CM YS Jagan Aerial Survey, (Photo-Twitter/APCMO)

Amaravati, Nov 20: భారీ వర్షాలతో అతలాకుతమైన ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ (AP CM YS Jagan) సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్‌ ఏరియల్‌ సర్వే (CM YS Jagan Aerial Survey) నిర్వహించారు. అనంతపురం నెల్లూరు, చిత్తూరు, కడప ఇతర ప్రాంతాల్లో ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం రేణిగుంట విమానాశ్రయంలో అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు.

బాధితులను త్వరితగతిన ఆదుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు త్వరితగతిన రూ. 2 వేల ఆర్థిక సాయం అందించాలని ఆదేశించారు.పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చేలా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. చిత్తూరు, తిరుమలలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులపై సీఎం ఆరా తీశారు. హెలికాప్టర్‌ ద్వారా బుగ్గవంక వాగు కారణంగా కడపలో ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు.భారీ వర్షాలతో పొంగి పొర్లుతున్న పాపాఘ్ని, పెన్నా నదుల కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌సర్వే నిర్వహించారు. ఆ తర్వాత వెలిగల్లు, తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.

ముంపునకు గురైన గ్రామాల్లో ఏరియల్‌ సర్వే చేశారు. పింఛ ప్రాజెక్టుతో పాటు, చెయ్యేరు నది కారణంగా దెబ్బతిన్న ప్రాంతాలను, ముంపునకు గురైన ప్రాంతాల్లో సీఎం ఏరియల్‌ సర్వే చేశారు. తర్వాత రేణిగుంట, తిరుపతి టౌన్, పేరూరు ప్రాజెక్టు, స్వర్ణముఖీ నదీ ప్రాంతాల్లోను సీఎం ఏరియల్‌ సర్వే ద్వారా పరిశీలించారు. తిరుపతి టౌన్‌లో వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని సీఎం ఆదేశించారు. వివిధ మున్సిపాల్టీల నుంచి ఇప్పటికే 500 మంది సిబ్బందిని రప్పించామని అధికారులు వివరించారు.

మృతి చెందిన కండక్టర్‌ కుటుంబానికి రూ. 50 లక్షలు పరిహారం, రాజంపేట దుర్ఘటన దురదృష్టకరమని తెలిపిన ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు

వీధుల్లో, డ్రైనేజీల్లో పేరుకుపోయిన పూడికను వెంటనే తొలగించాలని సీఎం ఆదేశాలు జారీచేశారు. తిరుపతిలో డ్రైనేజి వ్యవస్థపై మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వరద నీరు తగ్గగానే పంట నష్టంపై అంచనాలు వెంటనే రూపొందించి రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సహాయక శిబిరాలకు రాకున్నా.. ముంపునకు గురైన ఇళ్లకు వెంటనే ఆర్థిక సహాయం చేయాలని, వాళ్లు తిరిగి ఇంటికి వెళ్లే సందర్భంలో అధికారులు, యంత్రాంగం వారికి తోడుగా నిలవాలని సీఎం ఆదేశించారు.