Amaravati, Mar 15: ఏపీలో కరోనా గత 24 గంటల్లో 22,604 మందికి కరోనా టెస్టులను నిర్వహించగా 147 మందికి పాజిటివ్ నిర్ధారణ (AP Coronavirus) అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 35 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా ప్రకాశం, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కో కేసు వంతున నిర్ధారణ అయ్యాయి. కర్నూలు జిల్లాలో ఒకరు మృతి చెందారు.
ఇదే సమయంలో 103 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,443 యాక్టివ్ కేసులు (Active cases) ఉన్నాయి. ఇప్పటి వరకు 7,185 మంది కరోనా వల్ల ప్రాణాలు (Covid Deaths) కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 8,92,008 కేసులు నమోదు కాగా... 8,83,380 మంది కోలుకున్నారు.
పెరుగుతున్న కరోనా కేసులపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని (Medical and Health Minister Alla Nani) కృష్ణా, గుంటూరు, తూర్పుగోదావరి జిల్లాల అధికారులతో మంత్రి మాట్లాడారు. కరోనా బాధితులకు వైద్య సదుపాయాలు కల్పించాలని మంత్రి ఆదేశించారు. తెనాలిలో మున్సిపల్ సిబ్బందికి కరోనా నిర్ధారణ కావడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచామని ఆళ్ల నాని పేర్కొన్నారు.
ప్రైమరీ, సెకండరీ కాంటాక్ట్ ఉన్న వారికి తెనాలి ప్రభుత్వాసుపత్రిలో కరోనా పరీక్షలు చేయిస్తున్నామన్నారు. పొన్నూరులోని ప్రైవేట్ స్కూల్‌లో విద్యార్థులకు ర్యాండమ్‌గా కరోనా పరీక్షలు చేయాలని వైద్యాధికారులను ఆదేశించారు. విద్యార్థులు, తల్లిదండ్రులు భయపడొద్దని.. ప్రభుత్వం అన్ని రకాలుగా అండగా ఉంటుందన్నారు.
కృష్ణా జిల్లాలో కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా వైద్య బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని, సర్వే బృందాలు.. ఇంటింటికి వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. జగ్గయ్యపేట ప్రాంతంలో కరోనా బాధితులను హోమ్ క్వారంటైన్‌కు తరలించామని.. బాధితులు పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారన్నారు. వారికీ అవసరం అయినవైద్యం అందిస్తున్నాం.
విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో 40మంది కరోనా బాధితులకు ప్రత్యేకంగా వైద్య సదుపాయం కల్పించామని పేర్కొన్నారు. కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజు రోజుకి పెరుగుతున్న క్రమంలో అన్ని ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టామని మంత్రి వెల్లడించారు.
తూర్పుగోదావరి జిల్లా కొనసీమ ప్రాంతంలోని మలికిపురం జిల్లా పరిషత్ హైస్కూల్లో 12 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందని, వారిని హోం క్వారంటైన్‌కు తరలించామని పేర్కొన్నారు. కొంతమంది ఉపాధ్యాయులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినప్పటికీ, వారికి ఎలాంటి కరోనా లక్షణాలు లేవన్నారు. కరోనా సోకిన బాధితులకు వైద్య సిబ్బంది పర్యవేక్షణలో వైద్య సదుపాయం కల్పించామని మంత్రి ఆళ్ల నాని వెల్లడించారు.