Sathya Sai, June 14: APలో ఏరువాకతో సాగుకు సన్నద్ధమవుతున్న అన్నదాతకు అండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మరోసారి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పరిహారాన్ని (YSR Crop Insurance Scheme) అందించారు. 2021 ఖరీఫ్‌లో వైపరీత్యాలు, చీడపీడల వల్ల పంట నష్టపోయిన చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 15.61 లక్షల మంది రైతన్నలకు రూ.2,977.82 కోట్ల బీమా పరిహారాన్ని మంగళవారం వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నే కొత్తపల్లిలో జరిగిన కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్ (CM YS Jagan) బటన్ నొక్కి రైతన్నల ఖాతాల్లో నగదు జమ చేశారు.
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమం (Uchitha Pantala Bheema Scheme ) జరుగుతోందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. టెన్త్‌లో 67 శాతం మంది విద్యార్థులు పాస్ అయ్యారు. గుజరాత్‌లో 65 శాతమే పాస్ అయ్యారు. ఇలాంటి సమయంలో విద్యార్థుల్లో ఆత్మస్థైర్యం నింపేలా మాట్లాడాలి. టెన్త్ విద్యార్థులను సైతం రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. నెల రోజుల్లో సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. సప్లిమెంటరీలో పాస్ అయిన రెగ్యులర్‌గానే పరిగణిస్తామని సీఎం జగన్ అన్నారు.చంద్రబాబు తానా అంటే దత్తపుత్రుడు తందాన అంటాడు.ఈనాడు, చంద్రబాబు, టీవీ5, చంద్రబాబు, దత్తపుత్రుడు ఏకమై ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చేస్తారు. మోసం చేయడంలో చంద్రబాబు, దత్తపుత్రుడు తోడు దొంగలు. వీరిద్దరూ రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా? అంటూ సీఎం జగన్ ప్రశ్నించారు.
ఎవరైనా రైతన్న చనిపోతే ఆదుకుంటున్నాం. పరిహారం అందని ఒక్క కౌలు రైతునైనా చంద్రబాబు, దత్తపుత్రుడు చూపించలేకపోయారు. నేను సవాల్ చేసిన.. చంద్రబాబు ఆయన దత్తపుత్రుడు స్పందించలేదు. బాబు అధికారంలో ఉన్నప్పుడు దత్తపుత్రుడికి గుర్తురాలేదు, ఇవ్వాలనే తపన చంద్రబాబుకు లేదు. దేశం యావత్తు ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. ఆర్బీకేలు రైతన్నను పట్టుకొని నడిపిస్తున్నాయి. మూడేళ్లలో రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ. 25,800 కోట్లు ఖర్చు పెట్టాం. గత ప్రభుత్వం రూ.8750 కోట్లు పెట్టిన ఉచిత విద్యుత్ బకాయిలను తీర్చాం. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశాం. పంటల బీమా పథకంపై దృష్టి పెట్టి విప్లవాత్మక మార్పులు తెచ్చామని సీఎం జగన్ అన్నారు.
రైతన్నలకు మేలు చేసే విషయంలో దేశంతో పోటీ పడుతున్నాం. మన రాష్ట్రంలో జరగుతున్న మార్పులను పక్క రాష్ట్రాలు వచ్చి చూస్తున్నాయి. రైతు భరోసా కింద రూ.23,875 కోట్లు చెల్లించాం. రైతన్నల కోసం మూడేళ్లలో రూ.1,27,823 కోట్లు ఖర్చు చేశాం. గత ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.3,411 కోట్ల పంట బీమా మాత్రమే ఇచ్చారు. మన ప్రభుత్వ మూడేళ్ల హయాంలో మూడేళ్లలోనే రూ.6,685 కోట్ల బీమా చెల్లించాం. రైతులను చంద్రబాబు ప్రభుత్వం ఏనాడు పట్టించుకోలేదు. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను కూడా మనమే తీర్చాం. ఏ సీజన్‌లో జరిగిన నష్టాన్ని ఆ సీజన్ ముగిసేలోగానే ఇన్‌పుట్ సబ్సిడీ అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు.
గత ప్రభుత్వానికి - మన ప్రభుత్వానికి తేడా గమనించండి. ఇంతకుముందు ఇన్సూరెన్స్ ఎప్పుడు వస్తుందో, ఎవరికి వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. కానీ ఇప్పుడు బటన్ నొక్కగానే లబ్దిదారుల ఖాతాల్లో బీమా సొమ్ము జమ అవుతోంది. ఈ మార్పును గమనించాలని కోరుతున్నా.మన ప్రభుత్వంలో పారదర్శకంగా అర్హులైన ప్రతి రైతు కుటుంబానికి మంచి జరుగుతోంది. మనిషికి బీమా ఉన్నట్లే పంటకు బీమా ఉండకపోతే రైతు పరిస్థితి ఏంత దయనీయంగా ఉంటుందో గత ప్రభుత్వ హయాంలో చూశామని సీఎం జగన్ అన్నారు.