CM-YS-jagan-Review-Meeting

VJY, Jan 2: తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం గృహ నిర్మాణ శాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్‌ ప్రగతిని అధికారులు వివరించారు. ఇళ్ల నిర్మాణం వేగంగా సాగుతోందని తెలిపారు. టిడ్కో కాకుండా ఈ ఆర్థిక సంవత్సరంలో ఇళ్ల నిర్మాణంకోసం రూ.6,435 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఖర్చు చేసిందని అధికారులు పేర్కొన్నారు.

గుంటూరు తొక్కిసలాట ఘటన, మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించిన చంద్రబాబు, ప్రభుత్వం తరపున రూ. 2 లక్షలు ప్రకటించిన సీఎం జగన్

క్రమం తప్పకుండా ఆయా లే అవుట్లకు వెళ్లి ఇళ్ల నిర్మాణ ప్రగతిని పరిశీలిస్తున్నామని, డిసెంబర్‌ నెలలో 4 సార్లు లే అవుట్లను పరిశీలించామని అధికారులు వెల్లడించారు. సీఎం ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొత్తం నాలుగు రకాల పరీక్షలు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

అన్ని లే అవుట్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తున్నామని, దీనికి అవసరమైన ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ఏమన్నారంటే...:

♦ ఇళ్లు పూర్తయ్యే నాటికి కరెంటు, నీళ్లు, డ్రైనేజీ ఈ మూడు సౌకర్యాలు కచ్చితంగా కల్పించాలి.

♦ అలాగే ఇళ్ల లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు మాట్లాడి నిర్ణీత దశకు రాగానే వాటికి కరెంటు కనెక్షన్లు ఇవ్వాలి.

♦ వివిధ కోర్టు వివాదాల వల్ల ఇళ్ల నిర్మాణం నిలిచిపోయిన చోట్ల ప్రత్యామ్నాయాలను వెంటనే చూడాలని సీఎం ఆదేశం

♦ కోర్టు కేసులు పరిష్కారం కాని చోట వెంటనే ప్రత్యామ్నాయ స్థలాలు చూసి ఇళ్లనిర్మాణాలు ప్రారంభించాలని సీఎం ఆదేశం

చెడిపోయిన వ్యవస్థతో యుద్ధం చేస్తున్నాం, దత్తతండ్రిని దత్తపుత్రుడు నెత్తిన పెట్టుకుని ఊరేగుతున్నాడు, నర్సీపట్నం సభలో మండిపడిన సీఎం జగన్

ఈ సమీక్షా సమావేశంలో గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ఏపీ హౌసింగ్‌ కార్పోరేషన్‌ ఛైర్మన్‌ దవులూరి దొరబాబు, టిడ్కో ఛైర్మన్‌ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్‌ డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ సీఎస్‌ జి సాయి ప్రసాద్, ఇంధనశాఖ స్పెషల్‌ సీఎస్‌ కె. విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, సీసీఎల్‌ఏ కార్యదర్శి ఇంతియాజ్, ఏపీ స్టేట్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ ఎండీ జి లక్ష్మీ షా, గృహనిర్మాణశాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్‌ దీవాన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు