New Delhi, April 11: కేంద్రంపై పోరాటానికి తెలంగాణ ప్రజులు, రైతులు సిద్ధంగా ఉన్నారని, తాడోపేడో తేల్చుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM K Chandrashekar Rao) తేల్చిచెప్పారు. కేంద్రానికి 24 గంటల డెడ్‌లైన్ విధించారు కేసీఆర్. 24 గంటల్లోపు ధాన్యం సేకరణపై కేంద్రం (24-Hour Deadline to Narendra Modi Govt) ఓ నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్ వేదికగా టీఆర్ఎస్ పార్టీ చేపట్టిన రైతు నిరసన దీక్షలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దేశంలోని రైతులు భిక్షగాళ్లు కాదు.. ఒకే విధానం లేకపోతే రైతులు రోడ్లపైకి వస్తారని కేసీఆర్ స్పష్టం చేశారు. మోదీ, పీయూష్ గోయల్‌కు రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తున్నాను.. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనాలని (Procure Paddy from Telangana) కోరుతున్నానని కేసీఆర్ పేర్కొన్నారు.
రాష్ట్ర బీజేపీ నేతలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రిని జైలుకు పంపుతామని అంటున్నారు.. దమ్ముంటే రండి అని కేసీఆర్ సవాల్ విసిరారు. కేంద్రం కార్పొరేట్లకు కొమ్ము కాస్తూ.. రైతుల జీవితాలతో ఆటలాడుకుంటోందని కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రానికి ఎదురు తిరిగితే సీబీఐ, ఈడీ వంటి సంస్థలతో దాడులు చేస్తారు. బీజేపీలో అందరూ సత్యహరిశ్చంద్రులే ఉన్నారా? వాళ్ల దగ్గరకు ఈడీ, సీబీఐ వెళ్లదు.. ప్రతి రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులను బెదిరిస్తున్నారు. సీఎంను జైలుకు పంపుతామని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. దమ్ముంటే రావాలని సవాల్ విసిరారు. ఊరికే మొరగడం సరికాదని కేసీఆర్ అన్నారు.
కేంద్రం పంట మార్పిడి చేయాలని సూచించినట్లు తాము రైతులకు చెప్పామని కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఉద్దేశపూర్వకంగా రైతులు ధాన్యం పండించండి.. మేము కొంటామని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కూడా రైతులను రెచ్చగొట్టాడు. రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని తాము ఢిల్లీలో ధర్నా చేస్తే.. పోటీగా బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారు. అసలు వాళ్లకు సిగ్గుండాలని కేసీఆర్ విమర్శించారు. ఏ ఉద్దేశంతో బీజేపీ నేతలు హైదరాబాద్‌లో ధర్నా చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ నిస్సిగ్గుగా వ్యవహరిస్తోందన్నారు. అంతిమ విజయం సాధించేంత వరకు విశ్రమించేది లేదని కేసీఆర్ తేల్చిచెప్పారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. ది రోజుల పాటు ఢిల్లీలో ఉన్న కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు బయల్దేరారు. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకు తెలంగాణ మంత్రివర్గం సమావేశం కానుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కానున్నారు. కేబినెట్ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చించనున్నారు.