TadePalli, August 9: 2023 ఏప్రిల్ – జూన్ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన జంటలకు వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫా అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి బుధవారం శ్రీకారం చుట్టారు. ఇందుకు అర్హులైన 18,883 జంటలకు రూ. 141.60 కోట్ల ఆర్థిక సాయాన్ని తన క్యాంపు కార్యాలయం నుంచి సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి వధువుల తల్లుల ఖాతాల్లో జమ చేశారు.
ఈసందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమానికి ఇక్కడ నుంచే శ్రీకారం చుడుతున్నామన్నారు. వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్ షాదీతోఫా అనే ఈ రెండు చదువులను మరింత ప్రోత్సహిస్తూ.. ఆడిపిల్లలు గొప్పగా చదివేటట్టు ప్రోత్సహిస్తూ.. ఆ కుటుంబాలకు ఆర్ధికంగా అండగా నిలిచే మంచి కార్యక్రమాలని పేర్కొన్నారు.
‘ఈ రోజు పేద తల్లిదండ్రులందరూ తమ పిల్లలను గొప్పగా చదివించి, వారి పెళ్లి కూడా గౌరవప్రదంగా అప్పులు పాలవ్వకుండా బాగా చేయాలని కోరుకుంటారు. అలా జరగాలని ఆశిస్తారు. అలా పేదరికంలో ఉన్న నా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, నా దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసమే ఈ పథకం. వారి జీవితాల్లో వెలుగులు నింపాలని, అప్పులు పాలయ్యే పరిస్థితి లేకుండా, రాకుండా పెళ్లిళ్లు జరిగే పరిస్థితి రావాలని ఆ పిల్లలు బాగా చదివి ప్రతి ఒక్కరూ డిగ్రీవరకు వెళ్లే పరిస్థితి రావాలన్న తలంపుతో ఈ కార్యక్రమం చేస్తున్నాం.
సీఎం జగన్‌ను కలిసిన టీటీడీ నూతన ఛైర్మెన్ భూమన కరుణాకర్ రెడ్డి, వీడియో ఇదిగో
18,883 జంటలకు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం.
ఈ ఏడాది ఏఫ్రిల్, మే, జూన్ ఈ మూడు నెలలకు సంబంధించి పెళ్లిళ్లు అయిన వారితో పాటు 2023 జనవరి నుంచి మార్చి వరకు వివాహాలు అయి వారిలో కూడా ఏ కారణంగానైనా సర్టిఫికెట్ సకాలంలో సమర్పించలేకపోవడం, అధికారులు తనిఖీకు వచ్చినప్పుడు ఆ సమయంలో లేకపోవడం వంటి రకరకాల కారణాలతో.. ఆ పీరియడ్‌లో రానివారుంటే, అలా మిగిలిపోయిన వారిని కూడా ఇందులో కలిపి ఇవాళ ఈ సహాయం చేస్తున్నాం. మొత్తంగా 18,883 జంటలకు సంబంధించి ఈ రోజు రూ.141 కోట్ల ఆర్ధిక సహాయం తల్లుల ఖాతాల్లోకి జమ చేస్తున్నాం.
గతేడాది అక్టోబరు నుంచి ఈ యేడాది మార్చి వరకు రెండు విడతల్లో ఈ పథకాన్ని అమలు చేసాం. ఇవాళ మూడో విడత ఇస్తున్నాం. ఇవాళ ఇస్తున్నదానితో కలిపి.. ఈ మూడు విడతల్లో రూ.267 కోట్లు .... పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ ఈ కార్యక్రమాన్ని అమలు చేశాం. ఈ కార్యక్రమంలో ఇప్పటికే 35,551 జంటలకు మేలు జరుగుతుంది. ప్రతి ఏడాది మూడునెలలకొకమారు చొప్పున నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుంది. ఒక నెలపాటు వెరిఫికేషన్ పూర్తి చేసి, మూడు నెలలకు సంబంధించిన ఆర్ధిక సహాయం అందజేస్తారు.
