AP Assembly Session 2023 Live Updates: ఐదు రోజుల పాటు ఏపీ అసెంబ్లీ సమావేశాలు, తొలి రోజు అసెంబ్లీ సమావేశాలు రచ్చ రచ్చ, టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్, లైవ్ అప్ డేట్స్ ఇవిగో..
AP Assembly Session 2023 Live Updates

Vjy, Sep 21: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమైన కాసేపటికే సభలో టీడీపీ నేతలు..చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేస్తూ స్పీకర్‌ తమ్మినేని సీతారాం వద్దకు దూసుకెళ్లారు. ఈ క్రమంలో స్పీకర్‌ను చుట్టుముట్టి ఆయనపై పేపర్లు విసిరారు. బాటిళ్లు విసురుతూ అనుచితంగా ప్రవర్తించారు. దీంతో, రెండు సభలు కాసేపు వాయిదా పడ్డాయి.

కొంత విరామం తర్వాత అసెంబ్లీ ప్రారంభమైంది. అనంతరం, కూడా టీడీపీ సభ్యులు తమ తీరు మార్చుకోలేదు. దీంతో, టీడీపీ సభ్యులతో స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడే ప్రయత్నం చేశారు. అయినా కూడా వారు వినకపోవడంతో టీడీపీ సభ్యులను ఈరోజుకు సభ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే, సభలో అనుచితంగా ప్రవర్తించిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణను స్పీకర్‌ హెచ్చరించారు.

సభలో బాలకృష్ణ మీసం మెలేసిన ఘటనపై స్పీకర్‌ హెచ్చరించారు. స్పీకర్‌ స్థానాన్ని టీడీపీ సభ్యులు అగౌరవపరిచారు. దీన్ని మొదటి తప్పుగా క్షమిస్తున్నాం. స్పీకర్‌ పోడియం దగ్గర నిలుచుని మీసం మెలేసి సభా సంప్రదాయాలను బాలకృష్ణ ఉల్లఘించారు. ఇలాంటి వికృత చేష్టలు చేయడం తప్పు. ఇలాంటి చర్యలు మళ్లీ పునారవృతం కాకూడదు.

అసెంబ్లీలో మీసం తిప్పినందుకు బాలకృష్ణకు వార్నింగ్ ఇచ్చిన స్పీకర్ తమ్మినేని సీతారాం, అసెంబ్లీ సెషన్ నుండి టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెండ్

ఇక, సభలో ఓవరాక్షన్‌ చేస్తూ స్పీకర్‌తో అనుచితంగా ప్రవర్తించిన సభ్యులను స్పీకర్‌ తమ్మినేని సస్పెండ్‌ చేశారు. ఈ సమావేశాలు ముగిసే వరకు ముగ్గురు ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారు. సస్పెన్షన్‌కు గురైన వారిలో ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, అనగాని సత్యప్రసాద్‌, పయ్యావుల కేశవ్‌ ఉన్నారు. ఇక​, టీడీపీ సభ్యులతో పాటు ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కూడా సస్పెన్షన్‌కు గురయ్యారు.

ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ మాట్లాడుతూ.. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు సిద్ధమన్నారు. బీఏసీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. అసెంబ్లీలో ఏం అంశంపైనైనా చర్చుకు సిద్ధమన్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చకు ఎంత సమయమైనా ఇస్తాం అని స్పష్టం చేశారు. బుగ్గన చెప్పినా టీడీపీ సభ్యులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో మంత్రి అంబటి రాంబాబు.. టీడీపీ నేతలకు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాసేపు ఓపికా పడితే చర్చకు సిద్దమని వెల్లడించారు.

ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో గందరగోళం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టి నిరసన చేపట్టిన టీడీపీ, చంద్రబాబు అరెస్టుపై చర్చించాల్సిందే అంటూ పట్టుబట్టిన టీడీపీ నేతలు

దీంతో, మరింత రెచ్చిపోయిన టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ.. అంబటి వైపు చూస్తూ తొడగొట్టి.. మీసాలు మెలేశారు. ఈ క్రమంలో అంబటి రాంబాబు మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు కావాలనే రెచ్చగొడుతున్నారు. టీడీపీ సభ్యులు అవాంఛనీయ ఘటనలను ఆహ్వనిస్తున్నారు. స్పీకర్‌పై దౌర్జన్యానికి దిగడం సరికాదన్నారు. టీడీపీ సభ్యులు బల్లలు కొడుతూ ఏం సందేశమిస్తున్నారు. అసెంబ్లీలో మీసాలు తిప్పితే చూస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఇలాంటివన్నీ సినిమాల్లో చేసుకోవాలని కౌంటరిచ్చారు. అయితే, స్పీకర్‌ ఎంత వారించినా టీడీపీ సభ్యులు వినిపించుకోకపోవడంతో సభను కాసేపు వాయిదా వేశారు తమ్మినేని.

