Amaravati, Oct 16: రానున్న దసరా పండగను పురస్కరించుకుని ఏపీఎస్ఆర్టీసీ 1,850 ప్రత్యేక సర్వీసులు (APSRTC will operate 1,850 special buses) నడపనుంది. అక్టోబర్ 15 నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ (APSRTC) రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపాలని ఏపీఎస్ఆర్టీసీ నిర్ణయించింది . సాధారణంగా ఏటా దసరా పండుగకు (Vijayadashami) 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో (Telangana) అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది.
ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్‌ఆర్టీసీ (TSRTC) ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడంతో రెండు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ చర్చలు కొలిక్కి రావడం లేదు. విజయదశమి పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆర్టీసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది.
ఇక తెలంగాణతో ఒప్పందం ఇంకా కొలిక్కి రాకపోవడంతో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పటికే విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఆన్‌లైన్ రిజర్వేషన్లు ప్రారంభించారు.
టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. దీనిపై రవాణా శాఖ కమిషనర్ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సులివీ..
శ్రీకాకుళం, విజయనగరం–66, విశాఖపట్నం–128, తూర్పుగోదావరి–342, పశి్చమగోదావరి–40,
కృష్ణా–176, గుంటూరు–50, ప్రకాశం–68,
నెల్లూరు–156, చిత్తూరు–252, కర్నూలు–254, కడప–90, అనంతపురం–228