Eluru, Dec 13: ఏపీలో పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో సాధారణ పరిస్థితి నెలకొందని, అంతుచిక్కని వ్యాధి (Eluru Mystery Disease) కారణంగా అనారోగ్యం పాలై ఏలూరు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులంతా డిశ్చార్జ్ అయ్యారని మంత్రి ఆళ్లనాని తెలిపారు. బాధితులను పరామర్శించిన తరువాత ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామన్నారు.
మెడికల్ టీమ్‌లు బాధితుల ఇంటికెళ్లి ఆరోగ్య సమాచారాన్ని తెలుసుకుంటున్నాయని, బాధితులకు ఆహారం, మందులు అందిస్తున్నామని వెల్లడించారు. 650 కుటుంబాలకు నిత్యావసరాలు అందిస్తున్నామని చెప్పారు. 5 కేజీల బియ్యం, కందిపప్పు, ఆయిల్, కూరగాయలు ఇస్తున్నామన్నారు. సమావేశంలో జేసీ హిమాన్షు శుక్లా, డీఎంహెచ్‌వో డాక్టర్ సునంద, ఏలూరు ఆర్‌డీవో రచన, నగర కమిషనర్ చంద్రశేఖర్ పాల్గొన్నారు.
మూడు రోజుల్లో తుది నివేదిక వస్తుందని, తుది నివేదిక బట్టి అస్వస్థతకు కారణాలు(Mystery illness in Andhra Pradesh) తెలుస్తాయని అన్నారు. అంతకుక్రితం, ఏలూరు టూటౌన్, తంగెళ్లమూడి ప్రాంతాల్లో బాధితుల ఇళ్ల వద్దకు నేరుగా వెళ్లిన మంత్రి ఆళ్లనాని వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ పనులను అధికారులతో కలిసి పరిశీలించారు.
ఇక ఏలూరులో అంతుచిక్కని వ్యాధి (Mystery illness in Eluru) బారినపడుతున్న వారి సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ శనివారం వివరించారు. శుక్రవారం రెండు కొత్త కేసులు మాత్రమే వచ్చాయని చెప్పారు.
ఏలూరులో ప్రజల అనారోగ్యానికి కారణం ఎలాంటి వ్యాధి (Andhra Pradesh Eluru mystery illness) కాదని.. ఇది రియాక్షన్ మాత్రమేనని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ వెల్లడించారు. ఏలూరు ప్రజలు అస్వస్థతకు గురికావడానికి స్పష్టమైన కారణాలు ఇప్పటి వరకు నిర్ధారణ కాలేదని.. మరికొన్ని పరిశోధనలు ఫలితాలు రావాల్సి ఉందని చెప్పారు. అంతుచిక్కని ఈ రియాక్షన్‌కు సంబంధించిన కారణాలను నిర్ధారించేందుకు మరో 3 రోజుల సమయం పడుతుందని కమిషనర్ తెలిపారు. ఏలూరు ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తాజా పరిస్థితులను కమిషనర్ వివరించారు.
అనంతరం ఆరోగ్య శాఖ కమిషనర్ కాటమనేని భాస్కర్ మీడియాతో మాట్లాడుతూ.. ఏలూరులో తాగు నీటితో ఎలాంటి సమస్య లేదని తేల్చి చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఇచ్చిన నివేదికల ఆధారంగా తాగు నీటిలో సీసం, నికెల్ లేదని తేలిందన్నారు. అక్కడి ప్రజలు తీసుకునే ఆహారంలో సీసం, నికెల్ ఉండొచ్చని భావిస్తున్నామని చెప్పారు. ఆహారంలో వివిధ కారకాలు కలవడం, పురుగుల మందుల అవశేషాలు కలవడం వంటి కారణాలతో వ్యాప్తి జరిగి ఉండొచ్చని సందేహిస్తున్నట్లు వెల్లడించారు.
ఏలూరు ప్రజల రక్త నమూనాల్లో సీసం, నికెల్, బియ్యంలో మెర్క్యూరీ అధిక మోతాదులో ఉన్నట్లు తేలిందని కాటమనేని భాస్కర్ చెప్పారు. జాతీయ సంస్థలు రెండోసారి ఇచ్చిన నివేదికల్లోనూ సీసం, నికెల్ ఉన్నట్లు తేలిందన్నారు. గాలిలో మోతాదుకు మించి లెడ్, నికెల్ లేవని కాలుష్య నియంత్రణ మండలి తేల్చిందని వివరించారు. వైరస్, బ్యాక్టీరియా వల్ల వ్యాప్తి జరగలేదని తేలిందన్నారు. ఫిట్స్ వచ్చిన వారిలో 80 శాతం మంది మాంసాహారం తీసుకోలేదని, అయినా చేపలు, మాంసాహారాలపై పరిశోధన జరుగుతోందని వివరించారు. ఏలూరులో కేసుల నమోదు ఉన్నంత వరకు వైద్య శిబిరాలు కొనసాగిస్తామని కమిషనర్ భాస్కర్ సీఎంకు వివరించారు.
వింతవ్యాధికి గల కారణాలను వెలికితీసేందుకు ఢిల్లీలోని ఎయిమ్స్, డబ్లూహెచ్‌వో, సీసీఎంబీ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ముందుగా రోగుల శరీరాల నుంచి సేకరించిన శాంపిల్స్ పరీక్షించినప్పుడు వాటిలో సీసం, నికెల్ ఉన్నట్లు గుర్తించిన డాక్టర్లు, ఇప్పుడు నీటి నమూనాలను పరీక్షిస్తే పురుగుమందుల అవశేషాలు నీటిలో అధికంగా ఉన్నాయని నిర్ధారణ అవుతోందని అంటున్నారు. దీంతో వీటిని మరింత లోతుగా పరీక్షించేందుకు డాక్టర్లు సిద్ధమవుతున్నారు. ఏలూరుకు కృష్ణా, గోదావరి నదుల నుంచి నీళ్లు వస్తున్నాయి. కొన్ని ప్రాంతాలకు కృష్ణా కాలువ నీరు, మరికొన్ని ప్రాంతాలకు గోదావరి నీళ్లను తాగునీరుగా మార్చి అందిస్తున్నారు. ఈ రెండు నదుల నీళ్ల నుంచి సేకరించిన శాంపిల్స్‌లోనూ క్రిమిసంహారకాలు వేల రెట్లు అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది.