File image of High Court of Andhra Pradesh | File Photo

Amaravati, Mar 4: ఎన్నికల కమిషన్ కు మళ్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఏపీ మునిసిపల్‌ ఎన్నికల నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసిన తరువాత కూడా పలుచోట్ల పలువురు అభ్యర్థులను నామినేషన్ల దాఖలుకు అనుమతినిస్తూ ఎన్నికల కమిషనర్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు (AP High Court) నిలిపివేసింది. బలవంతపు నామినేషన్ల (municipal election nominations) ఉపసంహరణపై ఫిర్యాదులు స్వీకరించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ (Election Commissioner) ఇచ్చిన ఉత్తర్వుల అమలును కూడా నిలుపుదల చేసింది.

దీంతో పాటుగా మునిసిపల్‌ ఎన్నికల్లో (AP Municipal Polls) వార్డు వాలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఆదేశాల అమలును హైకోర్టు నిలిపివేసింది. దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి దాఖలు చేసిన అనుబంధ వ్యాజ్యాలను తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్‌ చర్యలన్నీ చట్టానికి లోబడి మాత్రమే ఉండాలని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు బుధవారం వేర్వేరుగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.

కాగా నామినేషన్ల ఘట్టం ముగిసిన తరువాత కూడా నామినేషన్ల దాఖలుకు అనుమతిస్తూ ఎన్నికల కమిషన్‌ ఈ నెల 1న జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్సార్‌ కడప జిల్లా రాయచోటి మునిసిపాలిటీకి చెందిన పాపిరెడ్డి మదన్‌మోహన్‌రెడ్డి, తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌కు చెందిన వి.ఈశ్వరి, కొమ్మినేని అనీష్‌ కుమార్‌ మరికొందరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. మునిసిపల్‌ ఎన్నికల్లో బలవంతంగా నామినేషన్లను ఉపసంహరించినట్లు ఫిర్యాదులు వస్తే స్వీకరించాలని రిటర్నింగ్‌ అధికారులను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ గత నెల 16న జారీ చేసిన ఉత్తర్వులను కూడా పిటిషనర్లు సవాలు చేశారు. ఎన్నికల కమిషన్‌ ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాల్లో కోరారు. వాదనలు విన్న ధర్మాసనం ఎస్ఈసీ ఆర్డర్లను కొట్టి వేస్తూ తీర్పు ఇచ్చింది.

ఎస్ఈసీ రీ నామినేషన్‌ ఉత్తర్వులను కొట్టి వేసిన ఏపీ హైకోర్టు, వార్డు వాలంటీర్లపై జారీ చేసిన ఆదేశాలను కూడా కొట్టివేసిన ధర్మాసనం, వాలంటీర్ల ట్యాబ్‌లను స్వాధీనం చేసుకోవద్దని స్టేట్ ఎన్నికల కమిషన్‌కు సూచన

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగాయని భావిస్తే ఫిర్యాదు చేసేందుకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయి. నామినేషన్ల దాఖలు నుంచి ఫలితాల వెల్లడి వరకు వచ్చే ఫిర్యాదులపై ఎన్నికల కమిషన్‌ విచారణ జరపడానికి వీలేదు. ఆ ఫిర్యాదులను ఎన్నికల పిటిషన్‌ ద్వారా మాత్రమే తేల్చాలి. నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకున్నారని భావిస్తే సంబంధిత వ్యక్తులు ఎన్నికల ట్రిబ్యునల్‌ను ఆశ్రయించాలి. ప్రస్తుత కేసులో జారీ చేసినటువంటి ఉత్తర్వులు వెలువరించే అధికారం ఎన్నికల కమిషన్‌కు లేదు. చట్టాలు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో పిటిషనర్లు కోరిన విధంగా మధ్యంతర ఉత్తర్వులు ఇస్తున్నాం’ అని జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఎన్నికల ప్రక్రియలో అక్రమాలు జరిగితే ఫిర్యాదులు చేసేందుకు ప్రత్యామ్నాయం ఉందన్న పిటిషనర్ల వాదనతో ఈ కోర్టు ఏకీభవిస్తోంది. హైదరాబాద్‌ మునిసిపల్‌ చట్టం సెక్షన్‌ 71 ప్రకారం ఎన్నికను ఎన్నికల పిటిషన్‌ ద్వారా మాత్రమే ప్రశ్నించగలుగుతారు. రాజ్యాంగంలోని అధికరణ 243 జెడ్‌జీ ఏ మునిసిపాలిటీ ఎన్నికనైనా ఎన్నికల పిటిషన్‌ ద్వారా తప్ప మరో రకంగా ప్రశ్నించజాలరని చెబుతోంది. ఒక చర్యను ఫలానా విధంగా చేపట్టాలని చట్టం చెబుతున్నప్పుడు ఆ విధంగానే చేపట్టాలే కానీ మరోరకంగా కాదు.

మళ్లీ వైసీపీదే హవా..మునిసిపల్ ఎన్నికల్లో ఏకగ్రీవాల జోరు, మొత్తం 245 డివిజన్, వార్డు స్థానాల్లో సింగిల్ నామినేషన్లు దాఖలు, మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఎస్ఈసీ అధికారికంగా ప్రకటించే అవకాశం

మునిసిపల్‌ ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు, బెదిరింపులు చోటు చేసుకున్నాయని ఎన్నికల కమిషన్‌ చెబుతున్నప్పటికీ కేవలం నలుగురు వ్యక్తులు మాత్రమే తిరిగి నామినేషన్లు దాఖలు చేశారు. ఈ పరిస్థితుల్లో పిటిషనర్లకు అనుకూలంగా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయడంలో ఎలాంటి తప్పు లేదు. ఎన్నికల్లో మోసం జరిగిందని చెబితే సరిపోదు, నిర్దిష్ట ఆధారాలను సమర్పించాలి. తిరుపతి మునిసిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల విషయంలో రిటర్నింగ్‌ అధికారి జోక్యం చేసుకోవడానికి నిరాకరించారు. బలవంతంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగిందనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవు. అయితే ఎన్నికల కమిషన్‌ దీన్ని తోసిపుచ్చింది. ఇలాంటి ఉత్తర్వులు ఇచ్చినప్పుడు అందుకు కారణాలు తెలియచేయాలి. కానీ ప్రస్తుత కేసులో అలాంటి కారణాలు ఏవీ చెప్పలేదు’ అని జస్టిస్‌ సోమయాజులు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మునిసిపల్‌ ఎన్నికల్లో వార్డు వలంటీర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా పాలుపంచుకోకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశిస్తూ ఎన్నికల కమిషన్‌ జారీ చేసిన ఉత్తర్వుల అమలును హైకోర్టు నిలిపివేసింది. వార్డు వలంటీర్ల కార్యకలాపాలన్నింటినీ నిలిపేయాల్సిన అవసరం ఏమీ లేదని స్పష్టం చేసింది. మొబైల్‌ ఫోన్లలో డేటాను వలంటీర్లు దుర్వినియోగం చేస్తారనేందుకు స్పష్టమైన ఆధారాలు లేవని, ఓటర్లను ప్రభావితం చేస్తారనేందుకు సైతం ఆధారాల్లేవని హైకోర్టు తేల్చి చెప్పింది.