Amaravati, August 29: ఏపీ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో కొత్తగా మరో 20 రాష్ట్ర రహదారులు జాతీయ రహదారులుగా రూపుదిద్దుకోనున్నాయి. అత్యంత రద్దీ ఉన్న20 కీలక రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు రాష్ట్ర ప్రభుత్వం (Andhra Pradesh govt) ప్రతిపాదనలు పంపింది.
ఇటీవలే రాష్ట్రంలో ఏడు రహదారులను జాతీయ రహదారులుగా కేంద్రం ప్రకటించింది. విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టుల్ని అనుసంధానిస్తూ జాతీయ రహదారులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ( Central Government) ప్రతిపాదనలు పంపింది. పోర్టుల్ని అనుసంధానిస్తూ కొత్తగా రహదారుల్ని నిర్మించాలన్న ప్రతిపాదనలకు ఎన్‌హెచ్‌ఏఐ ఆమోదం తెలిపింది. మొత్తం 485.65 కి.మీ. రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించింది.
కాగా రాష్ట్ర ప్రభుత్వం మరో 20 రాష్ట్ర రహదారులను కూడా జాతీయ రహదారులుగా గుర్తించాలని రెండు విడతలుగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. దీనిపై వైఎస్సార్‌సీపీ పార్లమెంటు సభ్యులు ఢిల్లీలో కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా చర్చించారు. దాంతో ప్రతిపాదించిన వాటిలో 688. కి.మీ. మేర 11 రహదారులను జాతీయ రహదారులుగా (688 km roads into National Highway) గుర్తించేందుకు కేంద్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదించింది. దీనిపై త్వరలో అధికారికంగా ఉత్తర్వులు వెలువడనున్నాయి. మరో 9 రహదారులపైనా కేంద్రం సానుకూలం 889.06 కి.మీ. మేర మరో 9 రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. దీనిపై త్వరలో అధికారికంగా నిర్ణయం తీసుకోనుంది.
ఈ ఏడాది మార్చిలో ప్రస్తుతం రాష్ట్ర రహదారులుగా (ఎస్‌హెచ్) ఉన్న 11 మార్గాలకు జాతీయ రహదారుల (ఎన్‌హెచ్) హోదా లభించింది. మొత్తంగా 766.59 కి.మీ. పొడవైన రోడ్లు ఎన్‌హెచ్ జాబితాలో చేరాయి. వీటిలో అయిదింటికి నంబర్లూ కేటాయించారు. మిగిలిన ఆరింటి పూర్తి వివరాలు ఇస్తే వాటికీ నంబర్లు ఇవ్వనున్నారు. ఆయా రహదారులకు కన్సల్టెంట్ సంస్థల ద్వారా సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయించనున్నారు.
డీపీఆర్‌లు సిద్ధమైతే వచ్చే వార్షిక ప్రణాళికలో నిధులు కేటాయించేందుకు వీలుంటుందని అధికారులు చెబుతున్నారు. మొత్తం 11 రహదారుల్లో.. 3 మినహా మిగిలినవన్నీ రాయలసీమ పరిధిలో ఉన్నాయి. ఆయా రహదారుల్లో వాహన రద్దీ తదితరాలను పరిగణనలోకి తీసుకొని నాలుగు వరుసలు చేయలా, ఉన్నదాన్ని 10 మీటర్లకు విస్తరిస్తే సరిపోతుందా? అనేది పరిశీలిస్తారు.
* తెలంగాణలోని కల్వకుర్తిలో మొదలై నంద్యాల వరకు 170 కి.మీ. ఉన్న మార్గాన్ని జాతీయ రహదారిగా గుర్తించి ‘ఎన్‌హెచ్-167కె’ నంబరు కేటాయించారు. ఇది ఆంధ్రప్రదేశ్‌లో 94 కి.మీ. ఉంది. దీనికోసం కృష్ణా నదిపై వంతెన నిర్మించనున్నారు. దీని డీపీఆర్‌కు రూ.6 కోట్లు కేటాయించారు.
* ఏపీ-కర్ణాటక సరిహద్దులో కొడికొండ చెక్‌పోస్ట్‌కు దగ్గరలో కోడూరు నుంచి పుట్టపర్తి మీదుగా ముదిగుబ్బ వరకు 79 కి.మీ. రోడ్డును ఎన్‌హెచ్-342గా గుర్తించారు. ఇదంతా అనంతపురం జిల్లా పరిధిలోనే ఉంది.
* కర్నూలు జిల్లాలోని సోమయాజులపల్లి నుంచి డోన్ రోడ్డు వరకు 56.29 కి.మీ. మార్గాన్ని ఎన్‌హెచ్-340బిగా గుర్తించారు.
* కడప జిల్లాలోని రాయచోటి నుంచి వేంపల్లి, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు మీదుగా చాగలమర్రి రోడ్డు వరకు 130.5 కి.మీ.ను ఎన్‌హెచ్-440గా పేర్కొన్నారు.
* విశాఖ జిల్లాలోని పెందుర్తి నుంచి విజయనగరం జిల్లాలోని బౌదారా కూడలి వరకు (విశాఖ-అరకు రహదారి) 40.2 కి.మీ.కు ఎన్‌హెచ్-516బి సంఖ్య కేటాయించారు.
నంబర్లు కేటాయించాల్సిన మార్గాలు ఇవి..
* గుంటూరు జిల్లాలోని పేరేచర్ల - కొండమోడు, మాచర్ల - దాచేపల్లి (రెండూ కలిపి 90 కి.మీ)
* కర్ణాటకలోని చిత్రదుర్గ నుంచి అనంతపురం జిల్లాలోని పెనుకొండ, పుట్టపర్తి మార్గం (54 కి.మీ)
* అనంతపురం జిల్లాలోని మొలకవేముల క్రాస్ నుంచి కర్ణాటకలోని బాగేపల్లి వెళ్లే రహదారి (84.80 కి.మీ)
* రాజంపేట-రాయచోటి-కదిరి (131 కి.మీ)
* చిత్తూరు బైపాస్ (6.8 కి.మీ).
తాజాగా ఏపీలో జాతీయ రహదారులుగా మారనున్నవి ఇవే
1. బేస్తవాని పేట నుంచి ఒంగోలు (మొత్తం 127 కిలోమీటర్లు)
2. మల్కన గిరి నుంచి విశాఖలోని సబ్బవరం (మొత్తం 251 కిలోమీటర్లు)
3. భీమవరం నుంచి తాడేపల్లిగూడెం (మొత్తం 35.80 కిలోమీటర్లు)
4. పట్చూరు నుంచి కర్ణాటక కోలార్ (మొత్తం 30.96 కిలోమీటర్లు)
5. ఎన్‌హెచ్ 67 వద్ద ఆంజనేయ స్వామి జంక్షన్ నుంచి కర్ణాటక సరిహద్దు వరకు (మొత్తం 3 కిలోమీటర్లు)
6. పలాస నుంచి ఒడిశాలోని పద్మాపూర్ వరకు (మొత్తం 23 కిలోమీటర్లు)
7. రాయచూర్ సమీపంలోని చేలూరు నుంచి తనకల్ ((మొత్తం 12.77 కిలోమీటర్లు)
8. పెనుగొండ నుంచి పావగడ (మొత్తం 26.92 కిలోమీటర్లు)
9. తుముకూరు నుంచి వేపరాళ్ల (మొత్తం 39.81 కిలోమీటర్లు)
10. గుత్తి నుంచి కౌతలం వరకు (మొత్తం 135 కిలోమీటర్లు)
11. నరసాపురం నుంచి రాజోలు (మొత్తం 23 కిలోమీటర్లు)