Vjy, May 17: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న హింసాత్మక ఘటనలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక అందచేశారు. పోలింగ్ రోజు, ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అల్లర్లు జరగడానికి కారణాలను ఈ నివేదికలో నివేదించారు. ఈసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వచ్చిన వారిద్దరూ గురువారం మధ్యాహ్నం 3.30 గంటలకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్(సీఈసీ) రాజీవ్‌కుమార్, కమిషనర్లు జ్ఞానేష్ కుమార్, సుఖ్‌బీర్‌సింగ్ సంధూలతో సమావేశమయ్యారు. దాదాపు 30 నిమిషాల పాటు జరిగిన ఈ సమావేశంలో అల్లర్లకు కారణాలను విశ్లేషించారు.
సమస్యాత్మక ప్రాంతాలైన పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రిని దృష్టిలో ఉంచుకుని ముందుగానే భారీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీఎస్ జవహర్‌రెడ్డి ఈసీకి తెలిపారు. హఠాత్తుగా పోలీసు అధికారులను బదిలీ చేయడం, కొత్తగా బాధ్యతలు స్వీకరించిన వారికి క్షేత్రస్థాయి పరిస్థితులపై పూర్తి అవగాహన లేకపోవడం వల్ల అల్లర్లకు దారి తీసిందని తాము గుర్తించినట్లు పేర్కొన్నారు. వీడియోలు ఇవిగో, తాడిపత్రిలో ఎమ్మెల్యే ఇంట్లో పోలీసులు ఓవర్ యాక్షన్, సీసీటీవీ కెమెరాలు పగలగొట్టి విచక్షణా రహితంగా దాడి
పోలింగ్ రోజు, మరుసటి రోజు పల్నాడు, కారంపూడి, మాచవరం, తాడిపత్రి, తిరుపతి, చంద్రగిరి, అనంతపురం, కృష్ణా జిల్లా, నర్సీపట్నం తదితర చోట్ల హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నట్లు చెప్పారు. ఎస్పీ స్థాయి అధికారి నుంచి ఎస్‌ఐ వరకు హఠాత్తుగా బదిలీలు చేయడంతో ఇదే అదునుగా అల్లర్లకు పాల్పడినట్లు వివరించారు. అల్లర్లు జరిగిన ప్రాంతాలన్నింటిలోనూ పోలీసు అధికారుల ఆకస్మిక బదిలీలే హింసకు కారణమని పేర్కొన్నట్లు సమాచారం.
రాష్ట్రంలో పోలింగ్ రోజు, ఆ తర్వాత పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాల్లో చోటుచేసుకున్న హింసాకాండకు ఆ మూడు జిల్లాల ఎస్పీలతో పాటు, పల్నాడు జిల్లా కలెక్టర్ వైఫల్యమే కారణమని కేఎస్ జవహర్‌రెడ్డి నివేదికలో తెలిపారు. వారిలో పల్నాడు ఎస్పీ బిందుమాధవ్, అనంతపురం ఎస్పీ అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయాలని, పల్నాడు కలెక్టర్ లోతేటి శివశంకర్, తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌లను బదిలీ చేయాలని, ఈ నలుగురిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేశారు. వీడియో ఇదిగో, తాడిపత్రిలో టీడీపీ - వైసీపీ కార్యకర్తల మధ్య రాళ్ల దాడి, చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు
పల్నాడు జిల్లాలో పోలింగ్ రోజున, అనంతరం హింసాకాండ చెలరేగింది. 15 ఈవీఎంలను ధ్వంసం చేశారు. జిల్లాలో పెద్ద సంఖ్యలో పోలీసుల్ని, భద్రతా సిబ్బందిని మోహరించినా ఆ ఘటనలు జరిగాయి. జిల్లా ఎస్పీ బిందుమాధవ్ నేతృత్వంలోని పోలీసు యంత్రాంగం వైఫల్యం అడుగడుగునా కనిపిస్తోంది. ఎస్పీ విధి నిర్వహణలో వృత్తిపరమైన నిబద్ధత కనబరచలేదు. క్షేత్రస్థాయి సిబ్బందికి ఆదేశాలు జారీచేయడంలో, సమాచారాన్ని పైఅధికారుల దృష్టికి తేవడంలో విఫలమయ్యారు. ఆయనను సస్పెండ్ చేసి, కఠినమైన క్రమశిక్షణ చర్యలు చేపట్టాలి.
పల్నాడు జిల్లా కలెక్టర్ లోతేటి శివశంకర్ పోలీసులు, ఇతర భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుని హింసను నివారించడంలో విఫలమయ్యారు. విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత కనబరచలేదు. ఎన్నికల ప్రక్రియ ఇంకా మిగిలి ఉన్నందున, ఆయనను కలెక్టర్‌గా కొనసాగించడం సరికాదు. శివశంకర్‌ను బదిలీ చేసి, క్రమశిక్షణ చర్యలు చేపట్టాలని నివేదికలో తెలిపారు.