వీడియో ఇదిగో, అసెంబ్లీలో మీసం తిప్పిన బాలకృష్ణ, తొడగొట్టిన మధుసూదన్ రెడ్డి, సినిమాలో తిప్పుకో అంటూ కౌంటర్ విసిరిన అంబటి రాంబాబు

ఇదిలా ఉండగా.. శాససమండలి ప్రారంభమైన కాసేపటికే అటు మండలిలోనూ టీడీపీ సభ్యులు ఓవరాక్షన్‌ చేశారు. మండలిలో కూడా టీడీపీ సభ్యులు ప్రశ్నోత్తరాలను అడ్డుకున్నారు. చంద్రబాబు అరెస్ట్‌పై చర్చించాలని నినాదాలు చేశారు. మండలి ఛైర్మన్‌ పోడియం వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. ఈ క్రమంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. టీడీపీ సభ్యుల తీరు సరికాదు. ఏ అంశం పైన అయినా చర్చకు సిద్ధం. సభ సజావుగా జరిగేందుకు టీడీపీ సభ్యులు సహరికరించాలని కోరారు.

కాగా ఐదు రోజులు పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీలో నిర్ణయం తీసుకున్నారు.

ఒకరోజు సస్పెండైన టీడీపీ ఎమ్మెల్యేలు

కింజరాపు అచ్చెన్నాయుడు

నందమూరి బాలకృష్ణ

బెందాళం అశోక్‌

ఆదిరెడ్డి భవాని

గోరంట్ల బుచ్చయ్యచౌదరి

నిమ్మకాయల చినరాజప్ప

గణబాబు

పయ్యావుల కేశవ్‌

గద్దె రామ్మోహన్‌

నిమ్మల రామానాయుడు

మంతెన రామరాజు

గొట్టిపాటి రవికుమార్‌

ఏలూరి సాంబశివరావు

డోలా బాల వీరాంజనేయస్వామి

అసెంబ్లీ సమావేశాలకు ముందు తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టు (Chandrababu Arrest) అంశాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ (Balakrishna) స్పష్టం చేశారు. ఈ పోరాటం ఇంతటితో ఆగేది కాదన్నారు. ప్రజలంతా తమ వెంటే ఉన్నారని తెలిపారు. ప్రజల్లో తెలుగుదేశానికి ఉన్న స్పందన చూసే అక్రమ కేసులు పెట్టారని ఆరోపించారు. అక్రమ అరెస్టులు, అక్రమ కేసులకు భయపడేది లేదని బాలకృష్ణ తేల్చిచెప్పారు.

అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా వెంకటపాలెంలోని ఎన్టీఆర్ విగ్రహానికి తెలుగుదేశం శాసనసభాపక్షం నివాళులర్పించింది. చంద్రబాబు అరెస్టు అక్రమమని గళమెత్తటమే ప్రధాన అజెండాగా చట్టసభలకు వెళ్తున్నామని తెలుగుదేశం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు స్పష్టంచేశారు. చేసిన తప్పునకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. చంద్రబాబు అక్రమ అరెస్టుపై తాము ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చ చేపట్టాకే.. మరే అంశమైనా తీసుకోవాలన్నారు.

సచివాలయం సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ వద్ద టీడీపీ నేతలు నిరసన చేపట్టారు. తెలుగుదేశం శాసనసభపక్షం నిరసనలో వైకాపా బహిష్కృత ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ‘చంద్రబాబుపై కక్ష - యువత భవితకు శిక్ష’ అంటూ ఎమ్మెల్యేలు ప్లకార్డుల ప్రదర్శించారు. చంద్రబాబుపై అక్రమ కేసు ఎత్తేసి వెంటనే విడుదల చేయాలంటూ నినాదాలు చేశారు. లేదంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం తుళ్లూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు.