Srikakulam, Nov 4: శ్రీకాకుళం జిల్లా టెక్కలిలోని కచేరీ వీధిలో దీపావళి కోసం బాంబులు తయారు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు పేలాయి. ఈ ఘటనలో ఒక బాలుడితో పాటు మరో ఇద్దరు యువకులు (Two youth and one child) గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. టెక్కలి గొల్లవీధికి చెందిన వాకాడ హరి అనే బాలుడు, సందిపేట మూర్తి, సందిపేట సాయిగోపాల్‌తో కలిసి స్థానిక కచేరీ వీధిలోని ఓ మారుమూ ల ప్రాంతంలో బాణసంచా తయారు చేస్తున్నారు. దీని కోసం ఒడిశాలోని పర్లాఖిముడి నుంచి ముడి సరుకులు తెప్పించారు.
వీధి అరుగుపై కూర్చుని బాంబులు తయారు చేస్తుండగా అకస్మాత్తుగా అవి ( fire cracker blast in Srikakulam) పేలిపోయాయి. ఆ ధాటికి బాలుడు హరి, యువకుడు మూర్తి అరుగు మీద నుంచి కిందకు తుళ్లిపోయారు. మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. అరుగంతా ధ్వంసమైపోయింది. పక్క భవనంలోని అద్దాలు సైతం పగిలిపోయాయి. దీపావళి రోజులు కావడంతో బాంబులు పేలిన శబ్దం విని అంతా ఎక్కడో బాణసంచా కాలుస్తున్నారనే అనుకున్నారు.
అయితే ఒళ్లంతా తీవ్రమైన గాయాలతో హరి, మూర్తిలు గట్టిగా ఏడవడంతో స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని వారికి సపర్యలు చేశారు. పోలీసులకు సమాచారం అందించడంతో టెక్కలి ఎస్‌ఐ ఎన్.కామేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని 108 సాయంతో క్షతగాత్రులను టెక్కలి జిల్లా ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారి తల్లిదండ్రులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి కన్నీరుమున్నీరయ్యారు.
హరి, మూర్తిలను మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళం రిమ్స్‌కు పంపించారు. స్వల్పంగా గాయపడిన సాయిగోపాల్ నుంచి వివరాలు సేకరించారు. రిమ్స్‌లో బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో రాగోలు జెమ్స్‌కు తరలించారు. సమాచారం తెలుసుకున్న క్లూస్ టీమ్ టెక్కలి చేరుకుని వివరాలు సేకరించారు. బాంబు పేలిన సంఘటన పై టెక్కలి పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నారు.