంభాభిషేకం
ఉ.11.54 గంటలకు మూలా నక్షత్రం వృషభ లగ్నం ముహూర్తాన బంగారు విమాన గోపురం ఆవిష్కరణ
స్వర్ణ విమాన గోపురం ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొననున్న సీఎం రేవంత్ రెడ్డి
సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా… pic.twitter.com/vnc9Ag2WFV
— BIG TV Breaking News (@bigtvtelugu) February 23, 2025
50.5 అడుగుల ఎత్తు.. 68 కిలోల బంగారం
స్వర్ణ విమాన గోపురం ఎత్తు 50.5 అడుగులు ఉంటుంది. విమానగోపుర వైశాల్యం 10,759 చదరపు అడుగులు. గోపురం మొత్తానికి స్వర్ణతాపడం చేసేందుకు 68 కిలోల బంగారాన్ని వినియోగించారు. చెన్నైకి చెందిన మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ ఈ పనులు నిర్వహించింది. బంగారం తాపడం చేసేందుకు మొత్తం రూ.3.90 కోట్లు ఖర్చు చేశారు. తాపడం అమర్చే పనులకు మొత్తం 68కిలోల బంగారం, గోల్డ్ ఫ్లేటింగ్ తయారీ, అమరికకు రూ.8కోట్లు వరకు వెచ్చించారు.
కేసీఆర్ పిలుపు.. రూ.25 కోట్ల విరాళాలు
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ప్రభుత్వం దాదాపు రూ.1280కోట్లతో యాదగిరి గుట్ట ఆలయాన్ని పునర్నిర్మించింది. ప్రధాన ఆలయ విమాన గోపురానికి బంగారు తాపడం చేయిస్తామని 2021 అక్టోబరు 19న కేసీఆర్ ప్రకటించారు. ఇందుకు సుమారు 125కిలోల బంగారం అవసరమని, రూ.65కోట్ల మేర ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో భాగం కావాలని పిలుపునిచ్చిన కేసీఆర్.. తమ కుటుంబం తరఫున స్వామివారికి 1కిలో 16తులాల బంగారాన్ని సమర్పించారు. వివిధ వర్గాల నుంచి స్వర్ణతాపడం పనులకు రూ.25 కోట్ల మేర విరాళాలు అందాయి. అలాగే, 10 కిలోల 577.390గ్రా ముల బంగారాన్ని కూడా భక్తులు అందజేశారు.
ఎంతో విశేషం
స్వర్ణ విమాన గోపురం వంటి అత్యంత ఎత్తయిన గోపురం ఒక్క యాదగిరిగుట్టలో తప్ప మరెక్కడా లేదు. దేశంలోనే అత్యంత ఎత్తయిన మొట్టమొదటి స్వర్ణ విమాన గోపురంగా ఇది రికార్డుకెక్కడం గమనార్హం. స్వర్ణ విమాన గోపురం పనులు 2024లో ప్రారంభించారు. మహా సంప్రోక్షణకు 40 జీవనదుల జలాలు సేకరించారు.
స్వర్ణ విమాన గోపురం విశేషాలివే..
- స్వర్ణ విమాన గోపురం ఎత్తు: 50.5 అడుగులు
- స్వర్ణ విమాన గోపురానికి ఉపయోగించిన బంగారం మొత్తం : 68 కిలోలు
- బంగారు విమాన గోపురం వైశాల్యం: 10,759 చదరపు అడుగులు
- తాపడం పనులు ప్రారంభించిన తేదీ: 1 డిసెంబరు 2024
- తాపడం కవచాల బిగింపు పనుల పూర్తి: 18 ఫిబ్రవరి 2025
- బంగారు తాపడం బిగింపు ఖర్చు: రూ.5.10 కోట్లు (జీఎస్టీ కాకుండా)
- రాగిరేకుల తయారీ ఖర్చు: రూ.12 లక్షలు
- పనిచేసిన కార్మికులు: 50 మంది
- పనులు చేసిన సంస్థ: నవయుగ మెటల్స్
- స్వర్ణ విమాన గోపురం పనులు చేసిన సంస్థ: మెసర్స్ స్మార్ట్ క్రియేషన్స్ సంస్థ, చెన్నై