ఇవాళ ఇచ్చే 18,883 మంది పిల్లలకు సంబంధించిన విషయాలను గమనిస్తే... కొన్ని మనసుకు సంతోషాన్నిచ్చే విషయాలు కనిపిస్తాయి. ఇందులో 18 నుంచి 21 సంవత్సరాల వయస్సులో ఉన్న అమ్మాయిల వివరాల లెక్క చూస్తే.. 8,524 మంది చెల్లెమ్మలు ఉన్నారు. ఇందులో అమ్మఒడి, విద్యాదీవెన, వసతి దీవెన వీటన్నింటి వల్లా లబ్ధి పొంది డిగ్రీ కూడా చదివిన, చదువుతున్న వారు 7,344 మంది ఉన్నారు. అంటే 8,524 మంది చెల్లెమ్మల్లో డిగ్రీ, ఇంజనీరింగ్ వంటి కోర్సులును 86 శాతం మంది చదువుతున్నారు. పదోతరగతి నుంచి ఇంటర్ వరకు అమ్మఒడి, ఆ తర్వాత డిగ్రీలో విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా మేలు పొందారు.
అంటే పెళ్లిళ్లు చేసుకోవాలన్న ఆలోచన పక్కనపెట్టి, చదువు మీద ధ్యాసపెట్టి డిగ్రీలు పూర్తి చేసుకుని, చదువులు పూర్తి చేసుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. 86 శాతం మంది ఉన్నారు. నిజంగా మనం అనుకున్న లక్ష్యం, ఏం సాధించాలని మనం తాపత్రయపడ్డామో అది ఈ లెక్కలు చూసినప్పుడు మనకు అర్ధం అవుతుంది. ఇది చాలా సంతోషాన్నిచ్చే అంశం. ఈ మంచి కార్యక్రమం ఇంకా బాగా జరగాలి. ఎక్కువందికి మేలు జరిగే పరిస్థితి రావాలి, ప్రతి చెల్లెమ్మ డిగ్రీవరకు కనీస చదువు ఉండాలి అన్నదే మన తపన.
ఇంటి ఇళ్లాలు ఎప్పుడైతే డిగ్రీవరకు చదువుతున్న పరిస్థితి ఉంటుందో.. తర్వాత తరంలో తమ పిల్లలను ఇంకా ఉన్నత విద్యలవైపు నడిపించే పరిస్థితి ఉంటుంది. మనం పెడుతున్న ఈ నమ్మకం వల్ల... పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలి. ప్రతి ఒక్కరికీ కనీసం డిగ్రీవరకు చదివి.. ఆ సర్టిఫికేట్ చేతిలో ఉండే పరిస్థితి రావాలి. అవి కూడా మంచి డిగ్రీలు అయి ఉండాలి. భవిష్యత్‌లో వారి జీవితాలు...పేదరికం నుంచి బయటకు రావాలంటే చదువు అనే బ్రహ్మాస్త్రం ఉండాలని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది.
ఈ పథకం గత ప్రభుత్వంలో ఎలా ఉండేది ? మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన మార్పులు తీసుకొచ్చింది ? అన్నది ఆలోచన చేస్తే... గత ప్రభుత్వంలో చేశామంటే చేశామన్నట్టు మొక్కుబడిగా చేశారే తప్ప... చిత్తశుద్ధిగా చేయలేదు. పేదల బ్రతుకులు మారాలి. వారికి మంచి జరగాలన్న ఆలోచన ఏ రోజూ జరగలేదు. ఆ రోజు 2018లోనే 17,709 మందికి దాదాపు రూ.68.68 కోట్లు డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఆ రోజుల్లో కేవలం ఎన్నికలే లక్ష్యంగా పథకాలు తెచ్చారు.
