Amaravati, Sep 22: తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కుప్పం నుంచి తిరిగి గెలిచే సత్తా చంద్రబాబుకు ఉందా అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని (AP Minister Kodali Nani) సవాల్ చేశారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానన్నారు. సవాల్ చేసి పారిపోవడమన్నది చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) రక్తంలో నరనరాల్లో జీర్ణించుకుపోయిందని ఎద్దేవా చేశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా పరిషత్ ఎన్నికల్లో 99 శాతం జెడ్పీటీసీ స్థానాలను, 85 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ దక్కించుకుని ఆఖండ విజయం సాధించిందని నాని పేర్కొన్నారు. 2020 మార్చిలో మూడు రోజుల్లో పరిషత్ ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుందనగా అప్పటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ వాయిదా వేశారని గుర్తు చేశారు. ఎన్నికలకు భయపడిన చంద్రబాబు (Kodali Nani Slams Chandrababu) తన తొత్తు అయిన నిమ్మగడ్డతో రాష్ట్రంలో మూడు కరోనా కేసులున్నాయనే సాకుతో వాయిదా వేయించి చంద్రబాబు పారిపోయారని గుర్తు చేశారు.
చివరకు కుప్పం నియోజకవర్గంలోను, సొంతూరు నారా వారిపల్లెలోను, ఎన్టీఆర్ సొంతూరు నిమ్మకూరులోను, ఎన్టీఆర్ అత్తగారి ఊరులోను, దత్తత గ్రామం కొమరవోలులోను ఎక్కడా టీడీపీ గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబుకు అర్థమైందన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీని అడ్డుకోలేమని, ఎన్నికలు జరిగితే ప్రజల్లో నవ్వుల పాలవుతామనే భయంతో బహిష్కరణ డ్రామాను తెరపైకి తెచ్చారని మండిపడ్డారు.
మూడు రోజుల్లో ఎన్నికలు ఉండగా చంద్రబాబు, నిమ్మగడ్డ వాయిదా వేసి పారిపోయారని ఎద్దేవా చేశారు. కొత్త ఎన్నికల కమిషనర్ వచ్చాక మార్చిలో ఎన్నికల ప్రక్రియ కొనసాగిస్తే ఎక్కడా టీడీపీ గెలవదని లెక్కింపు ఆపేశారని విమర్శలు గుప్పించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిని ప్రజలు దీవిస్తుంటే చూడలేని ఈ చంద్రబాబు ఎన్నికల బహిష్కరణ అంటారని మంత్రి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. 800 మంది టీడీపీ అభ్యర్థులు గెలిచారు.. వాళ్లందరూ చంద్రబాబుని ధిక్కరించినవాళ్లా? అని సూటిగా ప్రశ్నించారు.
ఆ గెలిచిన వాళ్లలో ఒకరిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకోండి అని సూచించారు. ప్రతిపక్షం ఖాళీ అయినట్టు చంద్రబాబు ఒప్పుకుంటున్నారని నాని పేర్కొన్నారు. ఈ పప్పు, తుప్పును నమ్ముకుంటే తెలంగాణలో పట్టిన గతే పడుతుందని జోస్యం చెప్పారు. అయ్యన్నపాత్రుడు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని.. తాను తలచుకుంటే ఇంకా దారుణంగా తిట్టగలనని ఆయన వార్నింగ్ ఇచ్చారు.