Supreme Court and Chandrababu (Photo-Wikimedia Commons/ FB)

New Delhi, Oct 20: ఫైబర్‌నెట్‌ కేసులో ముందస్తు బెయిల్‌ కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలుచేసిన ఎస్‌ఎల్‌పీపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్‌ అనిరుద్ధ బోస్‌, జస్టిస్‌ బేలా ఎం.త్రివేది ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరఫున సిద్ధార్థ లూథ్రా, ఏపీ ప్రభుత్వం తరఫున రంజిత్‌కుమార్‌ వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణ నవంబర్‌ 9వ తేదీకి వాయిదా వేసింది. స్కిల్ స్కాం కేసులో తీర్పు ఇచ్చేవరకు ఆగాలని బాబు లాయర్లకు సుప్రీంకోర్టు సూచించింది. అలాగే క్వాష్‌ పిటిషన్‌పై 8వ తేదీన తీర్పు ఇస్తామని ధర్మాసనం పేర్కొంది.

తొలుత సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ పిటిషనర్‌పై మూడు ఎఫ్‌ఐఆర్‌లు ఉన్నాయని.. ఒక దానికి సంబంధించిన తీర్పు రిజర్వు అయిందని తెలిపారు. ఫైబర్‌నెట్‌ కేసులో అరెస్ట్‌ చేయవద్దని ఇప్పటికే చెప్పారన్నారు. ఏపీ ప్రభుత్వం తరఫున న్యాయవాది రంజిత్‌కుమార్‌ వాదిస్తూ ఒక వ్యక్తి కస్టడీలో ఉన్నప్పుడు మళ్లీ అరెస్ట్‌ అనే ప్రశ్నే ఉత్పన్నం కాదన్నారు.

వీడియో ఇదిగో, చంద్రబాబు కోసం ఓయూలో ఉరేసుకుని వినూత్నంగా నిరసన

చంద్రబాబు జ్యుడీషియల్‌ కస్టడీ కొనసాగుతోందని.. ఈ అంశాన్ని కౌంటర్‌ అఫిడవిట్‌లో తెలిపామని చెప్పారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు తదుపరి విచారణను నవంబర్‌ 8కి వాయిదా వేసింది. తనకు ఉన్న వ్యక్తిగత ఇబ్బంది రీత్యా నవంబర్‌ 9న విచారణ చేపట్టాలని సిద్ధార్థ లూథ్రా కోరగా.. రెండు రోజుల్లో ఏదో ఒకరోజు విచారణ చేపడతామని ధర్మాసనం తెలిపింది.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుపై ముందుగా తీర్పు వెలువరిస్తామని.. ఆ తర్వాత ఫైబర్‌ నెట్‌ కేసు అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటామని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతవరకు చంద్రబాబును అరెస్ట్‌ చేయొద్దని.. పీటీ వారెంట్‌పై యథాతథ స్థితి కొనసాగించాలని ఆదేశించింది. ఫైబర్‌నెట్‌ కేసులో తన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు ఈ నెల 9న ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

చంద్రబాబుకు ఎదురుదెబ్బ, నవంబర్‌ 1 వరకు రిమాండ్‌ను పొడిగించిన ఏసీబీ కోర్టు, ఏపీ హైకోర్టులో బెయిల్‌పై కొనసాగుతున్న విచారణ

ఇక ఏసీబీ కోర్టులో చంద్రబాబుకు ఎదురుదెబ్బ తగిలింది.చంద్రబాబు లీగల్‌ ములాఖత్‌ పిటిషన్‌ను ఏసీబీ కోర్టు తిరస్కరించింది. అత్యవసర విచారణ చేపట్టాలని చంద్రబాబు లాయర్లు కోర్టుకు తెలపగా కుదరదని చెప్పి.. కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐడీకి కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ప్రతివాదుల్ని చేర్చకపోవడంతో విచారణ అవసరం లేదంటూ ఇవాళ పిటిషన్‌ను తిరస్కరించింది కోర్టు.