కానీ ఈ రోజు అలా చేయకుండా.. పదోతరగతి పాస్ అయి ఉండాలన్న నిబంధనను తీసుకొస్తున్నాం. పదోతరగతిపాస్ అయ్యేలా తల్లిదండ్రులు ప్రోత్సహించేటట్టు అడుగులు వేస్తున్నాం. నా చెల్లెమ్మలకు 18, తమ్ముళ్లకు 21 సంవత్సరాల వయసు ఉండాలనే నిబంధన తీసుకొచ్చాం. దీనివల్ల చెల్లెమ్మలు పదోతరగతి వరకు కచ్చితంగా చదువుతారు. ఆ తర్వాత 18 సంవత్సరాల వరకు ఎలాగూ ఆగాలి, అమ్మఒడి అనే పథకం అందుబాటులో ఉంది కాబట్టి.. చదువు కొనసాగిస్తూ ఇంటర్ మీడియట్‌కు వెళ్తారు.
తద్వారా ఇంటర్‌లో కూడా అమ్మఒడి డబ్బులు వస్తాయన్నది ఒక ప్రోత్సాహం కాగా.. ఇంటర్ పూర్తి చేస్తారన్నది రెండో అంశం. దానితర్వాత పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్ - విద్యాదీవెన, వసతి దీవెన అనే రెండు పథకాలతోనూ డిగ్రీ, ఇంజనీరింగ్, డాక్టర్ వంటి పెద్ద పెద్ద చదువులున్నీ రూపాయి ఖర్చు లేకుండా.. పూర్తిగా ప్రభుత్వం భరిస్తూ తోడుగా నిలబడుతుంది.
అంతే కాకుండా పిల్లల చదువులను ప్రోత్సహిస్తూ.. ప్రతి పాప, పిల్లవాడికి కూడా డిగ్రీలో చేరితే చాలు... వసతి దీవెన అనేపథకం ద్వారా రూ.20 వేలు వాళ్ల బోర్డింగ్, లాడ్జింగ్ ఖర్చుల కోసం రెండు దఫాల్లో పిల్లల తల్లుల ఖాతాల్లో వేస్తున్నాం. ఇది మరో ప్రోత్సాహకరమైన కార్యక్రమం. ఒక్కో అమ్మాయి, పిల్లవాడి మీద వాళ్ల డిగ్రీలు పూర్తి చేసేందుకు సంవత్సరానికి మరో రూ.60వేలు ఒక్కొక్కరికి ఇచ్చినట్టవుతుంది. అప్పటికి ఆడపిల్లలకు 18 సంవత్సరాలు, అబ్బాయిలకు 21 సంవత్సరాలు నిండుతాయి.
ఆ తర్వాత పెళ్లిళ్లు చేసినట్లయితే... మైనార్టీలకు గతంలో రూ.50వేలు మాత్రమే ప్రోత్సహకంగా ఇస్తామని ప్రకటించి, ఇవ్వకుండా ఎగరగొట్టిన పరిస్థితుల నుంచి ఇప్పుడు షాదీతోఫా కింద ఏకంగా రూ.1లక్ష ఇచ్చి పెళ్లికి తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతుంది. వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.1లక్ష ఇస్తామని ప్రకటించి ఎగ్గొట్టారు .ఇప్పుడు మనం వారికి ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. భవన నిర్మాణకార్మికులు గత ప్రభుత్వంలో రూ.20వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే... మనం ఈరోజు రూ.40వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.
ఎస్సీలకు గతంలో రూ.40 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేస్తే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం. ఎస్టీలకైతే గతంలో రూ.50వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మన ప్రభుత్వంలో రూ.1లక్ష ఇచ్చి ప్రోత్సహిస్తున్నాం.ఇక బీసీలకైతే గతంలో రూ.30 వేలు ఇస్తామని ఎగ్గొడితే.. మనం ఏకంగా రూ.50వేలు ఇచ్చి వాళ్లను కూడా ప్రోత్సహించి నడిపించే కార్యక్రమం చేస్తున్నాం. కులాంతర వివాహాలకు అయితే ఇంకా ఎక్కువ ఇచ్చి మనసు పెట్టి ప్రోత్సాహిస్తున్నాం.
ఇవన్నీ కూడా ప్రతి అడుగులోనూ మనసుపెట్టి ప్రతి పాప, పిల్లవాడు పేదరికం నుంచి బయటపడాలంటే కచ్చింగా చదువు ఒక్కటే మార్గమని... ఆ చదువుకునేదానికి ఏ పేదవాడు అప్పులు పాలయ్యే పరిస్థితి రాకూడదని ప్రతి ఒక్కరినీ చదవించే కార్యక్రమం చేస్తున్నాం. ఇందులో భాగంగా ఏ ఒక్కరూ మిగిలిపోకూడదన్న తపన, తాపత్రయంతో అడుగులు వేస్తున్నాం.ఒకవేళ పొరపాటున ఎవరైనా, ఎక్కడైనా మిగిలిపోతే... వారిని కచ్చితంగా మరలా మూడు నెలలకిచ్చే కార్యక్రమంలో భాగంగా వాళ్ల దగ్గర నుంచి లోపాలను సరిదిద్ది.. తర్వాత దఫాలో వారిని యాడ్ చేయించే కార్యక్రమం చేస్తున్నాం.
దూదేకుల, నూర్ భాషాలకు సంబంధించిన మైనార్టీ సోదరులకు రూ.50వేలు వస్తుందని చెపితే.. వాళ్లు కూడా మైనార్టీలే కదా అని... దాన్ని కూడా సానుకూలంగా పరిగణలోకి తీసుకుని వాళ్లకు కూడా రూ.1లక్ష పెంచే కార్యక్రమం చేశాం. గతంలో రూ.1లక్ష రాని 227 జంటలకు అది కూడా ఇస్తున్నాం. ప్రతి అడుగులోనూ మానవత్వం ప్రదర్శించాం. అర్హులెవరూ మిస్ కాకూడదు, నష్టపోకూడదనే తపన, తాపత్రయం ప్రతి అడుగులోనూ మన ప్రభుత్వంలో కనిపిస్తుంది.
ఇవన్నీ కూడా నా పిల్లలందరూ బాగా చదవాలని, గొప్పగా చదివి, పేదిరికం నుంచి బయటకు రావాలని చేస్తున్నాం.
ఈ పథకం ద్వారా మంచి జరగాలని మనసారా ఆకాంక్షిస్తూ... దేవుడు ఇంకా మంచి చేసే అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ.. ఈ పథకం ద్వారా లబ్దిపొందుతున్న ప్రతి చెల్లెమ్మకూ, తమ్ముడుకూ, వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ఈ కార్యక్రమంలో బాలికా విద్యను ప్రోత్సహించేందుకు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత.. ప్రతిమండలంలో ఒక హైస్కూల్‌ను ప్రత్యేకంగా బాలికల జూనియర్ కాలేజీగా మార్పు చేసి తీసుకొచ్చాం. ప్రతి మండలంలోనూ రెండు జూనియర్ కాలేజీలు ఉండేటట్టుగా.. అడుగులు వేగంగా వేస్తున్నాం. ఇందులో ఒకటి కో ఎడ్యుకేషన్ కాలేజీ కాగా, మరొకటి ప్రత్యేక బాలికల జూనియర్ కళాశాల. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు ఈ రకమైన ఏర్పాటు చేస్తున్నాం.
అదే విధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కోసం కూడా ఎక్కడకో వెళ్లి చాలా కష్టపడాల్సిన పరిస్థితి నుంచి.. కేవలం గ్రామ సచివాలయంలో దరఖాస్తు పెడితే 30 రోజులలోగా వెరిఫికేషన్ చేసి అక్కడే మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చే గొప్ప మార్పు చేయగలిగాం. మీరు కూడా ఇంకా ఓరియెంటేషన్ చేయడానికి చొరవ తీసుకుంటే మరిన్ని మంచి ఫలితాలు వస్తాయి అని సీఎం ప్రసంగం ముగించారు.