
Amaravati, April 15: కరోనా వైరస్ వ్యాప్తిని(Coronavirus) అరికట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తోన్న పోరాటానికి ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం, రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) అధినేత ముఖేష్ అంబానీ తనవంతు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్-19 ( COVID-19)నివారణ చర్యలు చేపట్టేందుకు రిలయన్స్ గ్రూపు రూ.5 కోట్లు విరాళం ప్రకటించింది. ఈమేరకు ముఖ్యమంత్రి సహాయ నిధికి ఆన్‌లైన్ ద్వారా ఆ మొత్తం జమచేసింది.
కరోనాతో ఏపీలో డాక్టర్ మృతి, నెల్లూరులో తొలి మరణం
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉదారతను ప్రశంసిస్తూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి (CM YS Jagan Mohan Reddy) లేఖ రాశారు. కోవిడ్ నివారణ చర్యలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆర్థిక సాయం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. ఈ సంధర్భంగా రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి ధన్యవాదాలు తెలిపారు.
కోవిడ్-19 కు వ్యతిరేకంగా దేశం చేస్తున్న పోరాటానికి మద్దతుగా నిలవాలని ప్రధాని మోదీ పిలుపు మేరకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు సాయం చేసిన రియలన్స్ ఇండస్ట్రీస్ .. పీఎం కేర్స్‌కు ఇప్పటికే రూ. 530 కోట్లకు పైగా అందించింది. వైరస్ సవాళ్లను ఎదుర్కోవడంలో దేశానికి సాయం చేసేందుకు సదా సిద్ధమని ప్రకటించింది. ఆ దిశగా కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు రిలయన్స్ లైఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు పరిశోధనలు కూడా చేస్తున్నారు.
డాక్టర్‌పై కరోనా పేషెంట్ బంధువుల దాడి
కరోనా కట్టడికోసం అత్యాధునిక సౌకర్యాలతో 100 పడకల ఆస్పత్రిని కోవిడ్-19 సేవలకు రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించింది. దాంతోపాటు దేశవ్యాప్తంగా ఉచిత భోజనం అందించే కార్యక్రమాలు చేపట్టింది. ఆరోగ్య కార్యకర్తలు, సంరక్షకుల కోసం రోజూ లక్ష మాస్కులు, వేలాది పీపీఈ కిట్లను ఉత్పత్తి చేసి ఇస్తోంది. దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ వాహనాలకు ఉచితంగా ఇంధనం అందిస్తోంది. రిలయన్స్ రిటైల్ ద్వారా ప్రతిరోజూ లక్షలాది భారతీయులకు నిత్యావసరాలను ఇంటికే సరఫరా చేస్తోంది.