రాష్ట్ర డీజీపీ హరీశ్‌కుమార్ గుప్తా, నిఘా విభాగం అదనపు డీజీ కుమార్ విశ్వజిత్‌లతో చర్చించాకే ఆ నివేదిక సమర్పించినట్టు పేర్కొన్నారు. సీఎస్ నివేదిక ఆధారంగా ఎన్నికల సంఘం ఆ నలుగురు అధికారులపై వెంటనే చర్యలు చేపట్టింది.
హింసాత్మక ఘటనలను తీవ్రంగా పరిగణించిన కేంద్ర ఎన్నికల సంఘం విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పలువురు అధికారులపై వేటు వేసింది. పల్నాడు, అనంతపురం ఎస్పీలు బిందు మాధవ్, అమిత్ బర్దర్‌లను సస్పెండ్ చేయగా తిరుపతి ఎస్పీ కృష్ణకాంత్ పటేల్‌ను బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు ఆదేశించింది. పల్నాడు కలెక్టర్ శివశంకర్‌ను సైతం బదిలీ చేసి శాఖాపరమైన విచారణ చేపట్టాలని సూచించింది.
అలాగే పల్నాడు, అనంతపురం, తిరుపతి జిల్లాలకు చెందిన 12 మంది పోలీసు అధికారులను సస్పెండ్ చేసి శాఖాపరమైన విచారణ నిర్వహించాలని పేర్కొంది. హింస చెలరేగేందుకు కారకులను గుర్తించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఏర్పాటు చేసి రెండు రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించింది.
బాధ్యులపై ఎన్నికల ప్రవర్తనా నియామవళి ప్రకారం చార్జీషీట్ నమోదు చేయాలని స్పష్టం చేసింది. ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా గురువారం ఢిల్లీ వెళ్లి ఎన్నికల వేళ చెలరేగిన హింసపై స్వయంగా వివరణ ఇచ్చారు.
రాష్ట్రంలో ఇకపై ఎక్కడా హింసాత్మక ఘటనలు చోటు చేసుకోకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎస్, డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. అల్లర్లకు కారకులపై కఠినంగా వ్యవహరించాలని సూచించింది. జూన్ 4న కౌంటింగ్ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట బందోబస్తు కల్పించాలని పేర్కొంది. స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద భారీ భద్రత ఏర్పాటు చేయాలని, ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే పోలీసు అధికారులు, సిబ్బందిపై వేటు తప్పదని హెచ్చరించినట్లు సమాచారం. ఎస్పీ స్థాయి అధికారి నుంచి హోంగార్డు వరకు ప్రతి ఒక్కరూ శాంతి భద్రతలను కాపాడాల్సిన బాధ్యత ఉందని, దీనిపై నిశితంగా పర్యవేక్షించాలని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్‌కుమార్ సూచించినట్లు తెలిసింది.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టాల్సిన చర్యలపై రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఆరు ప్రతిపాదనలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఓట్ల లెక్కింపు అనంతరం 15 రోజులపాటు బందోబస్తు విధులు నిర్వహించేందుకు 25 కంపెనీల అదనపు బలగాలను పంపాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతూ కేంద్ర హోంశాఖకు ఆదేశాలు జారీ చేసింది.
ఈసీ సస్పెండ్ చేసిన పోలీసులు వివరాలు
తిరుపతి జిల్లా
ఎ.సురేందర్‌రెడ్డి డీఎస్పీ–తిరుపతి
కె.రాజశేఖర్ స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్
ఎం.భాస్కర్ రెడ్డి స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ
ఒ.రామచంద్రారెడ్డి ఇన్‌స్పెక్టర్–అలిపిరి
పల్నాడు జిల్లా
ఎ.పల్లపురాజు ఎస్‌డీపీవో–గురజాల
వీఎస్‌ఎన్ వర్మ ఎస్‌డీపీవో–నరసరావుపేట
కె.ప్రభాకర్‌రావు స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్
ఇ.బాలనాగిరెడ్డి స్పెషల్ బ్రాంచ్ ఇన్‌స్పెక్టర్
ఎం.రామాంజినేయులు ఎస్సై–కారంపూడి
డి.వి.కొండారెడ్డి ఎస్సై–నాగార్జునసాగర్
అనంతపురం జిల్లా
సి.ఎం. గంగయ్య డీఎస్పీ–తాడిపత్రి
ఎస్. మురళీకృష్ణ ఇన్‌స్పెక్టర్–తాడిపత్రి