Asaduddin Owaisi and Jagan and Chandrababu (Photo-FB)

Vjy, May 2: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేళ ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన ప్రకటన చేశారు. ఏపీ ఎన్నికల్లో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సారధ్యంలోని వైసీపీకి మద్దతు పలికారు. ఈ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లను ఆయన కోరారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల హక్కులను పరిరక్షించేందుకు పాటుపడుతున్న అత్యంత లౌకికవాద నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు తెలుగుదేశం పార్టీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. చంద్రబాబు అవకాశవాది అని, విశ్వసనీయత లేని నాయకుడని అన్నారు. బీజేపీ సారధ్యంలోని ఎన్డీయే ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వస్తే ముస్లిం రిజర్వేషన్లకు చరమగీతం పాడేందుకు వెనుకడుగువేయబోరని అన్నారు. కాగా ఏపీ ఎన్నికలు- 2019లో వైఎస్సార్‌సీపీ పార్టీకి అసదుద్దీన్ ఒవైసీ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే.  పిల్లలు ఎక్కువ మంది పుట్టకుండా కండోమ్‌లు వాడేది ముస్లింలే, ప్రధాని మోదీ వ్యాఖ్యలకు కౌంటర్ విసిరిన అసదుద్దీన్ ఒవైసీ

ముస్లిం జనాభా పెరుగుదలపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ఒవైసీ మరోసారి ఖండించారు. ముస్లింలే ఎక్కువగా కండోమ్స్ వాడతారని పునరుద్ఘాటించారు. ఇదిలావుంచితే హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి అసదుద్దీన్ ఒవైసీ పోటీ చేస్తున్నారు. ఈ స్థానం నుంచి బీజేపీ నేత మాధవీ లత ప్రధాన పోటీదారుల్లో ఒకరిగా ఉన్నారు. ఒవైసీ లక్ష్యంగా మాటల తూటాలు పేల్చుతూ ఆమె ప్రచారంలో దూసుకెళ్తున్న విషయం తెలిసిందే.