Anganwadis Protest (photo-Video Grab)

Vjy, Jan 23: ఏపీ ప్రభుత్వంతో చర్చలు సఫలం అయ్యాయని, సమ్మె విరమిస్తున్నట్లు ఏపీ అంగన్‌వాడీలు (Anganwadi Workers) ప్రకటించారు. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని అంగన్‌వాడీల ప్రతినిధులు పేర్కొన్నారు. జులైలో వేతనాలు పెంచుతామని ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిందని, మంగళవారం(ఈరోజు) నుంచి విధుల్లోకి వెళ్తామని వారు పేర్కొన్నారు. ఈ నెల 24న ఏపీ బంద్‌కు అంగన్‌వాడీలు పిలుపునిచ్చిన సంగతి విదితమే.

విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఐసీడీఎస్‌ అధికారుల సమక్షంలో అంగన్‌వాడీల డిమాండ్లపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా సచివాలయంలో మంత్రి బొత్స మీడియాతో మాట్లాడుతూ.. అంగన్‌వాడీల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా వ్యవహరిస్తోందన్నారు.

వీడియో ఇదిగో, పోలీసులపై తిరగబడిన అంగన్వాడీలు, అదుపులోకి తీసుకుంటుండగా మహిళా కానిస్టేబుళ్ల పై దాడి

సమ్మెలో భాగంగా అంగన్‌వాడీలు పెట్టిన 11 డిమాండ్లలో 10 అంగీకరించడంతో పాటు, చాలా వాటిని అమలు చేసేందుకు కార్యాచరణ చేపట్టామని చెప్పారు. ముఖ్యమైన వేతనాల పెంపుపై ఇటు ప్రభుత్వం.. అటు అంగన్‌వాడీ యూనియన్లు పరస్పర అంగీకారంతో నిర్ణయం తీసుకున్నామన్నారు. దీనిని జూలై నుంచి అమలు చేసే దిశగా పని చేస్తున్నామని తెలిపారు. అంగన్‌వాడీల శ్రేయస్సు, సంక్షేమం దృష్ట్యా రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ను వర్కర్లకు రూ.50 వేల నుంచి ఏకంగా రూ.1.20 లక్షలకు, హెల్పర్లకు రూ.20 వేల నుంచి రూ.60 వేలకు పెంచుతున్నామని తెలిపారు.

అంగన్వాడీలపై ఏపీ ప్రభుత్వం సీరియస్, విధుల్లో చేరని వారిని తొలగించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు, జగన్ సర్కారుపై విమర్శలు ఎక్కుపెట్టిన ప్రతిపక్షాలు

అందరి ఉద్యోగుల మాదిరిగానే పదవీ విరమణ వయసు 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు.. ప్రమోషన్ల కోసం వయో పరిమితి 45 ఏళ్ల నుంచి 50 ఏళ్లకు పెంచుతున్నాం. కేంద్ర నిబంధనల ప్రకారం మినీ అంగన్‌వాడీల అప్‌గ్రేడ్‌ చేస్తాం. అంగన్‌వాడీల్లో పని చేస్తూ చనిపోయిన వారికి మట్టి ఖర్చుల కింద రూ.20 వేలు ఇవ్వాలని నిర్ణయించాం. కేంద్ర ప్రభుత్వ దృష్టికి గ్రాట్యుటీ అంశం తీసుకెళ్లి.. వారిచ్చేది నేరుగా అమలు చేస్తాం. భవిష్యత్తులో అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కమిటీ నియమిస్తామని తెలిపారు.