Amaravati, Sep 28: ఏపీలో కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. భారీ వర్షాలకు (Heavy Rains) ఎగువ నుంచి వరద పోటెత్తుతుండటంతో ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. రెండో ప్రమాద హెచ్చరిక కూడా జారీ చేసే అవకాశం ఉందని అధికారులు అంచనా లోతట్టు ప్రాంతాలు, లంక గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు చర్యలు చేపట్టారు.
ఈ నేపథ్యంలో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి (Prakasam Barrage) వరద నీరు పోటెత్తడంతో కృష్ణానది కరకట్టపై ఉన్న నివాసాలకు ప్రభుత్వ అధికారులు (AP Revenue Officials)నోటీసులు జారీ చేశారు. అందులో భాగంగానే ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి కూడా అధికారులు నోటీసులు (Notices to Chandrababu Residence) జారీ చేశారు.
కృష్ణా నది (Krishna River) వరద 5 లక్షల క్యూసెక్కులకు పెరగడంతో ఈ నోటీసులు ఇచ్చినట్టు అధికారులు చెప్తున్నారు. కరకట్టపై ఉన్న ఇతర నివాసాలకు కూడా నోటీసులు ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. వరద పెరుగుతుండటంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు. వరద ఇంకా పెరిగే అవకాశం ఉందని, ఇండ్లల్లో ఎవరూ ఉండొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Here's Prakasam Barrage water Flow Visuals
Beautifully Scary Prakasam Barrage in Vijayawada. Srisailam and Nagarjuna Sagar projects bringing excess water to Prakasam Barrage on river Krishna. Authorities have sounded high alert after 70 gates of barrage opened taking outflow to 7 lakh cusec. #AndhraPradesh #Flood pic.twitter.com/QubE8sRXNv
— Aashish (@Ashi_IndiaToday) September 28, 2020
#WATCH Andhra Pradesh: Water from Prakasam Barrage in Vijayawada being released into Krishna canals and to the Bay of Bengal, after it received around one lakh cusecs of water from Pulichintala & Munneru upland areas. pic.twitter.com/WjGLZbaPrs
— Shravan Shukla ePatrakaar (@epatrakaar) September 26, 2020
ఎగువన కురుస్తున్న వర్షాలకు గంట గంటకు కృష్ణానది వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో ఈస్ట్రన్, వెస్ట్రన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేశారు. బ్యారేజీ వద్ద 16.2 అడుగులకు నీటిమట్టం చేరింది. ఇన్‌ఫ్లో 6.66 లక్షలు క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో 6.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పరివాహాక ప్రాంతాల్లో రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. కృష్ణా నది వరద ప్రవాహంతో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురైనాయి. కృష్ణలంక, తారకరామనగర్, భూపేష్ గుప్తానగర్‌లో ఇళ్లు నీట మునిగాయి. విజయవాడ నగరంలో (Vijayawada) నాలుగు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాలకు ముంపు బాధితులను అధికారులు తరలిస్తున్నారు.
ప్రకాశం బ్యారేజీకి ఎగువ నుంచి 5.81 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. దీంతో బ్యారేజీ 70 గేట్లను క్లియర్ స్థాయికి ఎత్తి 5.06 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. కాగా, కీసర వాగు నుంచి 50 వేలు, పాలేరు వాగు నుంచి 13,500 క్యూసెక్కుల నీరు బ్యారేజీకి వస్తోంది. సోమవారానికి వరద మరింత పెరుగుతుందని అధికారులు అంచనా వేశారు.
ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటి విడుదల ఈ సీజన్‌లో తొలిసారిగా ఐదు లక్షల క్యూసెక్కులు దాటింది. వరద ప్రవాహం మరికొంత పెరిగితే రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. వరద పెరుగుతున్నందున ముంపు గ్రామాల ప్రజలను ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు తరలించాల్సిందిగా గుంటూరు జిల్లా యంత్రాంగం రెవెన్యూ అధికారులను ఆదేశించింది.
కాగా, ఆదివారం సాయంత్రానికే పులిచింతల డ్యాం నుంచి ఆరు లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేసినట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ తెలిపారు. సోమవారం ప్రకాశం బ్యారేజీ దిగువకు ఏడు లక్షల క్యూసెక్కులను విడుదల చేసే అవకాశం ఉందని చెప్పారు. పరీవాహక ప్రాంత ప్రజలు, లోతట్టు ప్రాంతాలవారు అప్రమత్తంగా ఉండాలన్నారు. వరద సహాయక చర్యల కోసం పలుచోట్ల కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు.
కాగా, నది పరీవాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు సూచించారు. ఆదివారం రాత్రికి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నట్లు తెలిపారు.
తూర్పు బిహార్ పరిసరాల్లోని అల్పపీడనం బలహీనపడింది. తూర్పు బిహార్‌ను అనుకుని ఉన్న సబ్-హిమాలయాస్, సిక్కిం, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి గ్యాంగ్‌టక్, పశ్చిమబెంగాల్, ఒడిసా కోస్తా ప్రాంతం మీదుగా ఏపీ తీరానికి దగ్గరలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకు ఉపరితల ద్రోణి ఏర్పడింది. అలాగే ఏపీ దక్షిణ ప్రాంతంలో 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. వీటి ప్రభావంతో 28న ఉత్తరాంధ్ర, యానాం, 29, 30 తేదీల్లో రాయలసీమ, దక్షిణకోస్తాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.