CM Jagan Mohan Reddy

అన్నమయ్య జిల్లా కలికిరి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఎన్నికల ప్రచార సభలో సీఎం జగన్ ప్రతిపక్షాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మళ్లీ ఈ ముగ్గురూ కలిసి ప్రజలను మోసం చేసేందుకు మేనిఫెస్టోతో వచ్చారని విమర్శించారు. టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా విడుదల చేసిన మేనిఫెస్టోపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హామీలన్నీ మోసమేనని బీజేపీ వైఖరితో అర్థమైందన్నారు. టీడీపీ, జనసేన మేనిఫెస్టోలో తమ ఫోటో వద్దని బీజేపీ గట్టిగా చెప్పిందని పేర్కొన్నారు. బాబు డిక్లేర్ చేసిన మేనిఫెస్టోలో మోదీ ఫోటో పెట్టొద్దని బీజేపీ తేల్చేసిందన్నారు. ముగ్గురు కూటమిలో ఉండి ముగ్గురు ఫోటోలను మేనిఫెస్టోలో పెట్టుకునే పరిస్థితి చంద్రబాబుకు లేదని ఎద్దేవా చేశారు.  ఏపీలో టీడీపీ కూటమి మ్యానిఫెస్టో ఇదిగో, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, మెగా డీఎస్సీ మీద తొలి సంతకం

అవ్వాతాతలకు ఇంటివద్దకే అందే పెన్షన్‌ను ఆపిన దుర్మార్గుడు చంద్రబాబని ధ్వజమెత్తారు. మీ బిడ్డకు(జగన్‌) మంచి పేరు వస్తుందనే బాబు పెన్షన్లను అడ్డుకున్నాడని మండిపడ్డారు. తన మనిషిని నిమ్మగడ్డతో ఫిర్యాదు చేయించి పనెన్షన్‌ను అడ్డుకున్నాడని.. ప్రజల్లో వ్యతిరేకత రావడంతో తన కుట్రలను మనపై నెడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మేనిఫెస్టో పేరుతో మళ్లీ అబద్ధాలకు రెక్కలు కడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇవాళ సాధ్యం కాని హామీలు, సాధ్యం కాని మాటలతో సూపర్ సిక్స్ అంటున్నారు, సూపర్ సెవెన్ అంటున్నారు... మీరు నమ్ముతారా? ప్రతి ఇంటికీ కేజీ బంగారం ఇస్తామంటున్నారు... నమ్ముతారా? ప్రతి ఇంటికీ బెంజి కారు కొనిస్తామంటున్నారు... నమ్ముతారా? అని ప్రజలను ప్రశ్నించారు.  తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు, మే 13న పోలింగ్, జూన్ 4న ఓట్ల లెక్కింపు

"చంద్రబాబు విశ్వసనీయత, ఆయన సాధ్యం కాని హామీలు ఏ విధంగా ఉంటాయో అందరికీ తెలుసు. 2014లో ఇదే చంద్రబాబు, ఆయన పక్కన మోదీ, ఆయన పక్కన దత్తపుత్రుడు ఫొటోలు పెట్టుకుని, సంతకం పెట్టి ప్రతి ఇంటికీ పంపించిన ఈ కరపత్రంలో కనీసం ఒక్కటంటే ఒక్కటైనా హామీ నెరవేర్చారా?

ఇవాళ చంద్రబాబు మేనిఫెస్టో డిక్లేర్ చేస్తే ఏం జరిగిందో తెలుసా...! పై నుంచి బీజేపీ వాళ్లు ఫోన్ చేసి... అయ్యా నీ ఫొటోనే పెట్టుకో, మోదీ ఫొటో మాత్రం మేనిఫెస్టోపై పెట్టొద్దంటే పెట్టొద్దు... మేం ఒప్పుకోం అని అన్నారు. ఈయన సాధ్యం కాని హామీలు మోసపూరితం అని వాళ్లకు కూడా అర్థమైంది. చంద్రబాబు ఇవాళ మేనిఫెస్టోపై ముగ్గురి ఫొటోలు పెట్టుకోలేదు. ప్రజలను మోసం చేయడానికి చంద్రబాబు ఏ విధంగా బరితెగించాడో అర్థమవుతోంది" అంటూ సీఎం జగన్ ధ్వజమెత్తారు.