Amaravati, July 19: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుతో (Polavaram Project) భద్రాచలానికి ముప్పు పొంచి ఉందన్న తెలంగాణ మంత్రి పువ్వాడ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీలో అగ్గిని రాజేస్తున్నాయి. దీనిపై వైసీపీ నేతలు వరుసగా కౌంటర్లు వేస్తున్నారు. బొత్సా సత్యనారాయణ దీనిపై స్పందించగా..తాజాగా పేర్ని నాని, అంబటి రాంబాబు దీనిపై స్పందించారు.
పోలవరం డ్యామ్ (Polavaram Project Dam Height Issue ) వల్ల భద్రాచలం మునిగిందనడం హాస్యాస్పదంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని (Perni Nani) నాని ధ్వజమెత్తారు. ఎన్నికలు వస్తున్నాయి కాబట్టే ఆంధ్రా సెగ రాజేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం నుంచి 50 లక్షల క్యూసెక్కుల వరద డిశ్చార్జి అవుతుందని, ప్రస్తుతం వచ్చిన వరద కేవలం 28 లక్షల క్యూసెక్కులు మాత్రమేనని తెలిపారు.
తెలంగాణ వారే ఏపీలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. ఆధార్ కార్డులను ఏపీ అడ్రస్‌తో మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.1986లో పోలవరం లేదని, అప్పుడు భద్రాచలం మునగలేదా అని ప్రశ్నించారు. అవగాహన లేకుండా పువ్వాడ అజయ్ మంత్రి ఎలా అయ్యారోనని సందేహం వ్యక్తం చేశారు. మంథని, ఏటూరు నాగారం ప్రాంతాలు కూడా మునిగిపోయాయని, ఆ ప్రాంతాలను ఎక్కడ కలుపుతారని పేర్ని నాని ప్రశ్నించారు.
1953లో భద్రాచలం ఏపీలోనే ఉండేదని గుర్తు చేశారు. భద్రాద్రిపై తెలంగాణ సవితి తల్లి ప్రేమ చూపుతోందని విమర్శించారు. యాదాద్రి నిర్మించినట్లే.. భద్రాద్రిని ఎందుకు అభివృద్ధి చేయలేదని నిలదీశారు. తెలంగాణ ప్రభుత్వానికి భద్రాచలంపై ప్రేమ లేకుంటే ఏపీకి ఇచ్చేయాలని, తాము అభివృద్ధి చేసుకుంటామన్నారు. కేవలం ఎన్నికల కోసమే తెలంగాణ నేతలు, మంత్రి పువ్వాడ పోలవరం డ్యాం గురించి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. హైదరాబాద్ పదేళ్లు ఉమ్మడి రాజధానేనని ప్రస్తావించిన పేర్ని నాని.. చంద్రబాబు చేసిన తప్పు వల్ల హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందన్నారు.
పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దు: అంబటి రాంబాబు
పోలవరం ఎత్తుపై కొత్త వివాదాన్ని సృష్టించొద్దని మంత్రి అంబటి రాంబాబు (Amabti Rambabu) అన్నారు. పోలవరంతోనే భద్రాచలం మునిగిపోయిందనడం కరెక్ట్ కాదని సూచించారు. 45.72 మీటర్ల ఎత్తు వరకు కేంద్రం అనుమతులు ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అన్ని అంశాలు పరిశీలించాకే పోలవరానికి అనుమతులు వచ్చాయన్న అంబటి.. పోలవరం ముంపు ఉంటుందనే 7 మండలాలను ఏపీలో కలిపారని గుర్తుచేశారు.
వరదల సమయంలో రాజకీయాలు తగవని మంత్రి అంబటి హితవు పలికారు. తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ 5 గ్రామాలు ఇచ్చేయాలని అంటున్నారని.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? అని ప్రశ్నించారు. ఏదైనా సమస్య ఉంటే కేంద్రంతో మాట్లాడాలని గానీ, ఇలా వివాదం చేయకూడదని అన్నారు. రెండు రాష్ట్రాల మధ్య ఘర్షణ అవసరం లేదని, అందరం కలిసి మెలసి ఉండాల్సిన వాళ్లమని తెలిపారు.