AP Govt Offices Shifting Row Andhra Pradesh High Court adjourned Enquiry On Vigilance Commission | (Photo-Twitter)

Amaravati, April 16: పేద విద్యార్థుల కోసం అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియాన్ని (AP English Medium Row) తప్పనిసరి చేస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన జీవోలు 81, 85ను హైకోర్టు రద్దు చేసింది. ఈ జీవోలు రాజ్యాంగ నిబంధనలకు, విద్యా హక్కు చట్ట స్ఫూర్తికి, సుప్రీంకోర్టు తీర్పులకు విరుద్ధమని తీర్పులో పేర్కొంది.

ఏపీ, తెలంగాణలో రెడ్, ఆరెంజ్ జోన్లు ఇవే, కరోనా హాట్‌ స్పాట్ జిల్లాలను ప్రకటించిన కేంద్రం

స్వాతంత్య్రానికి ముందు, తర్వాత చూసినా.. 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, విద్యా జాతీయ విధానం, ఇతర నివేదికల మేరకు నిస్సందేహంగా 1 నుంచి 8వ తరగతి వరకు బోధనా మాధ్యమం తప్పనిసరిగా మాతృభాషలోనే ఉండాలని చెబుతున్నాయని హైకోర్టు (AP High Court) తెలిపింది.

అందువల్ల ఈ జీవోలు ఎంత మాత్రం ఆమోద యోగ్యం కావని పేర్కొంటూ ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ జితేంద్ర కుమార్‌ మహేశ్వరి, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం 92 పేజీల తీర్పు వెలువరించింది.

81, 85 జీవోలు జారీ చేసే నాటికి రాష్ట్రంలో తెలుగు మీడియం పాఠశాలలకు సమాంతరంగా ఇంగ్లిష్‌ మీడియం పాఠశాలలు నడుస్తున్నాయి. తద్వారా ఇంగ్లిష్‌ మీడియంలో తమ పిల్లలను చేర్చాలనుకునే వారికి ఆ అవకాశం ఉంది. కాబట్టి ఇంగ్లిష్‌ మీడియంను (English Medium) తప్పనిసరి చేశామన్న ప్రభుత్వ వాదన ఆమోదయోగ్యం కాదని తీర్పులో స్పష్టం చేసింది.

ఒకటి నుంచి ఆరు వరకే ఇంగ్లీష్ మీడియం, తెలుగు సబ్జెక్ట్ తప్పనిసరి

కాగా విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీల విజ్ఞప్తి మేరకు అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గత ఏడాది నవంబర్‌ 20న జీవో 85 (అంతకు ముందు 81) జారీ చేసింది. ఈ జీవోను సవాలు చేస్తూ పశ్చిమ గోదావరికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ గుంటుపల్లి శ్రీనివాస్, తూర్పు గోదావరికి చెందిన సుధీష్‌ రాంభొట్ల హైకోర్టులో వేర్వేరుగా గత ఏడాది ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం (English Medium)పై చర్చ

మండలానికి ఒక తెలుగు మీడియం పాఠశాలను ఏర్పాటు చేయడం ద్వారా విద్యా హక్కు చట్ట నిబంధనలను సంతృప్తి పరచలేరు. పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రుల కమిటీ అభ్యర్థన మేరకు ఇంగ్లిష్‌ మీడియంను తీసుకొచ్చామని ప్రభుత్వం చెబుతోంది. అయితే బోధన ఏ మాధ్యమంలో ఉండాలన్న విషయాన్ని చట్ట ప్రకారం తల్లిదండ్రుల కమిటీలు నిర్ణయించజాలవని తెలిపింది.

ఈ అంశంపై స్పందించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Education minister Adimulapu suresh) పేదలకు ఇంగ్లీష్ మీడియంలో విద్యాబోధన అందించాలన్న నిర్ణయానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. హైకోర్టు తీర్పు కాపీని పరిశీలించి.. న్యాయ సలహా తీసుకుంటామన్నారు. అవసరమైతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామంటున్నారు. హైకోర్టు తీర్పును గెలుపు, ఓటమిగా చూడకూడదని.. కోర్టు తీర్పుపై తాము ఎలాంటి వ్యాఖ్యలు చేయదలుచుకోలేదన్నారు.

ఇంగ్లీష్ మీడియం విషయాన్ని కూడా రాజకీయం చేయడం సరికాదని.. ఇంగ్లీష్ మీడియం అమలు చేస్తూనే.. తెలుగు మీడియంను కూడా కొనసాగిస్తామని చెప్పినా.. ఎందుకు ఇలా అయ్యిందో అర్ధం కావడంలేదన్నారు మంత్రి. హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు అంటూ కొందరు వ్యాఖ్యానిస్తున్నారని.. కానీ అది ప్రతిపక్షాల ఆలోచన విధానమని.. బడగుబలహీన వర్గాల చెంపమీద కొట్టినట్లు ఉందన్నారు.